నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన సంచార వర్గాల వారి అభ్యున్నతికి కృషిచేయాలని వై ఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎన్నికలకు ముందు జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వేసిన బీసీ అధ్యయన కమిటీ నేడు ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై నేడు సీఎం విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యన్నారాయణ, మోపిదేవి వెంకటరమణ, అనిల్‌కుమార్ యాదవ్, ధర్మాన కృష్ణదాస్, శంకరనారాయణ వారితో బాటు బీసీ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. బీసీల జీవన ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.
10 వేల నుంచి లక్ష జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని ఒక కేటగిరీగా, లక్ష నుంచి 10 లక్షల వరకూ ఉన్నబీసీ వర్గాల వారిని రెండో కేటగిరీ, 10లక్షలు ఆ పైబడి జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని మూడో కేటగిరీగా విభజించి ఆ మేరకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
పదివేల లోపు జనాభా ఉన్న సంచార జాతులు, గుర్తింపునకు నోచుకోని వర్గాల వారికి సరైన గుర్తింపు నిచ్చి వారు సమాజంలో నిలదొక్కుకునేలా ప్రభుత్వ పరంగా చేయూత నివ్వాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. వారికి గృహనిర్మాణం, పెన్షన్లు, రేషన్ కార్డులు, కులవృత్తులు చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక వెసులుబాట్లు కల్పించాలన్నదిశగా చర్చజరిగింది.