మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించడంతో తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. తిరుపతిలో తొక్కిసలాట సంఘటనపై పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుపతిలో పర్యటించారు. అక్కడి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అదే సమయంలో బాధితులతో మాట్లాడి వారికి భరోసానిచ్చారు. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ లోపు తిరుపతి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి టీటీడీ భవన్ లో సమావేశానికి వెళ్లే వరకూ ఆగి ఆ తర్వాత స్విమ్స్ ఆసుపత్రి వద్దకు వచ్చారు. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో అక్కడ పర్యటిస్తున్న సమయంలో జగన్ రెడ్డి కూడా తాను స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లాల్సిందేనని పట్టుపట్టారు. పోలీసులు అందుకు అనుమతివ్వలేదు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతుండగా వైసీపీ అధినేత జగన్ అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరుపార్టీల నినాదాలతో హాస్పిటల్ ప్రాంగణం హోరెత్తుతోంది. అరగంట ఆలస్యంగా రావాలని పోలీసులు చెప్పిన వినకుండా జగన్ అక్కడికి చేరుకున్నారు. దీంతో ఓవైపు జై జగన్.. మరోవైపు జై జనసేన అంటూ పార్టీల కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. దాంతో తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.