కాశ్మీర్ లోయ నుంచి యాత్రీకులు వెళ్లిపోవాలని హెచ్చరించిన రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయలేదు. అమర్‌నాథ్ యాత్రకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందంటూ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రప్రభుత్వం చేసిన ప్రకటన అక్కడికి వచ్చిన యాత్రీకులను, కాశ్మీర్ సందర్శకులను కలవరపెట్టింది. తక్షణమే తమ స్వస్థలాలకు వెళ్లాలని ప్రభుత్వం కోరడంతో అక్కడికి వెళ్లిన వారు హుటాహుటిన తిరుగు ప్రయాణం కోసం సిద్ధమయ్యారు. దాంతో శ్రీనగర్ విమానాశ్రయం కిటకిట లాడుతున్నది. తిరిగి వెళ్లేందుకు వీలుగా ఒక్క ప్రత్యేక విమానం కూడా లేకపోవడంతో యాత్రీకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేక అక్కడే పడిగాపులు పడుతున్నారు. కాశ్మీర్ లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సైనికాధికారులు ఉమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలను వెల్లడించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఉగ్రవాదులు, సైన్యం అమర్‌నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు మూడు, నాలుగు రోజులుగా నిర్దిష్ట నిఘా సమాచారం అందుతోందని వారు తెలిపారు. దీంతో అమర్‌నాథ్ ఆలయానికి దారితీసే బాల్తాల్, పహల్గామ్ మార్గాల్లో విస్తృతంగా సోదాలు చేపట్టారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పాక్ ఆయుధ కర్మాగారం తయారుచేసిన మందు పాతర, టెలిస్కోపు కలిగిన అమెరికా తయారీ స్నైపర్ తుపాకీ కూడా లభ్యమయ్యాయి. ఈ కుట్రలో పాక్ సైన్యం పాత్రను ఇది తేటతెల్లం చేస్తోంది అని సైన్యంలోని 15వ కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కె.జె.ఎస్.ధిల్లాన్ విలేకరులతో పేర్కొన్నారు. ఉగ్రవాదుల దుష్ట పన్నాగాలను భద్రతా దళాలు భగ్నం చేస్తాయని చెప్పారు. భారత్‌లోకి చొరబడేందుకు పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో తిష్టవేశారని, వారి ప్రయత్నాలను వమ్ము చేస్తున్నామని తెలిపారు.
previous post