38.2 C
Hyderabad
April 25, 2024 11: 17 AM
Slider ప్రత్యేకం

పాపులర్ జర్నలిస్టు TNR ఆవేదనాభరిత మనోగతం…

#Journalist TNR

TNRగా పాపులర్ అయిన జర్నలిస్టు తుమ్మల నరసింహారెడ్డి కన్నుమూశారు. కరోనాతో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ‘ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR’ అంటూ ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. TNR మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తన ఫేస్ బుక్ ఖాతాలో రాసిన ఆఖరి మాటలు ఇవి:

నా ఈ చిన్న కోరికని తీరుస్తారా…?

జీవితం లో చాలా రోజుల తర్వాత  ఐదు రోజుల నుండి చాలా లో ఫీలింగ్ లో ఉన్నాను. మనసులో చెప్పలేనంత బాధ ఉంది…అందుకే ఫేస్ బుక్ కి కొంచెం దూరంగా ఉన్నాను.. నా ప్రొఫెషనల్ విషయాలని తప్ప నా వ్యక్తిగత విషయాలని ఫేస్ బుక్ లో షేర్ చేసుకోడానికి నేను పెద్దగా ఇష్టపడను.. కానీ ఈరోజు నాకు తప్పటం లేదు…

అలా తప్పటానికి ఖచ్చితమైన కారణం ఉంది…నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నారు… నాకు అచ్చంగా అమ్మలాంటి వ్యక్తి, నా అక్కకి కరోనా పాజిటివ్ వచ్చి చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉంది…

కరోనా పాజిటివే కదా, ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికి క్యూర్ అవుతుంది కదా అని మీరు అనుకోవొచ్చు.. కానీ పరిస్థితి కొంచెం క్రిటికల్ గానే ఉంది… మొన్న ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ కొత్తపేట్ లోని ఒమిని హాస్పిటల్ లో ఎడ్మిట్ అయింది. ప్రస్తుతానికి అక్క  ఐ.సి.యు లో వెంటీలేటర్ మీద ఉంది..

డాక్టర్ ఛాన్సెస్ కొంచెం తక్కువే అన్నట్టు చెప్పారు. పుట్టినరోజు విషెస్,పండగ విషెస్,గుడ్ మార్నింగ్ మెసేజెస్ నేను పెద్దగా ఫాలో అవ్వను. తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరికైనా చెబుతానేమోగానీ పెద్దగా వాటికి ప్రాముఖ్యత ఇవ్వను…

అది నా వ్యక్తిగత నైజం మాత్రమే… వాటి గురించి పక్కనపెడితే ఇప్పుడు నేను ఈ పోస్ట్ పెట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే… 

ఈ సృష్టికి సంబంధించి నేనొక విషయాన్ని చాలా బలంగా నమ్ముతాను… మన గురించీ,మన ఫ్యామిలీ గురించి,మన వాళ్ళ గురించి కాకుండా ఎలాంటి స్వార్థం లేకుండా ఎదుటి వ్యక్తి గురించి ప్రార్థిస్తే మాత్రం ఆ ప్రార్థనలు ఖచ్చితంగా నెరవేరిపోతాయ్ అని… మనకి ఎలాంటి దగ్గరి సంబంధం లేని ఎవడికోసమో మనిషి చేసే ప్రార్థనకి బలమెక్కువ.. 

ఆ ప్రార్థనలు ఓ సమూహంగా,ఓ గుంపుగా వస్తే వాటికి ఇంకా ఇంకా బలమెక్కువ…

మా అక్క తొందరగా కోలుకోవాలని ఒక్క పది సెకన్లు మీ అందరు మనస్పూర్తిగా విష్ చెయ్యాలన్నది నా కోరిక……అంతే… ఈ కింది రెండు లైన్లు మృత్యుంజయ మంత్రం..

“ఓం త్రయంబకం యజామహే…సుగంధిం పుష్టివర్ధనం

ఉర్వారుకమివ బంధనాత్…మృత్యోర్ముక్షీయమామృతాత్”

ఓం నమశివాయ…

ఇది చాలా బలమైన మంత్రం…

మీరు విష్ చేస్తున్నప్పుడు ఈ రెండు లైన్లు మనసులో అనుకోవాలని నా మనవి. ఈ మంత్రాల మీద,మతాల మీద నమ్మకం లేని వాళ్ళు జస్ట్ మనసులో విష్ చెయ్యండి చాలు. సమూహంగా వచ్చే మీ ప్రార్థనలతోనైనా అక్క లేచి వస్తుందనే ఆశ.. ఏ చిన్న ఆశని కూడా నేను వదిలిపెట్టదల్చుకోలేదు…

జరగరానిదేదైనా జరిగితే మీతో ఈ విషయం పంచుకోలేదే, పంచుకుని ఉంటే నాకు మంచి జరిగి ఉండేదేమో అనే రిగ్రెట్ నాకు ఉండకూడదు. ఈ పోస్ట్ ని పిచ్చితనంగా భావించేవాళ్ళు,కొట్టిపడేసే వాళ్ళు కూడా ఉండొచ్చు నా ఫ్రెండ్స్ లిస్ట్ లో…

కానీ ఇది నా నమ్మకం.. నా అమ్మలాంటి అక్క బ్రతకాలి అనే బలమైన కోరిక తప్ప నా మనసుకింకేం అనిపించట్లేదూ, చెవులకేం వినిపించట్లేదూ,కంటికేం కనిపించట్లేదు.

ఆ బలమైన కోరికే “ఎవరేమనుకున్నా పర్వాలేదు”అనుకునేలా చేసి నన్ను ఈ పోస్ట్ పెట్టేలా చేసింది..

దయచేసి ఒక చిన్న మనవి… మీ ప్రార్థనలు,మీ విషెస్ ని ఇక్కడ పోస్ట్ కిందగానీ,నాకు పర్సనల్ గా గానీ దయచేసి పంపించకండి…

ఒక్క పది సెకన్లు మీవి కావనుకుని నాకోసం మీ మనసులోనే మనస్పూర్తిగా అనుకోండి చాలు. మనం ఎదుటివాడి గురించి ప్రార్థించే ప్రార్థనలు ఆ ప్రార్థించేవాడికి తప్ప రెండో వ్యక్తికి తెలియకూడదు. అప్పుడే ఆ ప్రార్థనలకి బలం అనేది నా నమ్మకం.

అసలు ఎదుటివాడి గురించి ప్రార్థించాలంటే వాడి కష్టమేంటో మనకు తెలియాలి కదా… అందుకే…అది మీకు తెలియాలనే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పోస్ట్ పెట్టా. సింపతీ కోరుకోవడానికి మాత్రం కాదు..

దయచేసి అన్యదా భావించకండి…

పోస్టులో ఏదైనా తప్పుగా రాసి ఉంటే క్షమించండి.. నిన్న సాయంత్రం డాక్టర్ పర్సనల్ గా పిలిచి చాన్సెస్ తక్కువ అని చెప్పాక కళ్ళల్లో నీళ్ళు తిరిగి,అవి మా బావకి అల్లుడికి కనపడకుండా కిందకి వచ్చి  కార్లో కూచుని నా మనసులో అనిపించిన మాటలని ఇలా టైప్ చేశాను..

ఫేస్ బుక్ లో పోస్ట్ చేద్దామనుకుని సెండ్ బటన్ కొడదామని వెళ్ళిన వేళ్ళు ఆగిపోయాయ్…ఇలా పోస్ట్ చెయ్యడం ఎంత వరకు కరెక్ట్ అని ఆగాను.. 24గంటల తర్వాత బాగా ఆలోచించాక ఎవరేమనుకున్నా పర్వాలేదని ధైర్యం చేసి ఈరోజు ఈ పోస్ట్ పెడుతున్నాను.

ఇది నా చివరి ప్రయత్నం…

ఈ పోస్ట్ ఇలా పెట్టడం కరెక్టో కాదో కూడా తెలీని మానసిక స్థితిలో ఉన్నాను ప్రస్తుతం.. ఏదో…మంచి జరుగుతుందేమో అనే అమాయకత్వంతో కూడుకున్న చిన్న తాపత్రయం నాది… తను బతికితే చాలూ అనే చిన్న స్వార్థం ఇది… నా నిస్సహాయ స్థితే నాతో ఈ పోస్ట్ పెట్టిస్తోంది..

డాక్టర్స్ హోప్ ఉందంటున్నారు..

కానీ అది తక్కువ శాతం.. ఆ శాతం మీ విషెస్ తో వందశాతం అవ్వాలని నా ఆశ..

మొదటిసారి నేను కోరిన నా ఈ వ్యక్తిగత కోరికని తీరుస్తారని,”అక్క ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది” అనే పోస్ట్ తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటానని ఆశిస్తున్నాను.

నా ఈ చిన్న కోరికని తీరుస్తారా…?  – TNR

గమనిక : నా వైపు బంధువులెవరికీ ఈ విషయం తెలీదు…

ఎందుకు ఈ విషయం చెప్పడం,చెప్పి వాళ్ళని ఎందుకు టెన్షన్ పెట్టడం,మళ్ళీ వాళ్ళందరి నుండీ ఫోన్లు రావడం,ఇదంతా ఎందుకు తొందర్లోనే కోలుకుంటుంది కదా అనుకున్నా..

ఇప్పటికీ ఎవరికీ చెప్పలేదు. ఇక ఇప్పుడు మాత్రం మీ దీవెనల కోసం ఈ పోస్ట్ పెట్టాల్సి వచ్చింది. ఈ పోస్ట్ మా వాళ్ళు ఎవరైనా చదివితే తప్ప వాళ్ళకు తెలిసే అవకాశం లేదు.

ఈ పోస్ట్ చూసిన వాళ్ళలో నా బంధువులు,నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే గనక మా నాన్నకి కాల్ చేసి ఈ విషయం గురించి అడగొద్దని మనవి. తనకి విషయం ఇంత సీరియస్ గా ఉందని తెలీదు..

తనకి ఫేస్ బుక్ తెలియదు కాబట్టి ధైర్యం తో ఈ పోస్ట్ పెడుతున్నాను..

తనకి 88సంవత్సరాలు… ఈ వయసులో ఈ వార్త తట్టుకోలేరు..

దయచేసి ఈ పోస్ట్ చూసిన బంధు మిత్రువులెవరూ నాన్నకి కాల్ చేయొద్దని విన్నపం

ఇది కొద్ది రోజుల క్రితం TNR తన ఫేస్ బుక్ పేజీ లో తన అక్క కోసం పెట్టిన పోస్ట్

Related posts

కొల్లాపూర్ ప్రాంతంలో కరోనా బియ్యం దొంగలు

Satyam NEWS

లిబియా అధ్యక్ష బరిలో గడాఫీ కుమారుడు

Sub Editor

కోత‌కు గురైన‌ అప్రోచ్ రోడ్: మంచిర్యాల నిర్మ‌ల్ మ‌ధ్య నిలిచిన రాకపోకలు

Satyam NEWS

Leave a Comment