39.2 C
Hyderabad
April 25, 2024 15: 40 PM
Slider సంపాదకీయం

జగనాసుర రక్త చరిత్ర బహిరంగం పుస్తకంతో జనంలోకి ‘దేశం’

#Y S Vivekanandareddy

నారాసుర రక్త చరిత్ర పేరుతో వార్తలు ప్రచురించి గత ఎన్నికలలో రాజకీయ లబ్ది పొందిన వైసీపీకి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దీటైన సమాధానం ఇవ్వడం చర్చనీయాంశం అయింది. జగనాసుర రక్త చరిత్ర బహిరంగం అనే శీర్షికతో సీబీఐ చార్జిషీట్ లోని అంశాలను ప్రస్తావిస్తూ తెలుగుదేశం పార్టీ ఈ బుక్ లెట్ లో పొందుపరిచింది.

ముఖ్యమంత్రి జగన్ సొంత బాబయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య తర్వాత ‘గుండె పోటు’ అంటూ ముందుగా చెప్పిన వైసీపీ నేతలు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు చంద్రబాబు డైరెక్షన్ లో బాబాయిని చంపించారని పూర్తి స్థాయిలో ప్రచారం చేశారు. ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రకారం చాలా మంది అది నిజమని నమ్మి సానుభూతితో వైసీపీకి ఓట్లు వేశారు. ఆ తర్వాతి పరిణామ క్రమంలో సీబీఐ విచారణ చేపట్టడం, దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అడ్డంకులు సృష్టించడం జరిగింది. రాష్ట్ర పోలీసులు కూడా ఒక అడుగు ముందుకు వేసి సీబీఐ

అధికారులపైనే కేసులు పెట్టి తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. సీబీఐ అధికారులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా న్యాయస్థానాల నుంచి రక్షణ కవచం పొంది మరీ కేసును దర్యాప్తు చేయాల్సి వచ్చింది. ఎక్కడిక్కడ సీబీఐ విచారణను అడ్డుకోవడమే కాకుండా సీబీఐని తప్పుదోవ పట్టించే విధంగా కూడా కొత్త కొత్త కథనాలను ప్రచారం చేశారు. అత్యంత నిజాయితీపరుడు, స్థానిక ప్రజల అభిమానాన్ని చూరగొన్న వై ఎస్ వివేకానందరెడ్డిని స్త్రీలోలుడుగానూ, అక్రమ

సంబంధాలపై కూడా ఒక దశలో తీవ్ర ప్రచారం జరిగింది. వివేకానందరెడ్డి ఒక మహిళతో సంబంధం పెట్టుకున్నారని, వారికి వివేకానందరెడ్డి సొంత కుటుంబానికి మధ్య ఆస్తుల తగాదాలు వచ్చాయని అందుకే ఆయనను చంపేశారని కూడా కథనాలు వండివార్చారు. అయితే ఇవేవీ ప్రజలు నమ్మలేదు. సీబీఐ కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించలేదు. చివరకు వై ఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత వాంగ్మూలం ఆధారంగానే సీబీఐ తన విచారణను

కొనసాగించినట్లుగా కనిపిస్తున్నది. డాక్టర్ సునీత తన తండ్రి హత్యకు సంబంధించిన సహేతుక కారణాలను, నిందితుల పేర్లను న్యాయస్థానానికి కూడా సమర్పించారు. సీబీఐ అధికారులు కూడా అందుకు అనుగుణంగానే కేసు దర్యాప్తు చేసి ఆధారాలు సేకరించారు. చాలా కాలం తర్వాత సీబీఐ కొందరు కీలక వ్యక్తులను విచారణకు పిలిచింది. ఇందులో కడప పార్లమెంటు సభ్యుడు, ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహిత సోదరుడు అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు.

అవినాష్ రెడ్డి చెప్పిన విషయాల ప్రకారం ముఖ్యమంత్రి జగన్ కు ఆ భార్య భారతీ రెడ్డికి సంబంధించిన కార్యాలయ వ్యక్తులను కూడా సీబీఐ పిలిచింది. ఈ నేపథ్యంలో వై ఎస్ వివేకానందరెడ్డి దారుణ, కిరాతక హత్య కు సంబంధించి ఇప్పటి వరకూ ఆరోపణలు ఎదుర్కొన్న ఒకరిద్దరు నాయకులకు ఊరట లభించినట్లయింది. చంపించిన వారే తప్పుడు కథనాలు ప్రచారంలోకి తీసుకువచ్చి తమను ఇరికించాలని చూడటంతో ఒక తెలుగుదేశం నాయకుడు, ఇప్పుడు బీజేపీలో ఉన్న మరొక నాయకుడు నిద్రలేని రాత్రులు గడిపారు. తీవ్ర మానసిక వేదన అనుభవించారు.

వారు వారి కుటుంబాలతో కూడా సన్నిహితంగా ఉండలేని తీవ్రమైన మనోవేదనకు గురయ్యారు. ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ దారుణంగా నష్టపోయింది. ఇప్పటికి సీబీఐ విచారణ ఒక కొలిక్కి రావడంతో తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ జరిగిన అంశాలను గుదిగుచ్చి జగనాసుర రక్త చరిత్ర బహిరంగం అనే పుస్తకాన్ని విడుదల చేసింది. తన తండ్రి హత్య, ఆ తర్వాత వచ్చిన సానుభూతి పవనాలను వాడుకుని జగన్ మోహన్ రెడ్డి రాజకీయ లబ్దిపొందారని వై ఎస్ వివేకానందరెడ్డి కుమార్తె తన వాగ్మూలంలో పేర్కొన్నారు. తన తండ్రి హత్య కేసుకు సంబంధించి తనకు జగన్ మోహన్ రెడ్డికి మధ్య జరిగిన

సంభాషణను కూడా సునీత తన వాగ్మూలంలో పేర్కొన్నారని తెలుగుదేశం తన పుస్తకంలో పేర్కొన్నది. పీఏ కృష్ణారెడ్డి ద్వారా మీ నాన్నను నీ భర్త రాజశేఖరరెడ్డే చంపించాడని ఎందుకు అనుకోకూడదు అని జగన్ తనతో అన్నట్లు సునీత తన వాగ్మూలంలో పేర్కొన్నారు. ఈ సంభాషణ జరిగే సమయంలో అప్పటి డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నట్లు డాక్టర్ సునీత తన వాగ్మూలంలో వెల్లడించారు.

కోడికత్తి కేసులాగానే తన మామగారి హత్య కూడా పక్బందిగా జరిగినట్లు డాక్టర్ సునీత భర్త రాజశేఖరరెడ్డి తన వాగ్మూలంలో పేర్కొన్నారు. ‘‘మనకు చాలా పవర్ ఫుల్ వ్యక్తుల మద్దతు ఉందని ఎర్ర గంగిరెడ్డి నాతో చెప్పాడు’’ అని దస్తగిరి తన వాగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుగుదేశం తన పుస్తకంలో పేర్కొన్నది. తెలుగుదేశం పార్టీ ఈ పుస్తకానికి విస్త్రత ప్రచారం చేయాలని కూడా ప్లాన్ చేసింది.

తమపై వచ్చిన నీలాపనిందలు మాపుకోవడానికి తెలుగుదేశం పార్టీ దీన్ని అవకాశంగా మలచుకోనున్నది. వై ఎస్ వివేకానందరెడ్డిని సొంత కుటుంబీకులే దారుణ హత్య చేసి తమపైకి నింద మోపడాన్ని తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేకపోతున్నది. అయితే ఎన్నికల ముందు జరిగిన ఈ పరిణామానికి అప్పటిలో ఏం చేయాలో కూడా తెలుగుదేశం నాయకులకు తోచలేదు.

ఈ కన్ఫ్యూజన్ లోనే ఎన్నికలు జరిగిపోవడం వైసీపీ పూర్తి స్థాయిలో లబ్ది పొందడం జరిగిపోయింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కి పూర్తి స్థాయిలో ఆధారాలు లభ్యం కావడంతో వై ఎస్ వివేకానందరెడ్డి కిరాతక హత్యను, అంతకు ముందు ఆ తర్వాత జరిగిన పరిణామాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. తద్వారా వైసీపీ నాయకులను పూర్తి స్థాయిలో ఎండగట్టేందుకు కృతనిశ్చయంతో ఉంది.

Related posts

Ohh God: కుక్కలు, పందులపై ఇక అపరాధ రుసుం

Satyam NEWS

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన తప్పదు

Murali Krishna

ఆత్మీయ బంధం

Satyam NEWS

Leave a Comment