వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే హర్షిస్తాం. ప్రజలను ఇబ్బందులు పెడితే మాత్రం చూస్తూ ఊరుకోం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కొత్త ప్రభుత్వానికి 100 రోజులు సమయం ఇద్దాం అని ఆ తర్వాత తప్పులు ఉంటే ప్రశ్నిద్దాం అని ఆయన అన్నారు. 100 రోజులు మాట్లాడరాదని నిర్ణయించుకున్నా, అయితే భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తనను కదిలించి వేశాయని అందువల్లే ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. గతంలో రైతులు విత్తనాల కొరతతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక లేఖ రాశామని ఇది రెండో లేఖ అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరి కోసం నిలబడతానని హామీ ఇచ్చారు. జనసేన పార్టీకి వచ్చిన ప్రతి ఓటు నాలుగు ఓట్లతో సమానమని అది ప్రతికూల పరిస్థితుల్లో డబ్బుకీ, సారాకి లొంగకుండా వేసిన ఓటు అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కొత్త నాయకత్వాన్ని తీసుకువస్తానని ఆయన చెప్పారు.
స్థానిక సంస్థల్లో గెలుపే ధ్యేయంగా పని చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సర్పంచ్‌లుగా, వార్డు మెంబర్లుగా పోటీ చేయడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. మండల స్థాయి కమిటీలు, గ్రామ స్థాయి కమిటీలు, బూత్ స్థాయి కమిటీలకు సంబంధించిన బాధ్యతలు తీసుకున్న వారు గట్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని అన్నారు. పార్టీ ఓటమి వల్ల తానేమీ ఇబ్బంది పడటం లేదని అన్నారు. జనంలోకి వెళ్లేందుకు ఎందుకు భయపడాలని పవన్ అన్నారు. జనసేన నాయకులు ఏమైనా ఘోరాలు చేశారా…నేరాలు చేశారా అంటూ వివరణ ఇచ్చారు. జనసేన పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ నలుగురు బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీడీపీ, వైసీపీ, బీజేపీలతో ప్రత్యక్షంగా యుద్ధం చేస్తే, టిఆర్ఎస్‌తో పరోక్షంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
ముఖ్యమంత్రి కావాలనే తొందర లేదు
అర్జెంట్‌గా తనకు ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచన లేదని పవన్ కళ్యాన్ మరోసారి స్పష్టం చేశారు. జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే తన లక్ష్యమన్నారు. పార్టీని ముందుకు తీసుకువెళ్లాలంటే వ్యక్తిగత అజెండాలు వదిలేయాలని సూచించారు. పార్టీని టెంట్లు వేసుకుని అయినా నడుపుతానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తన మొదటి సినిమా ఫెయిల్ అవగానే ఉద్యోగం చేసుకోమంటూ కొందరు సలహా ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఓడిన చోటే వెతుక్కుంటూ వెళ్లానని అదే ఈ స్థాయిలో నిలబెట్టిందన్నారు. నా తండ్రి సిఎం కాదు ఇన్‌స్టెంట్‌గా తనకు అన్నీ వచ్చేయడానికి అని ఆయన అన్నారు.