24 C
Hyderabad
June 19, 2021 09: 33 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ చీఫ్ జస్టిస్ కు  జర్నలిస్టు రఘు భార్య ఫిర్యాదు

#ganji laxmi praveena

రౌడీలు వచ్చి కిడ్నాప్ చేయడం, ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేశామని చెప్పడం చూస్తుంటే పోలీసులు, రౌడీలు కలిసి పని చేస్తున్నారా? అనే సందేహం వస్తున్నది జర్నలిస్టు రఘు ‘‘చట్ట విరుద్ధ అరెస్టు’’ కేసులో. ఇదే సందేహం వెలిబుచ్చుతూ రఘు భార్య లక్ష్మీ ప్రవీణ తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు పూర్తి పాఠం ఇది:

గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ తెలంగాణ గారికి…

విషయం: నా భర్త గంజి రఘును అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా కిడ్నాప్  చేసి… అధికార పార్టీ ఒత్తిళ్లతో అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవటంతో పాటు, రఘును హత మార్చే కుట్రలపై వెంటనే మీ జోక్యం గురించి.

గౌరవ న్యాయమూర్తి గారు..

నా భర్త సీనియర్ జర్నలిస్టుగా ఎందరో రాజకీయ నాయకుల అవినీతి,  ప్రభుత్వ వ్యవస్థలను ప్రభావితం చేస్తున్న పాలకపక్ష నేతల సన్నిహితుల వల్ల ఇబ్బందులకు గురవుతున్న వారి బాధలను వెలుగులోకి తెస్తున్నాడు. దానిలో భాగంగానే  నల్గొండ జిల్లా హుజుర్ నగర్ లో బాధితులు నిర్వహిస్తున్న కొన్ని కార్యక్రమాల కవరేజ్ చేశాడు.

అయితే, ఈనెల 3న ఉదయం 9గంటలకు నా భర్త నిత్యావసరాలు, పండ్ల కోసం మల్కాజ్ గిరిలో బయటకు వెళ్లాడు. మల్కాజ్ గిరిలో రోడ్డు పక్కన ఉదయం 9.46నిమిషాలకు మామిడి పండ్లు కొనుగోలు చేస్తున్న సమయంలో సివిల్ దుస్తుల్లో ఉన్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు పెట్టుకొని నా భర్తను దౌర్జన్యంగా కారులోకి ఎక్కించుకొని వెళ్లిపోయారు. గంట దాటినా రఘు ఇంకా ఇంటికి రాకపోవటంతో నేను ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో రఘుకు ఏమైందో అన్న భయం పట్టుకుంది.  నా కూతురు, నేను రఘు కోసం టెన్షన్ పడుతున్న సమయంలో నా భర్త స్నేహితుడు వచ్చి రఘును మెయిన్ రోడ్డుపై ఎవరో కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లినట్లు తెలిసిందని షాక్ కు గురిచేసే విషయం చెప్పాడు.

నా భర్తకు చాలా రోజుల నుండి అధికార పార్టీ నేతలు, పెద్ద మనుషులుగా చలామణిలో ఉన్న వారి తరఫు వారి నుండి బెదిరింపులు కాల్స్ వస్తుండేవి. దీంతో నా భర్త ప్రాణాలకు హాని ఉందని నా బంధుమిత్రులకు విషయం చెప్పాను. ఇంతకుముందు, పుప్పాలగూడ లో జరిగిన భూ ఆక్రమణలు, ఐడీపీఎల్-హిందుజా-గల్ఫ్ ఆయిల్స్ కు చెందిన దాదాపు 500 ఎకరాల భూముల ఆక్రమణ, ఐకియాకు ఎదురుగా ఉన్న 43ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా వంటి విషయాలపై … నా భర్త ఆధారాలతో సహ బయటపెట్టే క్రమంలోనూ ఇలా బెదిరింపులు వచ్చాయి. ప్రజల సొమ్మును కాపాడే ప్రయత్నం చేసిన రఘును చంపేస్తామంటూ కొన్ని నెలలుగా బెదిరింపులు వచ్చినా రఘు ధైర్యంగా ముందుకు సాగాడు. హుజుర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి భూఆక్రమణల బాధితులుగా ఉన్న కొందరు గిరిజనుల కోసం రఘు పనిచేయటంపై రఘు పేరెత్తకుండానే… ఎమ్మెల్యే సైదిరెడ్డి మీడియా ముఖంగానే తీవ్రమైన హెచ్చరికలు చేశారనే విషయాన్ని మీ దృష్టికి తీసుకవస్తున్నాను.

గౌరవ న్యాయమూర్తి గారు… నా భర్త కిడ్నాప్ అయ్యారని తెలియగానే తన జర్నలిస్టు మిత్రులంతా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. రఘు కిడ్నాప్ విషయం సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ అయ్యింది. దీంతో మధ్యాహ్నం 1.30గంటలకు కొందరు పోలీసు అధికారులు మా ఇంటికి వచ్చి రఘును మఠంపల్లి పోలీసు స్టేషన్ లో నమోదైన క్రైం. నెం 20/2021లో అరెస్ట్ చేశామని, నల్గొండ జిల్లా మఠంపల్లి స్టేషన్ కు తరలించామని తెలిపారు. అయితే, ఈ నెల 8న బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు  నా భర్తను అడ్డగించి, బలవంతంగా కారులోకి ఎక్కించుకొని పోయినట్లు స్పష్టంగా కనపడింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో నా భర్త రఘు పండ్లు కొనుగోలు చేస్తున్న దృశ్యాలు,  ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రెడ్ టీషర్టులో ఒకరు, మరో టీషర్టులో ఒకరు ముఖానికి మాస్కులు పెట్టుకొని వచ్చి రఘు వెనుక నిలబడ్డారు. ఓ కారులో తనను ఎక్కించేందుకు ప్లాన్ చేయగా కుదరలేదు. ఆ వెంటనే మరో కారు వచ్చింది. దీంతో రఘు భుజాలను పట్టుకొని లాక్కెళ్లి, కారులో పడేసే ప్రయత్నం చేయటం… రఘు ప్రతిఘటిస్తున్న సమయంలో మరో వ్యక్తి ముఖానికి మాస్క్ పెట్టుకొని వారిక సహకరించినట్లు స్పష్టంగా కనపడింది. ఆ తర్వాత రెడ్ టీ షర్టులో ఉన్న వ్యక్తి రోడ్డుకు అటు వైపు ఉన్న కారులోకి ఎక్కి వెళ్లిపోయాడు. ఆ కిడ్నాప్ జరిగినప్పుడు ఉదయం 9.46 గంటలుగా టైం రికార్డయింది. వారు పోలీసులని తెలిసి నేను షాక్ అయ్యాను. వారిలో ఒక్కరు కూడా పోలీసు డ్రెస్సులో లేరు. పైగా ఆ రెండు కార్లు ఏపీ నెంబర్ ప్లేట్లతో ఉన్నాయి. పోలీసు వాహనాలు కూడా కాదు.

కిడ్నాప్ సమయంలో రికార్డయిన సీసీటీవీ ఫుటేజ్ కు సంబంధించిన ఫోటోలు, మీడియాలో వచ్చిన వీడియాలను కూడా జత చేస్తున్నాను. ఈ వీడియోలు చూస్తే దీన్ని అరెస్ట్ అని ఎవరూ అనరు అనే విషయం తెలిసిపోతుంది. దీన్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ అని ఎలా అంటారో… మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా బనానా రిపబ్లిక్ లో ఉన్నామో అన్న అనుమానం కలుగుతుంది. ఇలాంటి చట్టవ్యతిరేక పనులను అరెస్ట్ అంటూ చెప్తున్నారు. 

గౌరవ న్యాయమూర్తి గారు… నా భర్త జీవించే హక్కును, తన భావ ప్రకటన స్వేచ్ఛను హరించటం, జర్నలిస్టుగా తన ప్రశ్నించే హక్కును ఈ పోలీసులు, అధికార పార్టీ నాయకులు హరించి వేయలేరు. భూ కబ్జా దారులు, అధికార పార్టీ నాయకుల అవినీతిని వెలికితీస్తున్నందునే ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కాపాడాల్సిన వారే గుండాలుగా, దౌర్జన్యం చేస్తుండటంతో నా భర్త ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉంది.

నా భర్తకు వారి నుండి ప్రాణహని ఉందని మీకు విన్నవించుకుంటున్నాను.  పోలీసులు నమోదు చేసిన కేసు 07.02.2021లో దాదాపు నాలుగు నెలల పాటు ఆ కేసులో ఎలాంటి చర్య తీసుకోకుండా… ఇప్పుడు పట్టపగలు ప్రజలు చూస్తుండగా అపహరించారు. ఆ కేసును చూస్తే నా భర్తను కావాలనే కేసులో ఇరికించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. సీఆర్పీసీ 41బీ ప్రకారం పోలీసులు రూల్స్ కు విరుద్దంగా వ్యవహరించారు. అసలు వారు పోలీసులే అని గుర్తు పట్టేలా లేరు.

వారు వాడిన వాహనాలు కూడా పోలీసు అధికారిక వాహనాలు కావు. పైగా సోషల్ మీడియాలో కిడ్నాప్ వ్యవహరం వైరల్ అయ్యే వరకు నాకు కానీ, మా కుటుంబ సభ్యులకు కానీ అరెస్ట్ విషయం చెప్పలేదు. నా భర్తను ఉదయం9.46కు ఎత్తుకెళ్లినట్లు స్పష్టంగా కనపడుతుండగా, మధ్యాహ్నం 1.30 గంటలకు మా ఇంటికి వచ్చిన పోలీసులు సీఆర్పీసీ 50(1) ప్రకారం మధ్యాహ్నం 12.45గంటలకు అరెస్ట్ చేశామని స్టేషన్ హౌజ్ ఆఫీసర్, మఠంపల్లి పేరుతో నోటీసులు ఇచ్చారు.

ఈ మొత్తం వ్యవహారంలో గతంలో సుప్రీంకోర్టు డీ.కే బసు వర్సెస్ బెంగాల్ రాష్ట్ర్రం కేసులో ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కారు. ఉదయం 10.30గంటలకు అరెస్ట్ అయిన వ్యక్తిని మధ్యాహ్నం 12.45గంటలకు అరెస్ట్ చేసినట్లు చూపటం  రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రసాదించిన ప్రాథమిక హక్కుకు భంగం కలిగించటమేనని స్పష్టంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను.

నా భర్త జీవించే హక్కును, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తుంది. ఓ జర్నలిస్టు గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుంది. మరిన్ని కేసులు నమోదు చేసి ఎక్కువ కాలం జైల్లో ఉండేలా అక్రమ కేసులు నమోదు చేసే కుట్రలు కూడా జరుగుతున్నాయి. ఈ చర్యల వల్ల మా కుటుంబం తీవ్ర మనోవేదనతో ఉంది.

గౌరవ న్యాయస్థానం, న్యాయమూర్తిగా మీరే మాకు న్యాయం చేయాలి. మీపై పూర్తి నమ్మకంతోనే ఈ లేఖ రాస్తున్నాను. నా భర్తను పోలీసులు, అధికార పార్టీ నేతల నుండి కాపాడాలని వేడుకుంటున్నాను. ఆరు సంవత్సరాల పాపతో ఇంట్లోనే ఉండే నాకు నా భర్తను కాపాడేందుకు మీరు తప్ప మరో దారి లేదు. మీరు వెంటనే జోక్యం చేసుకోకపోతే నా భర్త ప్రాణాలతో పాటు నాకు, నా పాపకు కూడా ప్రాణహని తలపెట్టే అవకాశం కూడా ఉంది.  మీపై ఎన్నో ఆశలతో… ఈ లేఖ రాస్తున్నాను.

ధన్యవాదములు

ఇట్లు

గంజి లక్ష్మీ ప్రవీణ, w/o గంజి రఘు, మల్కాజ్ గిరి, హైదరాబాద్

Related posts

కొల్లాపూర్ లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది

Satyam NEWS

పవిత్ర ఉగాది

Satyam NEWS

కరోనా లక్షణాలు ఉన్నాయన్న భయంతో వ్యక్తి ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!