25.7 C
Hyderabad
January 15, 2025 17: 46 PM
Slider సంపాదకీయం

కులాల మధ్య తగాదాకు జగన్ రెడ్డి తాజా కుట్ర

#pavankalyan

జనసేన నాయకుడు నాగబాబు ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించిన వెంటనే వైసీపీ అనుకూల మీడియా రాష్ట్రంలో కులాల మధ్య తగాదా పెట్టే ప్రయత్నాలను ఆరంభించింది. వైసీపీ నేతలు కూడా నేరుగా బీసీలను రెచ్చగొడుతూ ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతల ప్రచారానికి బీసీ వర్గాల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు కానీ వారు మాత్రం తమ ప్రయత్నాలను ఆపడం లేదు. తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల వారికి పుట్టినిల్లు లాంటిది. 1982లో తెలుగుదేశం ఆవిర్భవించిన నాటి నుంచి కూడా అన్న ఎన్టీఆర్‌  బీసీ సోదరులకు సీట్లు ఇచ్చి గెలిపించి మంత్రివర్గంలో కీలక శాఖలు ఇచ్చి గౌరవించారు.

అదే సాంప్రదాయాన్ని కొనసాగించడమే కాకుండా బీసీల ఆర్థికాభివృద్ధికి కూడా బాటలు వేసిన నాయకుడుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరు పొందారు. కాపు కులస్తులకు రిజర్వేషన్లు ఇవ్వను అని వ్యూహాత్మకంగా ప్రకటించడం ద్వారా 2019 ఎన్నికలలో జగన్ బీసీ కులస్తుల ఓట్లు పొందారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అనేకమంది బీసీలను అత్యంత అమానవీయంగా చంపేశారు. అమర్‌నాథ్‌ గౌడ్‌ అనే బీసీ బాలుడు, తన అక్కను ఎందుకు వేధిస్తున్నారని వైసీపీ నాయకులను అడిగితే,ఆ బాలుడి పుస్తకం చించి కాగితాలను నోటిలో కుక్కి, పెట్రోలు పోసి కాల్చేశారు.

ఆ కుటుంబాన్ని జగన్ గానీ, వైసీపీ నేతలు గానీ కనీసం పరామర్శించలేదు. ఇలా ఒక్కటి కాదు బీసీలపై జగన్ ప్రభుత్వంలో లెక్కలేనని దౌర్జన్యాలు జరిగాయి. జగన్ తన పాలనలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌ను 10 శాతం తగ్గించారు. బీసీలకు చెందిన 8వేల ఎకరాల ఎసైన్డ్‌ భూములు కొట్టేశారు. ఆదరణ పథకం కింద గతంలో లబ్ధిదారులు చెల్లించిన 10 శాతం డిపాజిట్‌ కూడా ఇవ్వలేదు. 56 కార్పొరేషన్లకు నిధులు, విధులు లేవు. ఇలాంటి దుర్భర స్థితిలో ఉన్న బీసీలు మళ్లీ తమ సొంత పార్టీ అయిన తెలుగుదేశం వైపు వచ్చేశారు.

దాంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చరిత్ర ఎరుగని ఘన విజయం సాధించింది. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలనే నిర్ణయం రావడంతో వైసీపీ మళ్లీ తన కుట్రలకు తెరతీసింది. కాపు కులస్తులకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని, బీసీలకు అన్యాయం చేస్తున్నదనే విచిత్ర వాదనను వైసీపీ తెరపైకి తెస్తున్నది. కూటమి ప్రభుత్వంలో 24 మంది మంత్రులు ఉండగా అందులో 8 మంది మంత్రులు బీసీ కులాలకు చెందిన వారే. అదీ కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వారే ఏడుగురు బీసీ మంత్రులు ఉన్నారు.

తూర్పు కాపు, శెట్టిబలిజ, కరుబ లాంటి వెనుకబడిన తరగతుల వారికి తొలి సారిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. అదే విధంగా నలుగురు కాపు కులస్తులు మంత్రులుగా ఉన్నారు. మొత్తం 25 మంది మంత్రులను తీసుకోవడానికి వీలు ఉన్నా తొలి విడతలో 24 మందిని మాత్రమే మంత్రులుగా తీసుకున్నారు. మరో మంత్రి వర్గ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉన్నందున అది మిత్రపక్షమైన జనసేనకు కేటాయించారు. జనసేన పార్టీలో సీనియర్ నాయకుడు అయిన నాగబాబుకు తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు చైర్మన్ గా అవకాశం వస్తుందని చాలా మంది అనుకున్నారు. అయితే ఆ పోస్టు తెలుగుదేశం పార్టీ నేతకు దక్కింది. రాజ్యసభ సభ్యుడుగా నాగబాబుకు అవకాశం వస్తుందనే ఊహాగానాలు కూడా చెలరేగినా రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది.

ఈ దశలో మంత్రి వర్గంలో ఖాళీ గా ఉన్న మంత్రి పదవిని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు జనసేనకు కేటాయించారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తమకు కేటాయించిన మంత్రి వర్గ స్థానాన్ని తమ పార్టీ సీనియర్ నాయకుడు అయిన నాగబాబు కు కేటాయించారు. ఇది జనసేన నిర్ణయమే కానీ ఇందులో తెలుగుదేశం పార్టీ జోక్యం చేసుకోవడానికి వీలు ఉండదు. మంత్రివర్గ స్థానం జనసేనకు కేటాయించాలనే నిర్ణయాన్ని తీసుకున్న తెలుగుదేశం పార్టీ ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలో సూచించదు. అది జనసేన అధినేత ఇష్టం. వాస్తవాలు ఇలా ఉంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కాపు కులస్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని బీసీలకు అన్యాయం చేస్తున్నదని దుర్మార్గపు ప్రచారాన్ని వైసీపీ చేస్తున్నది.

Related posts

24 న సూర్యాపేటకు కేసీఆర్

mamatha

పెరిగిన ఆర్టీసీ చార్జీలకు వామపక్షాలు నిరసన…

Satyam NEWS

అయ్యగారు ఫుల్ బిజీ ఆయన చెబితే కానీ పని జరగదు

Satyam NEWS

Leave a Comment