చెన్నై మెరీనా బీచ్‌లో ఉన్న జయలలిత మెమోరియల్ ఇప్పుడు కళ్యాణ వేదికగా మారింది. నమ్మడం లేదా? అన్నాడీఎంకే నేత భవానీ శంకర్ తమిళనాడు దివంగత సీఎం జయలలితకు వీరాభిమాని. ఆమె సమీక్షంలోనే తన కుమారుడు సాంబ శివరామన్ అలియాస్ సతీష్ పెళ్లి జరిపించాలని భావించారు. కానీ జయలలిత ఇప్పుడు లేరు. దాంతో జయలలిత సమాధి దగ్గర తన కుమారుడి పెళ్లి జరిపించాలని అనుకున్నారు. అందుకోసం పన్నీర్ సెల్వం అనుమతి కోరారు. కానీ మొదట అనుమతి లభించలేదు. అప్పటికే శుభ లేఖలు పంచి.. జయలలిత మెమోరియల్ వద్దే వివాహని భవానీ శంకర్ బంధుమిత్రులకు, పార్టీ నేతలకు చెప్పారు. పార్టీ హైకమాండ్‌ని పలుమార్లు విజ్ఞప్తి చేసిన తర్వాత ఎట్టకేలకు అనుమతి వచ్చింది. దాంతో బుధవారం తన కుమారుడి పెళ్లిని ఘనంగా జరిపించాడు భవనీ శంకర్. జయలలిత మెమోరియల్‌ని రంగు రంగుపూలతో అలంకరించి.. సమాధి ఎదురుగా వధూవరులకు పీటలు వేశారు. అక్కడే ఉన్న జయలలిత చిత్రపటానికి పూలమాల వేసి, పెళ్లి తంతు పూర్తి చేశారు. అనంతరం నూతన దంపతలు జయలలిత ఫొటోకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అమ్మ తమను దీవించిందని..జయలలిత సమక్షంలోనే పెళ్లి జరిగినట్లుగా తాము భావిస్తున్నామని కొత్త జంట చెప్పారు. అమ్మ భౌతికంగా లేకున్నా..ఆమె సమాధి చెంత తన కుమారుడి పెళ్లి జరగడం సంతోషంగా ఉందన్నారు భవానీ శంకర్. ఈ వివాహ వేడుకకు బంధువులతో పాటు అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.