ఏపీలో తన ఉనికే ప్రశ్నార్థకంగా మారిన వేళ.. తన మనుగడ సజావుగా సాగేందుకు వైస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుతో రహస్య బంధం కొనసాగిస్తూ వస్తున్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు తన పంథా మార్చబోతున్నట్లు చెబుతున్నారు. ఎన్డీయేతో ఆ రహస్య బంధం కూడా వదిలేసి ఇక ఇండియా కూటమితో కలవాలని జగన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఇప్పటికే రాయబారాలు కూడా మొదలుపెట్టారని అంటున్నారు.
ప్రస్తుతం ఏపీలో, కేంద్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వమే ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీయే కూటమికి వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. తమ ధర్నాకు మద్దతివ్వాలని వివిధ పార్టీలను జగన్ కోరినా ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దేశంలో ఉన్న చాలా పార్టీలకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. తమకు మద్దతివ్వాలని కోరినా ఎవరూ సహకరించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా కూటమిలో ఉన్న కీలకమైన, యూపీకి చెందిన సమాజ్ వాదీ పార్టీ జగన్ మోహన్ రెడ్డి ధర్నాకు మద్దతు ప్రకటించింది.
బీజేపీ సహా ఎన్డీయే పక్షాలతో ఎప్పుడూ విభేదించే అఖిలేష్ యాదవ్.. జగన్ కు సంఘీభావం ప్రకటించడం.. ఆసక్తిని కలిగించింది. దీంతో జగన్ ఇండియా కూటమిలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారనే ప్రచారం మొదలైంది. రాజ్యసభలో ఇప్పటికే ఎన్డీయేకు పూర్తిబలం లేదు. జగన్ కూడా బయట నుండి ఎన్డీయేకు మద్దతిస్తారని ప్రచారం జరిగింది. మరోవైపు, లోక్ సభలో ఎన్డీయే కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీని కాదని జగన్ ను ఎన్డీయే దగ్గరకు తీసే పరిస్థితులు అస్సలు లేవు. ఫలితంగా బీజేపీ పెద్దలెవరూ కూడా జగన్ కు అండగా ఉండే పరిస్థితులు కూడా లేవు.
అందుకే జగన్ కూటమివైపు ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇండియా కూటమిలో చేరేందుకు జగన్ కు కాంగ్రెస్ పార్టీతో గతంలో పెట్టుకున్న విభేదాలు అడ్డుగా ఉన్నాయి. అందుకే మధ్యవర్తిగా అఖిలేష్ యాదవ్ వచ్చి ఉంటారని అంటున్నారు. అయినా, ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోయేందుకు కారణమైన జగన్ ను సోనియా గాంధీ, రాహుల్ తమ దగ్గరకైనా రానిస్తారా అన్న అనుమానం బలంగా ఉంది. పైగా ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా జగన్ బద్ధ శత్రువుగా మారిన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల ఉన్నారు.
ఆమె జగన్ కు వ్యతిరేకంగానే పోరాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి ప్రభుత్వం జగన్ ను అక్కున చేర్చుకుంటుందని అనుకోలేమని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రయత్నాలు చూసి.. అటు మోదీ కూడా జగన్ పై సీరియస్ అయినట్లు చెబుతున్నారు. కీలక బిల్లుల సమయంలో తమకు మద్దతు ఇవ్వకపోయినా, ఇండియా కూటమితో సఖ్యంగా మెలిగినా.. పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని హెచ్చరించినట్లుగా చెబుతున్నారు.