వైసీపీ హయాంలో దళితులపై జరిగిన దారుణాలపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. జగన్ సర్కార్‌లో ఎస్సీలకు తీవ్ర అన్యాయం చేశారని, అనేక మంది దళితులు హత్యకు గురయ్యారని కూటమి ఎమ్మెల్యేలు మండిపడ్డారు. జగన్ దళిత ద్రోహి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అనుకుంటూనే అన్ని వర్గాలను జగన్ మోసం చేశారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో సాంఘీక, మహిళా, శిశు, గిరిజన, వెనుకబడిన తరగతుల, న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖలకు నిధుల కోసం ఆయా మంత్రుల ప్రతిపాదనలపై చర్చ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు ప్రసంగించారు.
ఈ సందర్భంగా గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిధుల కేటాయింపు చేయడంతో జరిగిన న్యాయంపై లెక్కలతో సహా ప్రసంగించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో దాదాపు 56 వేల 981 మంది ఎస్సీలపై దాడులు జరిగాయన్నారు తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్. 220 మంది దారుణంగా హత్యకు గురయ్యారని చెప్పారు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను చిత్రహింసలకు గురిచేశారని గుర్తు చేశారు. వైసీపీ నేతల చిత్రహింసలతో డాక్టర్ సుధాకర్ అత్యంత దయనీయస్థితిలో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక రాజమహేంద్రవరంలో ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్‌ను అడ్డుకుంటే శిరోమండనం చేయించారని గుర్తు చేశారు. మాస్క్ పెట్టుకోలేదని చీరాలలో కిరణ్ అనే యువకుడికి పోలీసులు వేధించి చంపేశారన్నారు శ్రవణ్ కుమార్. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకు అచ్చన్న అనే పశువైద్యాధికారిని కూడా వేధించి చంపారని వైసీపీ దారుణాలను కళ్లకు కట్టారు. ఇక ఎస్సీలకు సంబంధించిన 15 పథకాలకు YSR, జగన్ పేర్లు పెట్టుకున్నారని మండిపడ్డారు శ్రవణ్ కుమార్.
చంద్రబాబు ఎంతో ముందు చూపుతో..గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మూడు ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో ఉన్న అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారన్నారు ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు. కానీ దళితులు బాగుపడడం ఇష్టం లేని జగన్ అమరావతిని నాశనం చేయాలని చూశారని మండిపడ్డారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 400 మంది ఎస్సీ విద్యార్థులను ఉన్నత చదువులకు విదేశాలకు పంపి, నిధులిచ్చారన్నారు.
జగన్ హయాంలో చివరి ఏడాది కేవలం 16 మందికే ఆ నిధులిచ్చారని..టీడీపీ ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం ద్వారా 3 వేల ఎకరాలు దళితులకు పంచితే, జగన్ ఒక్క ఎకరా కూడా ఇవ్వలేదన్నారు రామాంజనేయులు. దళితుల రక్షణ కోసం తీసుకువచ్చిన చట్టాలను వైసీపీ హయాంలో దళితులపైనే ప్రయోగించారన్నారు మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు. అమరావతికి భూములిచ్చిన దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి జైలుకు పంపారని గుర్తు చేశారు.
పులివెందుల నియోజకవర్గంలోనూ ఓ దళిత మహిళను అత్యాచారం చేసి, హత్యచేస్తే.. నేను, వంగలపూడి అనిత అక్కడికి వెళ్లినందుకు.. దళితులమైన మాపైనే ఎట్రాసిటీ కేసులు పెట్టారని గుర్తు చేసుకున్నారు. జగన్ వచ్చాక దళితుల సాగులో ఉన్న 11 వేల ఎకరాలు వారినుంచి లాక్కున్నారని ఆరోపించారు. అయిదేళ్లలో ఒక్క రుణం కూడా మంజూరు చేయని దళిత ద్రోహి జగన్ అంటూ ధ్వజమెత్తారు ఎంఎస్ రాజు.
ఇక గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 28 పథకాలను తొలగించారని గుర్తు చేశారు మాజీ మంత్రి, రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్. కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో ఆ పథకాల్లో చాలావాటికి నిధులు కేటాయించిందన్నారు. ఇక వైసీపీ హయాంలో SC కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేయడంపైనే జగన్ దృష్టి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్.
అనంతబాబు ఉదంతాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక మదనపల్లెలో ఓంప్రతాప్ అనే యువకుడు మద్యంలో నాణ్యత లేదని, అధిక ధరలకు విక్రయిస్తున్నారని పోస్ట్ పెడితే..అతడిని దారుణంగా దూషించారని..అవమానంతో మరుసటి రోజే అతడు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా జగన్ ఐదేళ్ల పాలనలో ఏనాడూ దళితులను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు కూటమి నేతలు. వారి అభివృద్ధికి కృషి చేయలేదని ధ్వజమెత్తారు.