మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి… పూర్తి భ్రమల్లో మునిగితేలుతున్నారా?? లేక, ఆయనకి రిపోర్టులు సరిగా అందించడం లేదా.? గ్రౌండ్‌లో ఉన్న పరిస్థితిని ఆయనకి ఉన్నది ఉన్నట్లుగా చేరవేయడంలో వైసీపీ నేతలు జాగ్రత్త పడుతున్నారా?? లేక, ఆయనని మోసం చేస్తున్నారా.?? ఈ ప్రశ్నలే ఇప్పుడు వైసీపీ కేడర్‌ని వేధిస్తున్నాయి. అధికారం కోల్పోయిన నాటి నుండి జగన్ నోటి నుండి వెలువడుతున్న స్పీచ్‌లలో పదజాలం మారడం లేదు.. ఇప్పటికీ ఆయన తాను తన మేనిఫెస్టోని 100 శాతం అమలు చేశానని, ప్రజలకు బటన్ నొక్కి లక్షల కోట్లు పంచిపెట్టానని, ఇటు కూటమి సర్కార్ మాత్రం హామీలను అమలు చేయడం లేదని ఎద్దేవా చేస్తున్నారు.
కొత్త ఏడాది కొత్తగా లండన్ వెళ్లి వచ్చిన తర్వాత అయిన జగన్ తన రూట్ మార్చుకుంటారని, కూటమి సర్కార్‌పై సద్విమర్శలు చేస్తారని ఆశించారంతా.. కానీ, జగన్ అదే డప్పు కొట్టుకుంటున్నారు.. కూటమి సర్కార్ సూపర్ సిక్స్‌ని పట్టించుకోవడం లేదని, ఆయన బిర్యానీ పెడితే… కూటమి ప్రభుత్వం కనీసం పలావు కూడా వడ్డించడం లేదని విమర్శిస్తున్నారు. అంతేకాదు, తన లిక్కర్ పాలసీ అద్భుతమని, ప్రయివేటు వ్యక్తులకు భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వమే దగ్గరుండి మరీ పంపిణీ చేసిందని, దీనిలో ఎలాంటి అవకతవకలు లేవని అన్నారు వైసీపీ అధినేత.. ఈ వితండవాదమే జగన్‌కి మైనస్‌గా మారుతోంది.
నాణ్యతలేని లిక్కర్‌తో వేల మంది ప్రాణాలను తీశారని నేటి ప్రభుత్వం ఆధారాలతో సహా వివరిస్తుంటే, జగన్ మాత్రం తాను శుద్ధపూస… సుప్పిని..సంప్రదాయిని అన్నట్లు మాట్లాడుతున్నారు.. ఈ అంశంపై వైసీపీ శ్రేణులు సైతం జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఈ తీరునే వైసీపీ సొంత కేడర్ తప్పు పడుతోంది.. నిజంగా ఏపీ ప్రజలు ఏమి కోరుకుంటున్నారు.?? వారు ఆశిస్తున్నది ఏమిటి.??? జగన్ ఇప్పటికీ ఆత్మావలోకనం చేసుకోలేదని అర్ధం అవుతోంది.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేదు.
రాష్ట్ర జీవనాడి పోలవరం నిర్మాణం ఇంచ్ పురోగతి లేకుండా ఐదేళ్లు ఎలా నానబెట్టాడో ప్రజలంతా చూశారు. ఇక, మూడు రాజధానులతో జగన్.. అమరావతిని ఎలా చంపాడో చూశాం.. రోడ్లని గుంతలమయం చేశాడు. ఉద్యోగాలు రాకుండా, కంపెనీలు అడుగుపెట్టకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు.. ఇవే జగన్‌కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాయి.. తాను కేసుల నుండి బయటపడడానికి, అధికారాన్ని సంపాదనకు కేరాఫ్‌గా మార్చుకొని ఏపీని నాశనం చేశాడు.. ఇవే జగన్‌ని అధికారానికి దూరం చేశాయి. ఇలాంటి అంశాలేవీ జగన్‌కి చేరలేదా..?? ఆయనకి తెలియదా..? తెలిసినా మేనిఫెస్టోనే హైలైట్ చేయాలనుకుంటున్నారా?? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
కొందరు మాత్రం తాము జగన్‌కి చెప్పినా వినడం లేదని, నవరత్నాల జపం తప్ప మరేమీ చేయడం లేదని వాపోతున్నారు.. మరికొందరు మాత్రం జగన్‌కి ఇంకా బుద్ధి రాలేదని, ఆయన ఇంకా మేనిఫోస్టో మోజులోనే ఉన్నారని చెబుతున్నారు.. మొత్తమ్మీద, ఆయన భ్రమల్లో ఉన్నారని అంటున్నారు ఇంకొందరు వైసీపీ నేతలు.. మరి, ఆయనను నిద్ర నుండి ఎవరు మేల్కొలుపుతారు..?? టోటల్‌గా జగన్ 2.O ఏమో కానీ, భ్రమ 2.O నుండి బయటకు రావాలని వైసీపీ నేతలే కోరుకుంటున్నారు.. మరి, భజనలకు అలవాటు పడిన ఈ వైసీపీ దేవుడు భ్రమల నుండి బయటకు వస్తారా..??