ఒక ఆడపిల్లను ముంబయి నుంచి ఎత్తుకొచ్చి పోలీసులతో చిత్రహింసలకు గురిచేసిన జగన్ మోహన్ రెడ్డి పై ఇప్పుడు మహిళా లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. జగన్ రెడ్డి సీఎంగా ఉన్నంత కాలం ఈ విషయాన్ని తొక్కిపెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ నాటి ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. సినీ నటిని చిత్ర హింసలు పెట్టిన సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా జగన్ రెడ్డి ప్రవర్తించిన తీరును మహిళలు అసహ్యించుకుంటున్నారు.
తప్పును ఒప్పుకునే రీతిలో కాకుండా తప్పే జరగలేదు అనే రీతిలో జగన్ రెడ్డి మనుషులు చెప్పడంపై కూడా పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జగన్ హయాంలో ఒక ముంబయి హీరోయిన్‌ను వేధించి విజయవాడ పోలీసులు పెద్ద సెటిల్మెంట్ చేసిన వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తన పార్టీ వ్యక్తిని రక్షించడం కోసం జగన్ రెడ్డి సరిదిద్దుకోలేని తప్పు చేశారంటున్నారు. ముంబయి హీరోయిన్ కాదంబరితో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కు ప్రేమాయణమో, అక్రమ సంబంధమో, మరే రాచకార్యమో గానీ బాగా గట్టిగా ఉంది.
కొంతకాలం బాగానే నడిచినా అది బెడిసి కొట్టి ఇద్దరు విడిపోయారు. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ కు ప్రముఖ వ్యాపారవేత్త సజ్జన్ జిందాల్ కు దగ్గరి సంబంధం ఉంది. వీరిద్దరూ కూడా జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. విద్యాసాగర్, సజ్జన్ జిందాల్, జగన్ రెడ్డి మధ్య హీరోయిన్ కాదంబరి నలిగిపోయింది. చివరకు జగన్ రెడ్డి ఆదేశాలతో పోలీసుల టార్చర్ కు కూడా గురైంది. జఠ్వాని ముంబయిలో సజ్జన్‌పై రేప్ కేసు పెట్టింది. ఆ కేసు నుంచి బయటపడేందుకు సజ్జన్ తన మిత్రుడైన ఏపీ సీఎం జగన్‌ను (అధికారంలో ఉన్నప్పుడు) ఆశ్రయించారు.
ఎక్కడో ముంబయిలో జరిగినదానికి తానేం చేయగలనని ఆయన సున్నితంగా తిరస్కరించవచ్చు. కానీ వారిద్దరి మధ్య ఉన్న స్నేహం, ఆర్థిక సంబంధాలు ఆ పని చేయనివ్వలేదు. మిత్రుణ్ణి ఎలాగైనా బయటపడేయాలని తన వందిమాగధులకు పురమాయించేశాడు. ఇబ్రహీంపట్నంలో విద్యాసాగర్‌కు ఉన్న భూమిని జఠ్వానీ కొనుగోలు చేసిందట. ఎక్కడో ముంబయిలో ఉండే సినీ నటి తనకు ఏమాత్రం పరిచయం లేని, అసలు తనకు తెలియని విజయవాడలో భూమి కొనడం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం లేదు.
సజ్జన్ కోసం తెలివిగా విద్యా సాగర్‌తో ఈ కేసు పెట్టించారనేది అభియోగం. దీంతో అతనితో కేసు పెట్టించి దాన్ని ఉపయోగించుకుని ఆమె కుటుంబం మొత్తాన్ని వేధించి ముంబయిలో సజ్జన్ జిందాల్‌పై పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా చేశారు. ఇందులో అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా, డీసీపీ విశాల్ గున్నీది కీలకపాత్ర.
సీఎం ఆదేశం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వారికి ఆ సెటిల్మెంట్ చేయకతప్పలేదు. పూర్తిగా అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో ఈ వ్యవహారం నడిచిందనే అభిప్రాయం లేకపోలేదు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో గోప్యంగా జరిగిన ఈ మొత్తం భాగవతాన్ని బయటపెట్టేసింది. ఈ కేసులో కాదంబరికి అన్యాయం జరిగిందనడంలో సందేహం లేదు. కుక్కల విద్యాసాగర్ ను, సజ్జన్ జిందాల్‌ను రక్షించే క్రమంలో జగన్ రెడ్డి అభాసుపాలయ్యాడు.