కొల్లాపూర్ కోటకు సంబంధించి తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారి బండారం బయటపెడతానని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. సురభి వంశస్థుడైన కొల్లాపూర్ రాజావారు తన స్వార్ధంతో తన అవివేకంతో తన వంశ ప్రతిష్టను తానే దిగజార్చుకుంటున్నాడని ఆయన అన్నారు. నేడు రెండో రోజు జూపల్లి కృష్ణారావు రామమందిరంలో బైఠాయించారు. తనపై చేసిన ఆరోపణలు వాస్తవం అయితే కొల్లాపూర్ రాజావారు వచ్చి దేవుడి సాక్షిగా చెప్పాలని ఆయన సవాల్ చేసి రెండో రోజు కూడా దేవాలయంలో ఎదురు చూశారు. అయితే కొల్లాపూర్ రాజు కానీ మరెవరు కానీ రాలేదు. దాంతో రేపు ఎన్ టి ఆర్ చౌరాస్తాలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నానని జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. రెండో రోజు రామమందిరం దేవాలయంలో కూర్చున్నా కూడా రాజా సురభి వేంకట లక్ష్మణరావు రాలేదని ఆయన అన్నారు. అంతే కాకుండా తనపై నిరాధారమైన ఆరోపణలు చేసినందువల్ల రాజాగారిపై పది కోట్ల రూపాయలకు నష్టపరిహారం దావా వేస్తున్నట్లు జూపల్లి కృష్ణారావు తెలిపారు. తాను రేపు బహిరంగ సభలో చేసే ఆరోపణలకు అవసరమైతే రాజు గారు తన స్థాయికి తగినట్లు వంద కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేసుకోవచ్చునని జూపల్లి అన్నారు. వ్యక్తిగత ఆరోపణలు చేసినవారికి దేవుడి సాక్షిగా ప్రమాణం చేయమన్నాను వేంకట లక్ష్మణ రావు మాత్రం రాలేదు. నిజాయితీగా మాట్లాడేందుకు ధైర్యం ఉండాలి. నాలుకకు నరం లేదు కదా అని పలికేవాడు ఒకడు పలికించే వాడు మరొకడు. వీటన్నింటికి సమాధానం దేవాలయానికి రాలేదు కాబట్టి ప్రజల్లో అనుమానాలు తీర్చేందుకు బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాను అని జూపల్లి తెలిపారు. నేడు సదర్ కార్యక్రమం ఉన్న కారణంగా రేపు సాయంత్రం ఎన్ టి ఆర్ చౌరాస్తాలో బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎవరు నిజాయితీ పరులు, ఎవరు స్వార్ధ పరులు అనేది తేలుస్తాం. ఎవరు ప్రజల పక్షం ఎవరు స్వార్ధం పక్షం అనేది తేలుస్తా. దిమ్మతిరిగే విధంగా ప్రజలు అర్ధం చేసుకోవడం కోసం గోత్రాలు పుట్టుపుర్వోత్తరాలు దొంగ వేషాలు తప్పుడు మాటలు అన్నీ వివరిస్తాననని జూపల్లి అన్నారు.
previous post