28.2 C
Hyderabad
April 20, 2024 14: 27 PM
Slider ముఖ్యంశాలు

వివేకా హత్య కేసులో జగన్ ను విచారించాలి: ఎంపీ రఘురామ

#rrr

కడప మాజీ ఎంపీ   వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సాక్షిగా విచారిస్తే ఈ కేసు త్వరగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తెలిపారు. న్యాయం చేయడమే కాదు… న్యాయం చేసినట్లు కనిపించాలన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డిని విచారించడం అన్నది  తప్పనిసరి పేర్కొన్నారు.

జగన్మోహన్ రెడ్డిని విచారించకపోతే కొన్ని అనుమానాలు చరిత్రపుటల్లో అలాగే నిలిచిపోతాయని అన్నారు . వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను హైదరాబాద్ సిబిఐ కోర్టుకు బదిలీ చేయడం హర్షించదగ్గ  పరిణామమని చెప్పారు . మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఇకపై వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ వేగవంతంగా కొనసాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

వివేకా హత్య కేసులో  సాక్షాదారాలను ధ్వంసం చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, కుట్ర కోణం దాగి ఉందని  సుప్రీంకోర్టు  న్యాయమూర్తి  వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు ను లోతుగా విచారించాలని కోరారు. వివేకా భార్య, కుమార్తె న్యాయం కోసం సుప్రీం కోర్టు వరకు రావడం కలిసి వేసిందని వ్యాఖ్యానించిన న్యాయమూర్తి, న్యాయం చేయడమే కాదని… న్యాయం జరిగినట్లుగా కనిపించాలని  అన్నారన్నారు.

వివేకా హత్య కేసును విచారిస్తున్నసిబిఐ అధికారులపై రాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేయడం వల్లే ఈ కేసు విచారణలో జాప్యం జరిగిందన్నారు. డాక్టర్ సునీత కోరిక మేరకు హత్య కేసు విచారణను హైదరాబాదుకు బదిలీ చేయాలని  సుప్రీంకోర్టు నిర్ణయించిందని తెలిపారు.. హైదరాబాద్ లో కూడా కొన్ని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ, న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణంరాజు వ్యక్తం చేశారు.

చాచి లెంపకాయ కొట్టినట్లు గా సుప్రీం నిర్ణయం…

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు  వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సుప్రీంకోర్టు పొరుగు రాష్ట్రానికి బదిలీ చేయాలని నిర్ణయించడం పట్ల ప్రభుత్వ పెద్దలు సిగ్గుపడాలని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల రాష్ట్రంలో   తమ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా తలెత్తుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సాక్షి, అనుబంధ చానల్స్, నీలి మీడియా కథనాలను రాసుకుంటుందని అపహస్యం చేశారు. సుప్రీం కోర్టు నిర్ణయం  తమ ప్రభుత్వానికి, పార్టీకి చాచి లెంపకాయ కొట్టినట్లు అయిందని అన్నారు.. ఇద్దరు ఎంపీలను విచారించాల్సిందే…

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం ఆయన గుండెపోటుతో మరణించారని మీడియా కు చెప్పిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిని, హత్య కేసులో అనుమానితుగా పేర్కొన్న ఎంపీ అవినాష్ రెడ్డిని విచారణకు పిలవాల్సిందేనని రఘురామకృష్ణంరాజు అన్నారు. సిబిఐ అధికారి రాంసింగ్ స్వేచ్ఛగా హైదరాబాద్ కు వెళ్లి హత్య కేసును విచారించవచ్చునని అన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ కు వెళ్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారని భయం ఆయనకు ఉండేదని పేర్కొన్నారు.

జగన్మోహన్ రెడ్డి ముందే ఎలా చెప్పారు?

వైయస్ వివేకానంద రెడ్డి హత్య ఎలా జరిగిందో అప్రూవర్ గా మారిన దస్తగిరి చెప్పినట్లుగానే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందే ఎలా ఊహించి, మీడియాకు వివరించారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి ఏమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా?? అని నిలదీశారు. తన బాబాయి హత్య ఎలా జరిగిందో జగన్మోహన్ రెడ్డి ముందే తెలుసుకున్నారా?, లేకపోతే హత్య జరిగిన తీరు గురించి ఆయనకు ఎవరైనా చెప్పారా అంటూ సూటిగా ప్రశ్నించారు.

అసెంబ్లీలో హత్యోదంతం పై మాట్లాడాల్సిన అవసరం లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనుమానితులను  వెనుకేసుకొచ్చే విధంగా  మాట్లాడారని గుర్తు చేశారు. హత్య కేసులో నిందితులు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలని చెప్పాల్సిన ముఖ్య మంత్రి, శివ శంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు తనకు రెండు కళ్ళు అని అప్పటి డిజిపి సవాంగ్ తో పేర్కొనడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

సాక్షి యజమాని  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకపోయినా, ఈ కేసు లో ఆయన్ని  ఒక సాక్షిలా పిలిచి విచారించాలని రఘురామకృష్ణం రాజు సిబిఐ ని కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ  సిట్ విచారణకు  తాను హాజరు కాకపోతే, లుకౌట్ నోటీసులు జారీ చేస్తారని సాక్షి దినపత్రికలో వార్తా కథనం రాయడం విడ్డూరంగా ఉందన్నారు.  ఇతరులపై విషపు రాతలు రాసే సాక్షి దినపత్రిక, జగన్మోహన్ రెడ్డి ని సిబిఐ విచారణకు పిలవాలని ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు.

సాక్షాలను ధ్వంసం చేశారని, తారుమారు చేశారని సుప్రీం కోర్టు పేర్కొన్న తర్వాత ముఖ్యమంత్రి పదవికి  జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని  ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన డిమాండ్ సహేతుకమైన దేనని అన్నారు.. గతంలో చిన్న చిన్న కారణాలకే ఎంతోమంది నాయకులు తమ పదవులు త్యాగం చేశారని గుర్తు చేశారు . నేదురు మల్లి జనార్దన్ రెడ్డి నీలం సంజీవరెడ్డి వంటి వారు తమ పదవులకు రాజీనామా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు  గుర్తు చేశారు.

Related posts

రాజకీయ డ్రామాలు గాలికి… విశాఖ ఉక్కు ప్రయివేటుకు

Satyam NEWS

ఆపద మొక్కులు: పెరిగిన తిరుమల వెంకన్న ఆదాయం

Satyam NEWS

కొల్లాపూర్ మున్సిపాలిటీలో వారికి లైసెన్స్ లేకుంటే చర్యలు

Satyam NEWS

Leave a Comment