రాజధాని విజయవాడ సమీపంలో ఉంచాలని శివరామకృష్ణ కమిటీ చెప్పిందని అయితే దాన్ని వైసిపి నాయకులు వక్రీకరించి చెబుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతి ప్రాంతం వరద ప్రాంతమని, ఇక్కడ భవనాలకు లోతైన పునాదులు తీయాలని చెప్పడం అంతా రాజకీయమేనని ఆయన అన్నారు.
ఈ ప్రాంతంలో భవనాలు లేవా? ప్రజలు ఉండడం లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రైతులు చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా చంద్రబాబు కుటుంబం, నందమూరి కుటుంబసభ్యులు దీక్షా శిబిరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం కష్టాల సంక్రాంతి అని వ్యాఖ్యానించారు. ప్రతి సంక్రాంతికి నారా వారి పల్లెకు వెళ్లేవాళ్లమని ఈ సారి సంక్రాంతి జరుపుకోవడం లేదని చంద్రబాబు తెలిపారు. అమరావతి కేవలం 29 గ్రామాల సమస్య కాదని ఇది 5 కోట్ల మంది ఏపీ ప్రజల సమస్య అని ఆయన అన్నారు.
ప్రజల త్యాగాన్ని కూడా గుర్తించలేని మూర్ఖుడు జగన్ అని తీవ్ర స్థాయిలో చంద్రబాబు విమర్శించారు. అందరినీ బాధపెట్టి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడని తీవ్రస్థాయిలో విమర్శించారు. వరదలు వస్తాయని, ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని అసత్యాలు చెప్పారని చంద్రబాబు మండిపడ్డారు.