21.2 C
Hyderabad
December 11, 2024 21: 01 PM
Slider ప్రత్యేకం

భవిష్యత్తు నిర్ణయించేది ఫాలోఅప్ చర్యలే

pjimage (5)

ఆర్టికల్ 370 రద్దును చాలా మంది ఒక చారిత్రక ఘట్టంగా అభివర్ణిస్తున్నారు. అందులో వారిని తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం అయిన గత రోజులను చాలా మంది చూసి ఉండలేదు కాబట్టి నిన్న మొన్న పార్లమెంటులో హోం మంత్రి అమిత్ షా ప్రసంగాలు విని ఉత్తేజితులై ఆ విధమైన అభిప్రాయానికి వచ్చి ఉండచ్చు కూడా. లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధీర్ రంజన్ చౌధరి లాంటి వాళ్ల స్పీచ్ లు విని అర్ధం కాని అయోమయంలో కూడా మరి కొందరు ఈ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. అధీర్ రంజన్ చౌధరి చెప్పిన మాటలు అర్ధం అయి అసహ్యంతో కూడా బిజెపి పై అభిమానం పెరిగి ఉండచ్చు. ఏది ఏమైనా ఆర్టికల్ 370 రద్దు ఇంత సులభంగా ఇంత సజావుగా ఇంత అకస్మాత్తుగా చేసేస్తారని మాత్రం చాలా మంది అనుకోలేదు. జమ్మూ కాశ్మీర్ లో సైనిక కదలికలు పెంచిన నాటి నుంచి లోక్ సభలో బిల్లు పాస్ అయిన నాటి వరకూ జరిగిన పరిణామలు దేశ చరిత్ర గతిని మారుస్తాయనడంలో సందేహం లేదు. అది మంచికా చెడుకా అనేది ఇప్పుడు చెప్పడం కష్టం.

నిజమైన దేశ భక్తితోనే చేశారా?

ఆర్టికల్ 370ని రద్దు చేసిన బిజెపి కేవలం రాజకీయ అవసరాల కోసం కాకుండా నిజమైన దేశ భక్తితో నిర్ణయాలు తీసుకుంటే మాత్రం నేడు జరిగిన ఈ పరిణామం దేశాన్ని స్వర్ణ కాంతులతో నింపుతుందనడంలో సందేహం లేదు. దేశం మొత్తంలో పాజిటీవ్ టాక్ కోసం జమ్మూ కాశ్మీర్ ను పణంగా పెడదామనే చెస్ గేమ్ అడితే మాత్రం తగిన మూల్యం చెల్లించక తప్పని పరిస్థితులు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. కేంద్రంలో అప్రతిహత అధికారంలో ఉన్న బిజెపి ఇప్పుడు ఏం చేయాలి? అసలైన కార్యక్రమం ఇప్పుడే చేయాల్సి ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు హామీలు గుప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి ఆ తర్వాతి ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన సందర్భాన్ని ఇప్పుడు అనివార్యంగా గుర్తుకు తెచ్చుకోవాలి. అలా కాకుండా చాలా కాలం అంటే రెండో సారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ విభజన జరిపి హామీలన్నీ అమలు చేసి ఉన్నట్లయితే అటు ఆంధ్రప్రదేశ్ లోనూ, ఇటు తెలంగాణ లోనూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరంగా మంచి ఫలితాలు సాధించి ఉండేది.

ఈ ఉదాహరణను బిజెపి గుర్తుంచుకోవాలి

అత్యాసకు పోయి కాంగ్రెస్ ఎన్నికల ముందు ఆ పని చేయడంతో రెండు రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఉదాహరణను బిజెపి గుర్తుంచుకోవాలి. బిజెపి రెండో సారి ఎన్నిక అయిన తర్వాత ముందుగానే ఆర్టికల్ 370 రద్దు చేసింది కాబట్టి ఇప్పుడు దాదాపుగా ఐదేళ్ల అధికార సమయం ఉన్నది. జమ్మూ కాశ్మీర్ ను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి అవకాశం ఉన్నది. ఈ స్వల్ప కాలాన్ని బిజెపి సద్దినియోగం చేసుకున్నప్పుడే జమ్మూ కాశ్మీర్ లో శాంతి పరిఢవిల్లుతుంది. అలా కాకుండా సమయాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం కాశ్మీర్ ప్రజలకు అన్యాయం, దేశ ప్రజలకు మోసం జరిగినట్లుగా భావించాల్సి వస్తుంది. అందుకే తదుపరి చర్యలు (ఫాలో అప్) పైనే ఇది చారిత్రాత్మక అంశమా కాదా అనేది తేలుతుందని చెబుతున్నది. తొలిగా బిజెపి చేయాల్సింది ఒక స్థానికుడైన, హిందూ ముస్లిం బేధభావం లేని ట్రాక్ రికార్డు ఉన్న ఒక ముస్లిం సీనియర్ రాజకీయ నాయకుడు లేదా సీనియర్ సివిల్ అధికారిని జమ్మూ కాశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ గా నియమించాలి.

అందరికి ఆమోదయోగ్యుడిని నియమించాలి

సాధారణంగా బిజెపి ఏం చేస్తున్నదంటే ఆర్ ఎస్ ఎస్ లో పని చేసి ప్రస్తుతం నిరుద్యోగిగా ఉండే వయసుడిగిన వ్యక్తుల్ని గవర్నర్లుగా ఎంపిక చేస్తున్నది. ఇదే విధంగా జమ్మూ కాశ్మీర్ కు లడ్డాక్ కు చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందరికి ఆమోదయోగ్యమైన స్థానికుడిని లెఫ్టెనెంట్ గవర్నర్ గా నియమించడం వల్ల బిజెపి చిత్త శుద్ధిని కాశ్మీర్ ప్రజలు అర్ధం చేసుకుంటారు. లేకపోతే తమపై పరాయిపాలన వచ్చినట్లుగా భావిస్తారు. గతంలో వి పి సింగ్ హయాంలో జగ్ మోహన్ మల్హోత్రా అనే వ్యక్తిని అక్కడ గవర్నర్ గా నియమించారు. ఫారూఖ్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని తీసేసి ఈ జగ్ మోహన్ ను పెట్టడంతో ఒక్క సారిగా కాశ్మీర్ భగ్గుమన్నది.

జగ్ మోహన్ ఉదంతం బిజెపి గుర్తుకు తెచ్చుకోవాలి

1976 తుర్కమెన్ గేట్ అల్లర్లలో ముస్లిం కాలనీని ఆయన తగులబెట్టిన సంఘటన ఒక్క సరిగా కాశ్మీర్ ప్రజలకు గుర్తుకు వచ్చింది. జగ్ మోహన్ జన సంఘ్ ఆలోచనలు కల వ్యక్తిగా పేరు పొందాడు. జమ్మూ కాశ్మీర్ ను బాగు చేద్దామనుకుని వి పి సింగ్ చేసిన ఈ చిన్న తప్పు కాశ్మీర్ ను కష్టాల్లోకి నెట్టింది. ఇప్పుడు నరేంద్రమోడీ అలాంటి తప్పు చేయరాదు. ఒక చోట ముస్లిం ను లెఫ్టెనెంట్ గవర్నర్ ను చేద్దాం మరో చోట హిందువును చేద్దాం అనే ఫక్తు రాజకీయ ఆలోచన కూడా వద్దు. మరీ ముఖ్యంగా రిటైర్డ్ మిలిట్రి అధికారిని గానీ పోలీసు అధికారిని గానీ లెఫ్టెనెంట్ గవర్నర్ గా నియమించవద్దు. లెఫ్టెనెంట్ గవర్నర్ నియామకం నుంచే ఆర్టికల్ 370 రద్దు సక్రమ మైన ఆలోచనా లేక రాజకీయ ప్రేరేపిత ఆలోచనా అనే విషయం అర్ధం అవుతుంది. ఇదే కాశ్మీర్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…… అంతే కానీ కేవలం ఆర్టికల్ 370 రద్దు ఒక్కటే అయితే మాత్రం అది చరిత్రలో కలిసిపోతుంది.

వై ఎస్ ప్రకాశ్, సీనియర్ జర్నలిస్టు

Related posts

రాజంపేట అసెంబ్లీ పరిధిలో ఆరు ఎంపీపీ లు వైసీపీ ఏకగ్రీవం…

Satyam NEWS

11 వేల మంది ఉద్యోగుల తొలగింపు

Murali Krishna

గ్రాండ్ గా రిలీజైన “చెడ్డి గ్యాంగ్ తమాషా” టీజర్

Bhavani

Leave a Comment