కడప ఎంపీ అయిన వైఎస్ అవినాష్ రెడ్డిపై వివేకానంద రెడ్డి హత్య కేసు కత్తి వేలాడుతూనే ఉంది. వైసీపీ అధికారంలో ఉండగా తన అన్న జగన్ అవినాష్ ను కాపాడుతూ వచ్చారు. వివేకా కేసు దర్యాప్తులో సీబీఐ దర్యాప్తు వేగం చేసిన ప్రతిసారి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం.. అక్కడ కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకోవడం మామూలుగా ఉండేది. తద్వారా అప్పటిదాకా రేపో మాపో సీబీఐ అవినాష్ ను అరెస్టు చేయడం ఖాయం అన్న వాతావరణం కాస్త చల్లబడిపోయేది. మొత్తానికి అవినాష్ రెడ్డి ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆ కేసులో అరెస్టు నుంచి రక్షణ కోసం ముందస్తు బెయిల్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
అయితే, ఇప్పటి పరిస్థితులు వేరు. జగన్ కు ఏ అధికారమూ లేదు. కనీసం కేంద్ర పెద్దల సహకారం అసలే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డిని కాపాడేందుకు అన్న జగన్ ఏమైనా చేద్దామన్నా చేతిలో పవర్ లేకుండా పోయింది. దాంతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వస్తోంది. వివేకా కేసులో సీబీఐ దూకుడు ప్రదర్శిస్తే.. ఆ ముందస్తు బెయిల్‌ను రద్దు చేయించి.. ఈసారి అవినాష్ రెడ్డిని అరెస్టు చేయగలదనే ఊహాగానాలు బలంగా ఉన్నాయి.
మరోవైపు, తన అన్న తనను ఏ రకంగానూ రక్షించలేడనే ఉద్దేశంతో అవినాష్ రెడ్డి బీజేపీలో చేరదామనే ప్లాన్ చేసుకుంటున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. బీజేపీలో చేరితే తనకు వివేకా కేసులో అరెస్టు నుంచి రక్షణ పొందవచ్చని ఆయన భావిస్తున్నారట. కానీ, జగన్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదని తెలిసింది. ఎందుకంటే.. తాను పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి.. కడప ఎంపీ స్థానం నుంచి జగన్ పోటీ చేయాలని చూస్తున్నారు. తద్వారా ఏపీ అసెంబ్లీకి వెళ్లే బాధ తప్పడమే కాక.. ఢిల్లీలో రాజకీయాలు చేసుకోవచ్చనే ఆలోచనలో జగన్ ఉన్నారు. అది జరగాలంటే అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించాల్సి ఉంటుంది. కానీ, జగన్ ఆలోచనకు అవినాష్ రెడ్డి సానుకూలంగా లేరనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అవినాష్ రెడ్డి ఆలోచన మరోలా ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ అన్న కోసం తాను రాజీనామా చేసినా.. తనను కేసు నుంచి రక్షించే పలుకుబడి, పవర్ ఇప్పుడు జగన్ చేతిలో లేదు. కనీసం ఎంపీగా కొనసాగినా తానొక ప్రజాప్రతినిధిని అని చెప్పుకొని కోర్టులో కొన్ని వెసులుబాట్లు పొందవచ్చు. అదే బీజేపీలో చేరితే.. బీజేపీ ఎంపీగా చెలామణి అవుతూ పూర్తి రక్షణ పొందవచ్చనే ఆలోచనలో అవినాష్ రెడ్డి ఉన్నట్లుగా చెబుతున్నారు. కానీ, జగన్ అధికారంలోకి రావడం కోసం ఒకసారి వివేకా హత్య కోసం స్కెచ్ వేసి హెల్ప్ చేశారు.. అవినాష్ రెడ్డి. మరోసారి కూడా తన అన్న కోసం తన సీటును త్యాగం చేసే యోచనలో అవినాష్ లేనట్లుగా చెబుతున్నారు. ఈసారి తన స్వార్థం తాను చూసుకోవాలని అవినాష్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. బీజేపీలో చేరినా అరెస్టు తప్పదని జగన్.. అవినాష్ తో చెప్పినట్లుగా వారి సన్నిహిత వర్గాలు తెలిపాయి. అందుకే ఎంపీ సీటును తనకు త్యాగం చేయాలని కోరినట్లుగా సమాచారం.