జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో అక్కడి శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ జమ్మూకాశ్మీర్ కు పయనం అయ్యారు. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని కశ్మీర్ ప్రజలు జీర్ణించుకునే అవకాశం లేకపోవడంతో పాటు సరిహద్దుల్లో ఉగ్రవాదులు పంజా విసిరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం జమ్మూకాశ్మీర్‌కు అదనపు బలగాలను పంపింది. సైన్యానికి చెందిన సీ-17 రవాణా విమానంలో సోమవారం 8 వేల మంది పారామిలటరీ బలగాలను తరలించింది. కాశ్మీర్‌లో కేంద్రం ఇప్పటికే 35 వేలమంది సైనికులను మోహరించింది. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్ధుల్లా, సాజద్ లోన్‌లను సోమవారం గృహ నిర్బంధంలో ఉంచారు.
సెల్ ఫోన్, ల్యాండ్ లైన్ సర్వీసులు రద్దు
ల్యాండ్‌లైన్, సెల్‌ఫోన్, ఇంటర్‌నెట్ సర్వీసులను నిలిపివేసింది. అయితే అధికారులకు మాత్రం అత్యవసర పరిస్ధితుల్లో ఉపయోగించుకోవడానికి శాటిలైట్ ఫోన్లను అందించారు. దీనికి తోడు కాశ్మీర్ వ్యాప్తంగా వీధుల్లో సభలు, సమావేశాలు, ధర్నాలను నిషేధించారు. శుక్రవారం నుంచే అమర్‌నాథ్ యాత్రికులు, పర్యాటకులను కాశ్మీర్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో పెట్రోల్ సహా ఇతర నిత్యావసరాల కోసం జనం మార్కెట్ల వద్ద బారులు తీరుతున్నారు.