మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైనా అశాంతి రేపాలనే కోరిక ఉంది. అందుకోసం అందివచ్చిన అన్ని అవకాశాలను వాడుకుంటూనే ఉన్నారు. తాజాగా సినీ నటుడు అల్లూ అర్జున్ అరెస్టు విడుదల విషయంలో కూడా జగన్ రెడ్డి అదే పని చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. అయితే జగన్ రెడ్డి ప్రయత్నానికి ఎక్కడా ఎలాంటి స్పందన రాకపోవడం మనం గమనించవచ్చు. హైదరాబాద్‌లో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేస్తే, లక్ష్మీ పార్వతి వెంటనే మీడియా ముందుకు వచ్చి, అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక చంద్రబాబు నాయుడి హస్తం ఉందని చెప్పడాన్ని చూస్తే జగన్ ఏమేరకు ప్లాన్ చేశారో అర్ధం చేసుకోవచ్చు.
చంద్రబాబు నాయుడు ఈ కేసుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. అర్జున్ తన అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు వస్తే తొక్కిసలాట జరిగి మహిళ చనిపోతే పాపం ఆ పిల్లాడికి (అల్లు అర్జున్) ఏం సంబంధం? అతనిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఈ కుట్రలో చంద్రబాబు నాయుడి హస్తం ఉందని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. అల్లు అర్జున్ విషయంలో ఇంత దూరం ఆలోచించి దీని కంతటికీ చంద్రబాబు నాయుడే కారణమని కనిపెట్టిన లక్ష్మీ పార్వతి, మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి అసలు తెలియనట్లు ఒక్క ముక్క మాట్లాడలేదు.
ఒకవేళ మాట్లాడి ఉంటే వాటికీ చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించి ఉండేవారేమో? అదే విధంగా జగన్ ట్వీట్ చేయడం, అంబటి రాంబాబు ఇప్పటికి పది సార్లు పుష్ప 2 సినిమా పై ట్వీట్ చేయడం చూస్తుంటే అల్లూ అర్జున్ పై వైసీపీ ముద్ర స్పష్టంగా కనిపిస్తున్నది. అల్లు అర్జున్ కుటుంబాల మద్య చిచ్చు రగిలించి, పవన్ కళ్యాణ్‌ని రెచ్చగొట్టేందుకు వైసీపీ విఫలయత్నాలు చేస్తూనే ఉంది. అందుకే వైసీపీ అల్లు అర్జున్‌ని అంతగా వెనకేసుకువస్తోంది. పుష్ప-2 విడుదలైనప్పుడు వైసీపీ చేసిన హడావుడే ఇందుకు నిదర్శనం కాగా, ఇప్పుడు ఆ పార్టీకి చెందిన లక్ష్మీ పార్వతి అల్లు అర్జున్‌ని ఈ విధంగా వెనకేసుకువస్తూ మాట్లాడటం మరో నిదర్శనంగా భావించవచ్చు.
అల్లు అర్జున్ పట్ల తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు ఆవిదంగా వ్యవహరించి ఉండకూడదని ఆమె చెప్పి ఉంటే ఎవరూ ఈ విధంగా అపార్ధం చేసుకోరు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడుతో ముడిపెట్టి మాట్లాడటం ద్వారా అల్లు అర్జున్ పేరుతో వైసీపీ రాజకీయాలు చేస్తోందని స్పష్టమవుతోంది. జగన్ సహవాసం చేసిన వారిలో చాలా మంది జైలుకి వెళ్ళి వస్తూనే ఉన్నారు. ఆయనను నమ్ముకున్న లక్షల మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారు. ఆయన అండచూసుకొని పేట్రేగిపోయిన సోషల్ మీడియా కార్యకర్తలు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆయన అండ చూసుకొని బియ్యం అక్రమ రవాణా చేసినవారు, భూ కబ్జాలు చేసినవారు కేసులలో బుక్ అవుతున్నారు. అంటే ‘వైసీపీ గాలి’ తగిలినా చాలా ప్రమాదమన్న మాట. అదే అల్లు అర్జున్ అరెస్టుతో మరోసారి నిరూపితమైంది.