33.2 C
Hyderabad
April 26, 2024 02: 19 AM
Slider ప్రత్యేకం

రానున్న ఎన్నికల్లో వైకాపా 25 స్థానాల్లో కూడా గెలవడం కష్టమే

#YS Jagan mohan reddy

రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 25 స్థానాలలో కూడా గెలవడం కష్టమేనని పందెం రాయుళ్లు పందాలు కాస్తున్నట్లుగా ఆ పార్టీ నాయకుడు, నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణంరాజు వెల్లడించారు. మనకు మనమే సింహాలమని, వై నాట్ 175 అని బీరాలు పోతే , ఆ 25 స్థానాలు మరింత తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలలో ప్రతిపక్ష కూటమి అభ్యర్థులు 30 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని పందెం రాయుళ్ళు ఇప్పటికే పందాలు కాస్తున్నట్లు తెలిసిందన్నారు. తమ జిల్లాతో పాటు, పొరుగు జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది తెలిపారు. శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న రోడ్ షోలకు

హాజరవుతున్న జన సందోహాన్ని చూసైనా ఆత్మ స్తుతి పరనిందను మాని , ప్రజలు ఎందుకు మనకు దూరం అవుతున్నారో ఆత్మావలోకనం చేసుకోవాలని సూచించారు. మరో ఆరు నెలల వ్యవధిలో ఎన్నికలు జరగనున్న తరుణంలో గతంలో ఎప్పుడూ లేనంతగా ఇసుక వేస్తే రాలనంత జనం ప్రతిపక్ష నేత సభలకు హాజరవుతున్నారంటే ప్రజాభిప్రాయం ఏమిటో స్పష్టమవుతోందన్నారు. మనల్ని ఎవరూ నమ్మనప్పుడు మా నమ్మకం నువ్వే జగనన్న అని ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికిస్తానంటే, బదులుగా ప్రతిపక్షాలు మా దరిద్రం నీవే అని ఓ రాజకీయ పార్టీగా స్టిక్కర్లు అతికిస్తామని

చెబుతున్నారన్నారు. ఇప్పటికైనా ఇంటింటికి స్టిక్కర్లు అతికించే కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని సూచించారు. ప్రతిపక్ష నేతల సభలు, సమావేశాలకు ఆటంకాలు కలిగిస్తే ప్రజల్లో వారికి ఆదరణ పెరుగుతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు.

ఇప్పుడు సైలెంట్ గా ఉండే జనం… ఎన్నికల్లో తమ ప్రతాపాన్ని రుచి చూపిస్తారు

ఇప్పుడు ఎన్ని అరాచకాలు చేసినా భరించే ప్రజలు, ఎన్నికల్లో మాత్రం తమ ప్రతాపాన్ని అధికార పార్టీకి రుచి చూపిస్తారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా పై సాక్షాధారాలతో సహా పత్రికల్లో ప్రకటన ఇచ్చిన నరేంద్ర అనే వ్యక్తిని తమ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు దేహశుద్ధి చేశారని తెలిపారు. తనపై అధికార పార్టీ నాయకులు దాడి చేశారని నరేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు మళ్లీ అతన్ని చితక బాధడం దారుణమన్నారు . నరేంద్ర పై దాడి చేసిన వారిపై కాకుండా, నరేంద్ర పైనే పోలీసులు కేసు నమోదు చేయడం విస్మయాన్ని కలిగించిందన్నారు. ఇప్పటికే ప్రజలను హింసించింది చాలని , కంసమామలా కాకుండా, మంచి మామయ్య లాగా మారాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సూచించారు. ఇజ్రాయిల్ సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికల్లో విజయం సాధించవచ్చునన్న ఆశలు అడియాశలే అవుతాయని హెచ్చరించారు.

భావం ముఖ్యమా?, అక్షర దోషాలు ముఖ్యమా?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగంలోని అక్షర దోషాలపై తమ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. లోకేష్ ప్రసంగంలోని భావం ముఖ్యమా?, అక్షర దోషాలు ముఖ్యమా?? అంటూ సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాదిరిగా లోకేష్ ఏమి కిష్కింద కాండ భాష మాట్లాడడం లేదన్నారు. ముఖ్యమంత్రి ఏకంగా ఎన్నోసార్లు తన ప్రసంగంలో భావాన్ని మార్చేశారని గుర్తు చేశారు. యువగళం పాదయాత్ర 50వ రోజుకు చేరుకునేసరికి లోకేష్ అద్భుతంగా భాషా దోషాలు లేకుండా

ప్రసంగించగలరన్న ఆశా భావాన్ని వ్యక్తం చేశారు . శ్రీకాళహస్తి దేవాలయంలోకి వెళ్లకుండా లోకేష్ ను పోలీసులు అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. 25 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఒక పెద్ద పార్టీకి, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిని దైవదర్శనానికి వెళ్లకుండా అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేశారని, ఆయన పాదయాత్రకు అప్పుడు అధికారంలో ఉన్న ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా సహకరించారని గుర్తు చేశారు.

తనని వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి ఎంతగా విమర్శించినా ఆయన సంయమనంతో వ్యవహరించారన్నారు . కానీ ప్రస్తుతం లోకేష్ యువ గళం పాదయాత్రకు అడ్డంకులు సృష్టించే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో చర్చనీయాంశంగా మారిందన్నారు. పాదయాత్రకు 500 మంది పోలీసులతో బందోబస్తు లోకేష్ అడిగారా?,

ఆయన్ని వేధించాలని ఉద్దేశంతో అధిక మంది పోలీసులను మోహరించడం దారుణమని మండిపడ్డారు. లోకేష్ పాదయాత్రకు హాజరవుతున్న ప్రజానికాన్ని చూసి బెంబేలెత్తిపోయి, మైకు లాక్కోవడం, స్టూలు తీసివేయడం వంటి చర్యలు ప్రభుత్వానికి శోభనివ్వవని అన్నారు.. లోకేష్ ను రాజమండ్రి ఎంపీ మోర్గాని భరత్ రామ్ విమర్శించిన విధానంపై సోషల్ మీడియా ద్వారా నెటిజనులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారన్నారు. ఎదుటివారిని విమర్శించేటప్పుడు మనము ఏమిటో గుర్తించాలని సూచించారు.

కనిపించని సంక్షేమ పథకాల అమలు ఆనవాళ్లు

సంక్షేమం చేయాల్సిన చోట సంక్షేమ పథకాలు అమలు ఆనవాళ్లే కనిపించడం లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది. విపరీతమైన పన్నుల భారాన్ని మోపి ప్రజల్ని ప్రభుత్వం బెంబేలెత్తిస్తోందని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు . ప్రతిదానికి అమ్మ ఒడి ఇస్తున్నాం … కొంగుముడి ఇస్తున్నామని పేర్కొనడం మినహా ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఈ భూమి పుట్టాక తనలాగా సంక్షేమ పథకాలు ఎవరూ చేపట్టలేదని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, ప్రకాశం జిల్లా, సింగరాయకొండ హాస్టల్ విద్యార్థినీలు అన్నమో రామచంద్ర అని అడుగుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు.

అవకాశం చిక్కినప్పుడల్లా నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థినీ, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదంటూ నిలదీశారు. అనకాపల్లి జిల్లాలో బాలికల వసతి గృహంలో స్నానాలు చేయడానికి బాత్రూములు లేక, బెడ్ షీట్లు అడ్డుగా కట్టుకొని, ఆరు బయట లైట్లను ఆర్పి వేసి స్నానాలు చేయాల్సిన అగత్యం నెలకొన్నట్లు విద్యార్థినీలు రోదిస్తున్నారన్నారు .

ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా సంక్షేమ హాస్టల్ విద్యార్థినీలు తమ సమస్యలను చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియోను రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు. ఇది కూడా టిడిపి, జనసేన ఆడించిన నాటకమేనని జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు అంటారేమోనని ఎద్దేవా చేశారు. 12, 13 ఏళ్ల విద్యార్థులు నటించలేరని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గ సహచరులు తెలుసుకోవాలన్నారు. ఒకపక్క విద్యార్థినీలకు స్నానాలు చేయడానికి బాత్రూములు లేకపోగా, మరొకపక్క భోజనం లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి తలెత్తడం చూస్తుంటే ఆవేదన కలుగుతోందని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

ఎస్సీ ఎస్టీ, బిసి మైనారిటీ సంక్షేమ వసతి గృహాలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాల్సి ఉందని తెలిపారు. సంక్షేమ హాస్టల్లో నిర్వాహణకు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులను మంజూరు చేస్తోందన్నారు. అయినా డబ్బులు లేక విద్యార్థుల కడుపుకు అన్నం పెట్టడం లేదా?, మనసు లేక అన్నం పెట్టడం లేదా అన్నది అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రికి మనసు లేకనే విద్యార్థులను ఖాళీ కడుపుతో ఇబ్బంది పెడుతున్నట్లుగా స్పష్టమవుతోందని విమర్శించారు.

విద్యార్థులకు ఓట్లు లేవు కనుక వారికి డబ్బులు ఖర్చు పెట్టడానికి ముఖ్యమంత్రికి మనసు రావడంలేదన్నారు. సంక్షేమ హాస్టల్ ల నిర్వహణకు సరిపోను నిధులు మంజూరు చేయకపోతే, విద్యార్థుల ఆకలి చావులు చూడాల్సిన దుస్థితి నెలకొంటుందని హెచ్చరించారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉపాధ్యాయుల, విద్యార్థుల నిష్పత్తి అద్భుతంగా ఉందని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత నాలుగేళ్లలో ఒక్క ఉపాధ్యాయుని కూడా కొత్తగా నియమించిన దాఖలాలు లేవన్నారు . ఈ లెక్కన విద్యార్థుల శాతం తగ్గినట్టేనని ప్రభుత్వ పెద్దలు చెప్పకనే చెబుతున్నారని వ్యంగ్యంగా విమర్శించారు

అబద్ధం అంటారు… ఎలా అబద్ధమో చెప్పరు

రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 9.16 లక్షల కోట్ల రూపాయలు అంటే అబద్ధమని చెప్పే ప్రభుత్వ పెద్దలు, ఎలా అబద్దమో మాత్రం చెప్పరని రఘురామకృష్ణం రాజు విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు నాలుగు లక్షల కోట్లని పేర్కొనే ప్రభుత్వ పెద్దలు, అందులో గత ప్రభుత్వం చేసిన అప్పులే 2 లక్షల కోట్లు రూపాయలని పేర్కొంటారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లుగా చెబుతున్న అప్పులో లక్ష అరవై వేల కోట్ల రూపాయలను సంక్షేమానికే ఖర్చు చేశామని చెబుతున్నప్పటికీ, సంక్షేమ వసతి గృహం విద్యార్థులకు అన్నం పెట్టలేనప్పుడు… ఆ నిధులన్నీ ఎటుపోయాయో చెప్పాలని డిమాండ్ చేశారు. వట్టి మాటలు కట్టి పెట్టవోయ్… గట్టి మేలు కాకపోయినా, కొంచెం మేలైన తలపెట్టవోయ్ జగన్మోహన… అని రఘురామకృష్ణంరాజు అపహాస్యం చేశారు.

గత ఏడాది ఆగస్టు మాసంలో తానే దగ్గరుండి, ఈ భూ ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యార్థులకు నిత్యం సరఫరా చేసే ఆహార పదార్థాల జాబితాను తయారు చేశానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ప్రచారం పతాక స్థాయిలో చేసుకుంటూ, ఆచరణలో అమలు చేయడం లేదన్నారు. విద్యార్థుల మెస్ బిల్లును 25% పెంచామని చెప్పుకుంటూనే, గత ప్రభుత్వ హయాంలో పెంచిన మెస్సు బిల్లులు తప్పితే, కొత్తగా ఈ ప్రభుత్వం మూడేళ్లలో పెంచిందేమీ లేదన్నారు.

నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో మెస్ బిల్లులు పెంచకపోతే, విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఎలా అందుతుందని ప్రశ్నించారు. హాస్టల్లో వార్డెన్ లే అప్పు చేసి మరి విద్యార్థులకు భోజన సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిసిందన్నారు. తక్షణమే సంక్షేమ హాస్టళ్ల పరిస్థితులపై ముఖ్యమంత్రి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి, బకాయిలు పడిన 150 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించాలని రఘురామకృష్ణం రాజు కోరారు.

న్యాయమూర్తి పై కేసు పెడతారా?,

ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి తో పాటు పలువురు బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా కోర్టు తిరస్కరించిందని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆర్థిక నేరాల కేసులను ఉదాహరిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా బెయిల్ తిరస్కరిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొనడం జరిగిందన్నారు.

గతంలో తాను కీలక పదవుల్లో కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించినందుకే తనపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసి లాకప్ లో చిత్రహింసలు గురి చేశారన్నారు. మరి ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి బెయిల్ తిరస్కరణ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి, విజయ సాయి రెడ్డిల ఆర్థిక నేరాల కేసులను ప్రస్తావించినందుకు న్యాయమూర్తి పై కూడా కేసులు పెడతారా అంటూ వ్యంగంగా ప్రశ్నించారు.

Related posts

తడి పొడి చెత్తను వేరుచేస్తేనే స్వచ్ఛ భారత్

Satyam NEWS

హనుమంత వాహనంపై వేంకటాద్రిరాముడు

Satyam NEWS

ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్

Murali Krishna

Leave a Comment