మీ ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదు. నా మూడు పెళ్లిళ్ల వల్లేనా మీరు రెండేళ్లు జైల్లో ఉంది. జనసేన అంటే భయం కాబట్టే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. మీరు వ్యక్తిగతంగా మాట్లాడినా మా పార్టీ ఆ తప్పు చేయదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపి సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా అవగాహన లేకుండా పాలన చేస్తే ఎలా? ఇసుక పై అవగాహన ఉందా ? లేక ఇసుకపై మరేదైనా ఆశిస్తున్నారా? అని పవన్ ప్రశ్నించారు. జగన్ మాటల్ని భరించడానికి తాము టిడిపి కాదని, జనసేన అని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. జగన్‌ను ఓ కులంగా చూడబోమని, రాజకీయ నాయకుడిగానే చూస్తామని స్పష్టం చేశారు. మాట్లాడితే మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారని అంటున్నారని, మీరు కూడా చేసుకోండి ఎవరు వద్దన్నారని అడిగారు. తాను 3 పెళ్లిళ్ళు చేసుకోవడం వల్లే జగన్ రెండేళ్లు జైల్లో ఉన్నారా అని జగన్ ఉద్దేశించి పవన్ ప్రశ్నించారు. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని, సిఎం జగన్‌కు అసలు చరిత్ర తెలుసా అని సూటిగా ప్రశ్నించారు. తమిళనాడులో ఇంకా తెలుగు మీడియం ఉందని, టీచర్లకు ఆంగ్లంలో ప్రావీణ్యం కల్పించకుండా ఒకే సారి మారిస్తే ఎలా అని మరోసారి ప్రశ్నించారు. ఇసుక దొరక్క నిర్మాణ రంగం కుదేలైందని, వైసిపి నేతలు భాషా సంస్కారాన్ని మరిచి మాట్లాడినా.. తాము పాలసీ పరంగానే మాట్లాడుతామని పవన్ చెప్పారు. వైసిపి నేతలు సమస్యల్ని తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. గెలుపోటములు తమకు తెలియదని, ప్రజా సమస్యల కోసం పోరాడటమే తమకు తెలుసన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలనే ఈ ప్రభుత్వం చేస్తోందని పవన్ ఆరోపించారు.
previous post