మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెండు నాల్కల ధోరణి వక్ఫ్ బిల్లు ఆమోదం సందర్భంగా జాతీయ స్థాయిలో మరోమారు వెల్లడి అయింది. జాతీయ మీడియా మొత్తం జగన్ అనుసరించిన డబుల్ స్టాండర్డ్స్ పైనే చర్చ జరుపుతున్నది. బీజేపీ, మిత్రపక్షాలకు సంపూర్ణ మెజారిటీ ఉన్న లోక్ సభలో వక్ప్ బిల్లును వ్యతిరేకించినట్లు నటించిన జగన్ పార్టీ, బీజేపీకి బలం లేని రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేసింది. లోక్ సభలో వేరే ఏ పార్టీ మద్దతు లేకుండానే బీజేపీ వక్ఫ్ బిల్లును ఆమోదించుకునే అవకాశం ఉన్నది.
రాజ్యసభలో బిజెపికి సహకారం అవసరం. అందుకే బీజేపీకి ఎక్కడ మద్దతు అవసరమో అక్కడ జగన్ రెడ్డి మద్దతు పలికారు. ముస్లింల ప్రయోజనాలను తాను కాపాడుతున్నట్లు చెప్పుకునే జగన్ రెడ్డి ఇలా ఎందుకు చేశాడనేది ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నది. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు మద్దతుగా వైసీపీ ఎంపీలు ఓటు వేశారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు నిన్నటి వరకు కబుర్లు చెప్పిన వైసీపీ నేతలు ఇలా ఎందుకు చేశారనేది ప్రశ్న. జగన్ సూచనలతోనే రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు మద్దతుగా వైసీపీ ఎంపిలు ఓటు వేసినట్లు కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఓటింగ్ తరువాత విప్ జారీతో వైసీపీ డ్రామా మొదలు పెట్టింది.
ఓటింగ్ తరువాత విప్ లోక్ సభ చరిత్రలోనే లేదంటూ జాతీయ మీడియా విమర్శలు గుప్పించింది. జగన్ తీరును ఎండగడుతూ జాతీయ మీడియా కథనాలను ప్రచురించింది. అదే విధంగా బిల్లును వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలు జగన్ చేసిన మోసాన్ని అన్ని వేదికలపైనా చెబుతున్నారు. రాజ్యసభలో బిల్లుకు మద్దతుపై మైనారిటీ వర్గంలో తీవ్ర అసంతృప్తి ఉంది. జగన్ తమను మోసం చేశాడనే భావనలో ముస్లింలు ఉన్నారు. వక్ఫ్ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకం అంటూ నిన్నటి వరకు వైసీపీ వ్యాఖ్యలు చేసింది మరి నేడు రాజ్యసభలో సైలెంట్ గా మద్దతు ఎందుకు ఇచ్చిందని ముస్లింలు ప్రశ్నిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీని పదే పదే విమర్శించే మజ్లీస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ ఇప్పుడు జగన్ రెడ్డిని విమర్శిస్తాడా అని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. జగన్ తీరుతో షాక్ తిన్న ముస్లిం వర్గాలు ఇప్పుడు వైసీపీ వెన్నుపోటు రాజకీయాలపై మండిపడుతున్నాయి. జగన్ ను సమర్థించే ఒవైసీని కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు.