రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజకీయ చతురతతో ఎట్టకేలకు నిడదవోలు మునిసిపాలిటీ పీఠం జనసేన కైవసం చేసుకుంది. రాష్ట్రంలో జనసేన పార్టీ ఖాతాలో ఇది తొలి మున్సిపాలిటీగా నిలిచింది. గత కొన్నాళ్లుగా నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ పీఠం విషయంలో రేగిన ఉత్కంఠకు తెర పడింది. జనసేన వ్యూహ ప్రతివ్యూహాలతో వేసిన అడుగులు విజయం వైపు దారి తీశాయి. దీంతో జనసేన పార్టీ శ్రేణులు, కూటమి శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే నిడదవోలులో మొత్తం 28 కౌన్సిలర్లకు జనసేన పార్టీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేరు. గడిచిన ఎన్నికల్లో వైసిపి 27 స్థానాల్లో విజయం సాధించగా, టిడిపి ఒక్క స్థానంలో గెలిచింది. దీంతో.. వన్ సైడ్ గా వైసిపి ఈ మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. కానీ ప్రస్తుతం పాలకులు మారారు. నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యేగా గెలుపొందిన జనసేన నేత కందుల దుర్గేష్ మంత్రిగా పదవీ బాధ్యతలోకి వచ్చారు. అంతే.. ఇక్కడ సీను ఒక్కసారిగా మారిపోయింది.
ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విధానాలు, మంత్రి కందుల దుర్గేష్ రాజకీయంగా వ్యవహరించిన తీరు, కూటమి సర్కార్ ప్రజలకు చేసిన మేలు ఇవన్నీ కౌన్సిలర్లను ఆకర్షించి జనసేనలో చేరేందుకు ఉపకరించాయి. తొలుత చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు మరో పదకొండు మంది వైసీపీ సభ్యులు జనసేనలో చేరిపోయారు. దీంతో 13 మంది కౌన్సిలర్లు జనసేన పార్టీకి ఏర్పడ్డారు. కూటమి భాగస్వామ్యంలో ఉన్న టిడిపి కౌన్సిలర్ ని కలుపుకుంటే 14 మంది బలం ఇక్కడ జనసేనకు చేరింది.
మంత్రిగా ఉన్న దుర్గేష్ కి ఎక్స్ అఫీషియో మెంబర్ ఓటు హక్కు ఉండటంతో.. ఆ బలం 15కి పెరిగింది. ఏప్రిల్ 3న మునిసిపల్ చైర్మన్‌పై అవిశ్వాసానికి తీర్మానం పెట్టాలంటూ వైసీసీ కౌన్సిలర్లు ఆర్డీవో, కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. అయితే.. ఇంతలోనే మరి కొంతమంది జనసేనలో చేరుకోవడంతో వారికి అవిశ్వాస తీర్మానానికి తగ్గ బలం కూడా సరిపడని పరిస్థితి ఏర్పడింది. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.
ఈ క్రమంలో జనసేన పార్టీ ఇక్కడి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. జీరో స్థాయి నుండి పీఠం అధిష్టించే స్థాయికి చేరడం సాధారణ విషయం కాదు. తెరవెనుక మంత్రి కందుల దుర్గేష్ రాజకీయ చాణక్యంతో నిడదవోలు మున్సిపల్ పీఠంపై జనసేన జెండా ఎగరుతోంది. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ విజయం కోసం కష్టపడిన పార్టీ శ్రేణులను ప్రత్యేకంగా అభినందనదించారు..