27.2 C
Hyderabad
October 21, 2020 18: 58 PM
Slider సంపాదకీయం

న్యాయానికి బలవంతంగా ‘అ’ తగిలిస్తున్న పాలకవర్గం

#Judiciary

వ్యక్తుల మధ్య పోరాటాన్ని వ్యవస్థల మధ్య పోరాటంగా చిత్రీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యవస్థలకు అధిపతులైన వారు సంయమనం పాటించాలి కానీ అలాంటిది ఏ వ్యవస్థలోనూ కనిపించకపోవడం ఏపి ప్రత్యేకతగా కనిపిస్తున్నది.

గతంలో కూడా వ్యవస్థల మధ్య స్పర్ధలు ఉండేవి. ముఖ్యంగా శాసన వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు మధ్య వైరుద్ధ్యాలు కనిపించేవి. అదే విధంగా కార్యనిర్వాహక వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు మధ్య కూడా విభేదాలు కనిపించేవి.

అంటే అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులు కొట్టేయడం, మెజారిటీ నిరూపణ సమయంలో స్పీకర్ పాటించే విధానాలను కోర్టులు ప్రశ్నించడం, సూచనలు చేయడం లాంటివి జరిగేవి. అలాగే కార్యనిర్వాహక వ్యవస్థ తీసుకునే నిర్ణయాలపై న్యాయ సమీక్ష జరిగేది.

ప్రభుత్వ నిర్ణయాలు కోర్టుల్లో కొట్టేసినప్పుడు ప్రభుత్వాలు కూడా ఎంతో హుందాగా వ్యవహరించేవి. ఏ రాజ్యాంగ వ్యవస్థ కూడా మరో రాజ్యంగ వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదని చెబుతున్నా న్యాయవ్యవస్థ మాత్రం వీటన్నింటికి అతీతంగా ఉండాల్సిన అనివార్య పరిస్థితులు దేశంలో ఉన్నాయి.

అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయవ్యవస్థ ను కూడా ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతున్నది. వ్యతిరేకంగా వస్తున్న తీర్పులపై సమీక్ష జరపకుండా, తాము ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకుని సరిదిద్దుకోకుండా న్యాయవ్యవస్థను ఎవరో దగ్గరుండి నడిపిస్తున్నారని, న్యాయవ్యవస్థ తమపై కక్ష కట్టిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు నేరుగా ఆరోపణలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పటికి 80కి పైగా కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వెలువరించింది. చాలా సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ కూడా రిలీఫ్ లభించలేదు. ప్రతిదానికి సుప్రీంకోర్టు వరకూ ఎందుకు వస్తున్నారు అని కూడా అక్కడి న్యాయమూర్తులు ప్రశ్నించారు.

అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం తనను తాను సమీక్షించుకోవడం లేదు. న్యాయమూర్తులు అందరూ అవినీతి పరులు అన్న విధంగా సోషల్ మీడియాలో కొందరు పెడుతున్న పోస్టులు జుగుప్స కలిగిస్తున్నాయి. దారుణం ఏమిటంటే ఇలాంటి పోస్టులను హర్షించే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతున్నది.

న్యాయవ్యవస్థ పై బురదచల్లి మనం సాధించేది ఏమిటి? తాత్కాలిక ప్రయోజనాల కోసం వ్యవస్థలపై తప్పుడు ఆరోపణలు చేస్తే మొత్తం సమాజం విచ్ఛిన్నం కాదా? ఇలాంటి నీతులు కూడా ఎవరూ చెప్పకపోవడం అసలైన విషాదం. కోర్టులను ఇలా కించపరచడం తప్పు నాయనా అని ఎవరైనా నీతి బోధించినా వినేపరిస్థితి లేదు.

పైగా ఇలా చెప్పిన వారంతా చంద్రబాబునాయుడు మనుషులుగానూ, మీడియా అయితే ఎల్లో మీడియా గానూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే తటస్థులు కూడా వివేకవంతమైన సూచనలు, సలహాలు ఇవ్వడం మానేశారు.

ఇదే అదనుగా న్యాయవ్యవస్థపై బురద చల్లే కార్యక్రమం పెచ్చరిల్లిపోతున్నది. ఏకపక్షంగా పుంఖాను పుంఖాలుగా వచ్చేస్తున్న సోషల్ మీడియా పోస్టులు, అధికార పార్టీ నేరుగా, పరోక్షంగా నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సంస్థలు రాస్తున్న వార్తలు సమాజం నిండా పరుచుకుంటున్నాయి.

న్యాయమూర్తులకు చంద్రబాబునాయుడు ఇళ్ల స్థలాలు ఇచ్చాడు అందువల్లే వాళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు చెబుతున్నారు అంటూ విమర్శలను బాధ్యులైన పెద్దలే గుప్పిస్తున్నారు. అమరావతి కోర్ ఏరియాలో ఒక్క న్యాయమూర్తులకే కాదు ఐఏఎస్ లకు, ఐపిఎస్ లకు, జర్నలిస్టులకు, ఎన్ జీవో లకు ఇలా చాలా మందికి చంద్రబాబు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది.

కేటాయించడం అంటే ఫ్రీగా ఇవ్వడం కాదు సుమా. అప్పటి మార్కెట్ రేటుకు ఇచ్చారు. అంటే ఒక్కో స్థలం సుమారుగా 26 లక్షల రూపాయలు వెచ్చించి కొనుక్కున్నారు. చాలా మంది బ్యాంకు లోన్లు తీసుకుని, ప్రావిడెంట్ ఫండ్ విత్ డ్రా చేసుకుని స్థలాలు కొనుక్కున్నారు.

ఇలా కొనుక్కున్న వారిలో న్యాయమూర్తులు కూడా ఉండిఉండవచ్చు. అయినంత మాత్రాన వారు అవినీతికి పాల్పడినట్లా? వారు కొనుక్కున్న నాటి నుంచి వడ్డీ లెక్కవేసుకుంటే ఇప్పుడు 40 లక్షల వరకూ అయి ఉంటుంది. ప్రస్తుతం ఆ స్థలం అమ్మాలంటే కొనే నాథుడు కూడా లేడు.

అక్కడ నుంచి రాజధాని పూర్తిగా తరలిపోయిన తర్వాత అక్కడ పిచ్చి మొక్కలు మాత్రమే నివాసం ఉంటాయి. అలాంటి స్థలాల విషయానికి న్యాయమూర్తుల తీర్పులకు లింకు పెట్టడం సమంజమా?  వైషమ్యాలు రెచ్చగొట్టి రాజకీయం చేయడం సులభం కావచ్చు.

కానీ అవే వైషమ్యాలు మన కొంప కూడా ముంచే రోజు దగ్గరలోనే ఉందని గుర్తించడం తెలివిగలవారి నైజం. న్యాయవ్యవస్థ ఇచ్చే తీర్పులను సమీక్షించుకుని తప్పులు జరగకుండా చేసుకోవాలి కానీ న్యాయవ్యవస్థతో నేరుగా తలపడటం, న్యాయమూర్తులను అత్యంత నీచమైన వ్యక్తులుగా చిత్రీకరించడం, తమ అప్రతిహత అధికారానికి అడ్డువస్తున్నారని ఉక్రోషం ప్రదర్శించడం విజ్ఞత అనిపించుకోదు.

న్యాయమూర్తులను దోషులుగా నిలబెట్టే సంస్కృతి మానుకోకపోతే మనమూ ఏదో ఒక నాడు దోషులుగా నిలబడాల్సి వస్తుందనే వివేచన అవసరం. జ్యుడీషియల్ యాక్టివిజం మన దేశానికి కొత్త కాదు. అలాగని ఆంధ్రప్రదేశ్ లోని న్యాయవ్యవస్థ అత్యుత్సాహం కూడా ప్రదర్శించడం లేదు.

కేవలం తమ వద్దకు వచ్చిన కేసులనే పరిశీలిస్తున్నది. పాజిటీవ్ గా అర్ధం చేసుకుంటే భవిష్యత్తు ఉంటుంది.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యంన్యూస్.నెట్   

Related posts

వెరైటీ ప్రొటెస్టు: నవరత్నాలు అమ్ముతాం నవరత్నాలు

Satyam NEWS

ఇంటిని విరాళంగా ఇచ్చేసిన ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

Satyam NEWS

జన్మదిన కానుక

Satyam NEWS

Leave a Comment