28.2 C
Hyderabad
April 20, 2024 11: 59 AM
Slider సంపాదకీయం

సమస్యల సుడిగుండం విశాఖ తీరమే శరణ్యం

#YS Jagan Mohan Reddy

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సమస్యలు ఒక్క సారిగా చుట్టుముట్టాయి. జనవరి 18 దాటితే జగన్ కు అన్నీ మంచి రోజులేనని, గ్రహస్థితి మారిపోతుందని రాజగురువులు చెప్పిన మాటలు నిజం కావడం లేదు. జనవరి 18 నుంచి మంచి రోజులు వస్తాయని, అప్పటి వరకూ ఉన్న ప్రతికూలతలు పోతాయని రాజ గురువు చెప్పారు. అయితే అందుకు విరుద్ధంగా ఆయనను సమస్యలు చుట్టుముట్టాయి. ముఖ్యమంత్రి జగన్ సొంత బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడుగా రావడం కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నది.

ఈ కేసు విచారణలో భాగంగా జగన్ సోదరుడు కడప ఎంపి అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలవడం, ఆయన కాల్ డేటా ఆధారంగా ప్రశ్నలు వేయడం కలకలం సృష్టిస్తున్నది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతి పేరు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చినట్లు వార్తలు వెలువడటం వైసీపీ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. వై ఎస్ భారతి సహాయకుడు గా ఉన్న నవీన్ పేరు బయటకు రావడం కూడా ఆందోళనకరమైన అంశమే. సీబీఐ ఇదే దూకుడుతో వ్యవహరిస్తే వివేకానందరెడ్డి హత్య కేసులో మరింకెందరు బయట పడతారోనని వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

అదే విధంగా కోడికత్తి కేసులో జగన్ విచారణకు హాజరు కావాల్సిందేనని ఎన్ఐఏ కోర్టు స్పష్టం చేయడం మరొక ఆందోళనకరమైన అంశం. విచారణకు వెళ్లకపోతే కోడికత్తి కేసు నిజం కాదని డ్రామా అని అందుకే జగన్ కోర్టుకు వెళ్లడం లేదని ప్రతిపక్షాలు ప్రచారం చేసే అవకాశం కనిపిస్తున్నది. కోర్టుకు వెళ్లితే అక్రమాస్తుల కేసులో కూడా సీబీఐ కోర్టు విచారణకు పిలిస్తే వెళ్లాల్సి వస్తుంది. సీబీఐ కోర్టుకు తాను సీఎంనని, విధినిర్వహణలో బిజీగా ఉన్నానని చెబుతున్న జగన్ ఎన్ ఐ ఏ కోర్టుకు వెళ్లితే సీబీఐ కోర్టులో ఇక వాదించడానికి ఏమీ గ్రౌండ్ ఉండదని కొందరు అనుకుంటున్నారు.

అందుకే కోడికత్తి కేసులో హైకోర్టుకు వెళ్లి ఉప శమనం పొందాలని అనుకుంటున్నారు. ఏది ఏమైనా కోడికత్తి కేసులో ఈ కీలక మలుపు సీఎం జగన్ ను తీవ్రంగా ఇబ్బందులలోకి నెడుతున్నది. అదే విధంగా రాజకీయంగా తీవ్రమైన కల్లోలం ప్రారంభం అయింది. అదీ కూడా రెడ్డి కులస్తుల నుంచే రాజకీయ తిరుగుబాటు ప్రారంభం కావడం వైసీపీని తీవ్ర ఇబ్బందులలోకి నెడుతున్నది. పదవులన్నీ రెడ్లకే ఇచ్చినా, అధికారంలో 80 శాతం మేరకు రెడ్లకే ధారాదత్తం చేసినా కూడా రెడ్డి కులస్తులే తిరుగుబాటు చేస్తుండటం జగన్ ను తీవ్రమైన వత్తిడిలోకి నెడుతున్నది.

నెల్లూరు జిల్లా రెడ్లలో ప్రారంభం అయిన తిరుగుబాటు అక్కడికే పరిమితం అవుతుందా లేక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అసంతృప్తి ప్రారంభం అవుతుందా అనేది అర్ధం కాకుండా ఉన్నది. ఇటు రాజకీయంగా అటు వ్యక్తిగతంగా వత్తిడిలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటన్నిటిని దాటుకుని ముందుకు వెళ్లాలంటే ఉత్తరాంధ్ర నుంచి పాలన సాగించడం ఒక్కటే మార్గమని రాజ గురువు మళ్లీ చెప్పినట్ల అంటున్నారు. అందుకే కోర్టు వ్యవహారాలు ఎలా ఉన్నా విశాఖపట్నం రాజధాని అని ప్రకటించేశారు. చూడాలి…. విశాఖ పట్నం నుంచి పాలన సాగిస్తే జగన్ జాతకం మారుతుందేమో….

Related posts

నవంబర్ 18న దిల్ రాజు రిలీజ్ చేస్తున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం ‘మసూద’

Bhavani

తమిళనాడు ముత్తూట్ దోపిడీ కేసు సైబరాబాద్ పోలీసులు భేష్‌

Sub Editor

ఇసుక దీక్షతో రాష్ట్ర ప్రభుత్వం దిగిరావాలి

Satyam NEWS

Leave a Comment