సినీనటుడు అల్లూ అర్జున్ కు అనుకూలంగా ట్వీట్లు వేసి కులాల మధ్య తగాదాలు పెట్టేందుకు ప్రయత్నించిన మాజీ సీఎం జగన్ రెడ్డి తాజాగా మతాల మధ్య తగాదాకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అందుకు వక్ఫ్ బోర్డు విషయాన్ని వాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో వక్ఫ్ బోర్డును రద్దు చేస్తూ, జీవో నెంబర్ 47ను ఉపసహరించుకుంటూ 2024 నవంబర్ 30న చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 75ను విడుదల చేసింది. దీనికి ముందు, ఆ తర్వాత చాలా జరిగాయి.
కానీ జగన్ మీడియా తనకు కావాల్సిన ఈ ఒక్క వార్తనే తీసుకుని ఫేక్ ప్రచారాల ద్వారా ముస్లింలను పక్కదారి పట్టిస్తున్నాడు. దాంతో ముస్లింలలో కూడా ఒక రకమైన గందరగోళం ఏర్పడింది. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం ముస్లింల ఆస్తులు కాపాడేందుకు, జగన్ రెడ్డి అనుచరుల కబ్జాలో ఉన్న వక్ఫ్ భూముల్ని రక్షించేందుకు జీవో నెంబరు 47ను రద్దు చేస్తూ జీవో నెంబర్ 75ను విడుదల చేశారు. ఆ తర్వాత వారం రోజులకే జీవో నెంబర్ 77 విడుదల చేసి పటిష్టమైన వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేశారు.
ఈ గ్యాప్ లో ముస్లింలలో అపోహలు రేపేందుకు జగన్ రెడ్డి తన సోషల్ మీడియా ద్వారా విస్త్రతంగా ప్రచారం చేశారు. దశాబ్దాలుగా అమలులో ఉన్న వక్ఫ్ చట్టాన్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే 40 సవరణలను ప్రతిపాదించి, సంయుక్త పార్లమెంటరీ సంఘానికి పంపించింది. దీనిపై జాతీయ స్థాయిలో చర్చలు, వివాదాలు నడుస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఏపీలో నవంబర్ 30న వక్ఫ్ బోర్డు రద్దు అంటూ జీవో నెంబర్ 75 విడుదల కాగానే ఆ మరుసటి రోజు డిసెంబర్ 1న “వక్ఫ్ బోర్డ్‌ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ” అనే శీర్షికతో టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది.
దాని ఆధారంగా కొంతమంది జాతీయ స్థాయి బీజేపీ నేతలు (బీజేపీ నేత అమిత్ మాల్వియా) తమ ఎక్స్ పేజీలలో ట్వీట్స్ కూడా పెట్టారు. ఇదే గందరగోళానికి దారి తీసింది. అయితే.. ఏపీలో వక్ఫ్ బోర్డును రద్దు చేశారు తప్ప శాశ్వతంగా ఎత్తివేయలేదని ఫ్యాక్ట్ చెకింగ్‌లో తేలడంతో ఇదే విషయం పై టైమ్స్ నౌ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వీడియో కూడా పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే జగన్ రెడ్డి అండ్ సోషల్ మీడియా గ్యాంగ్ చేసిన కుట్ర బయటపడ్డది.
పేద ముస్లింల జీవన స్థితిగతులు మెరుగుపర్చేందుకు, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కొరకు అల్లాహ్ పేరిట పూర్వం రాజులు, నవాబులు, ధనవంతులు దానం ఇచ్చినవే వక్ఫ్ ఆస్తులు. ఈ ఆస్తుల్లో మసీదులు, మదర్సాలు, వసతి గృహాలు, వేల ఎకరాల భూములు అన్ని ఉంటాయి. ఈ ఆస్తుల నిర్వహణను వక్ఫ్‌బోర్డులు చూస్తాయి. వక్ఫ్ అనే అరబిక్ పదానికి నిషేధం అని అర్థం. వక్ఫ్ ఆస్తులని కేవలం మతపరమైన వాటికే అంకితం చేయాలి. మిగతా ఆస్తుల మాదిరిగా వాడటం నిషేధం అన్నమాట.
జగన్ జమానాలో కబ్జా అయిన వక్ఫ్ ఆస్తులు
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65 వేల ఎకరాల భూములు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయి. వాటిలో ఇప్పటికే 13 వేల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. చాలా భూములకు సంబంధించిన కేసులు ట్రైబ్యునల్, కోర్టుల ఎదుట దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. 2019 నాటికి వక్ఫ్ ఆస్తులకు సంబంధించి కోర్టుల్లో 2 వేల కేసులు ఉండేవి. జగన్ హయాంలో ఆ సంఖ్య 5 వేలకు చేరింది. అంతేకాదు జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూముల రీసర్వే తర్వాత రెవెన్యూ రికార్డుల్లో వక్ఫ్ ఆస్తులుగా రికార్డు చేయకపోవడాన్ని కొందరు వైసీపీ నేతలు అనుకూలంగా మార్చుకున్నారు.
ముప్పై వేల కోట్ల విలువ చేసే 31,593 ఎకరాల వక్ఫ్ భూములను జగన్ ముఠా వివాదాల్లోకి నెట్టింది. ఇకపోతే 2023లో వక్ఫ్ బోర్డు కాలపరిమితి మించడంతో 2023 అక్టోబర్ 21న అప్పటి జగన్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం 11 మందిని నామినేట్ చేస్తూ జీవో నెంబర్ 47ని విడుదల చేసింది. ఇందులో అనేక అవకతవకలు జరగడంతో కొందరు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎంపిక ప్రక్రియను నిలుపుదల చేస్తూ హైకోర్టు 2023 నవంబర్ 1న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా వివిధ రకాల న్యాయపరమైన సమస్యలు తలెత్తిన కారణంగా వక్ఫ్ బోర్డులో పరిపాలన శూన్యత ఏర్పడింది.
దీన్ని ఆసరాగా తీసుకుని వక్ఫ్ ఆస్తుల కబ్జా కొనసాగింది. ఒక్క కర్నూలు జిల్లాలోనే 2500 ఎకరాలు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. అన్నమయ్య జిల్లాలో 162 ఎకరాలు అన్యాక్రాంతం కావడంపై మైనారిటీ కమిషన్ ఆదేశాలతో విచారణ కూడా జరుగుతోంది. అన్ని జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఇలాంటి సమయంలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం, బోర్డులో సుపరిపాలన కోసం కూటమి ప్రభుత్వం హైకోర్టు తీర్పును పరిశీలించి, గత ప్రభుత్వం జారీ చేసిన, వివాదాస్పదమైన 47 జీవోను రద్దు చేస్తూ ఈ ఏడాది నవంబర్ 30న జీవో నెంబర్ 75ను విడుదల చేసింది.
ఆ తర్వాత వారం రోజులకే జీవోఎంఎస్ నెంబర్ 77ను విడుదల చేస్తూ వక్ఫ్ చట్టం- 1995 సెక్షన్ (14)లోని సబ్-సెక్షన్ (9), సెక్షన్ (15) ప్రకారం 8 మందితో వక్ఫ్ బోర్డును నియమించింది. ఎన్నికైన సభ్యుల కోటాలో ఎండీ రుహుల్లా (ఎమ్మెల్సీ), షేక్ ఖాజా (ముతవల్లీ)లను నియమించింది. నామినేటెడ్ సభ్యులుగా మహ్మద్ నసీర్ (ఎమ్మెల్యే), సయ్యద్ దావుద్ బాషా బాక్వీ, షేక్ అక్రమ్, అబ్దుల్ అజీజ్, హాజీ ముకర్రమ్ హుస్సేన్, మహ్మద్ ఇస్మాయేల్ బేగ్‌లను నియమించారు. వక్ఫ్ చట్టం-1995లోని సెక్షన్ 14లోని సబ్-సెక్షన్ (8) ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యులు తమలో ఒకరిని బోర్డు చైర్‌పర్సన్‌గా ఎన్నుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యుల పదవీకాలం సెక్షన్ 21 ప్రకారం ఉంటుంది. వైసీపీ హయాంలో వక్ఫ్ బోర్డులో ఉన్న ఎండీ రుహుల్లా (ఎమ్మెల్సీ) కొత్త బోర్డులోనూ ఉండటం విశేషం. అంటే కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డును రద్దు చేయలేదు… కేవలం వక్ఫ్ ఆస్తులను సంరక్షించగల నిజాయితీ, చిత్తశుద్ధి కలవారితో బోర్డును పునరుద్ధరించింది అంతే. మరి వైసీపీ బాధ ఏంటి? అంటే అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం పై ప్రజల్లో అవాస్తవాలు ప్రచారం చేయాలి. టీడీపీకి ఎల్లప్పుడూ అండగా ఉండే ముస్లిం మైనారిటీల్లో ఏదో ఒక రకంగా భయం, అనుమానం పుట్టించాలి. చంద్రబాబుకు ముస్లింలను దూరం చేయాలి.
కాబట్టి ఇలా విషప్రచారం చేస్తున్నారు. నిజానికి వక్ఫ్ ఆస్తులను కాజేసింది జగన్ & కో. ముస్లింలో కోసం టీడీపీ అమలుచేసిన 10 పథకాలను రద్దుచేసింది జగనే. స్వయం ఉపాధి రుణాలను, రంజాన్ తోఫాను, విదేశీ విద్యార్థులకు సాయాన్ని, దుల్హన్ పథకాన్ని ఎత్తేసింది జగనే. హజ్ హౌస్ ల నిర్మాణాన్ని ఆపేసింది కూడా జగన్. ముస్లిం మైనారిటీలకు ఇంత దగా చేసిన జగన్ ఇప్పుడు ఇలాంటి ప్రచారాలు చేయడం ఏంటి అని ముస్లిం సోదరులు నిలదీయాలి.