32.2 C
Hyderabad
March 28, 2024 23: 41 PM
Slider సంపాదకీయం

సీక్రెట్: రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ఈ పదవిని ఎందుకు స్వీకరించారు?

#Justice Kanagaraj

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని కుదిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకురావడం, తద్వారా ఎన్. రమేష్ కుమార్ కు ఉద్వాసన పలకడం తదనంతర పరిణామాలలో హైకోర్టు ఆ ఆర్డినెన్సును కొట్టేయడం తెలిసిందే. ఇదంతా ప్రభుత్వం ఎందుకు చేసిందనే విషయం అందరికి తెలిసిందే.

కమ్మ సామాజిక వర్గానికి చెందిన రమేష్ కుమార్ చంద్రబాబునాయుడికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పినా ఎన్నికల సంస్కరణలలో భాగంగా తాము ఆర్డినెన్సును తెచ్చామని, అందులో భాగంగా రమేష్ కుమార్ వెళ్లిపోవాల్సి వచ్చిందని ప్రభుత్వం న్యాయస్థానంలో చెప్పింది.

ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవికి రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ఎలా అంగీకరించారు? అనేది ప్రస్తుతం చాలా మందిని తొలుస్తున్న ప్రశ్న. హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన అత్యంత అనుభవం కలిగిన వ్యక్తికి న్యాయపరమైన అంశాలు తెలియవా?

ఆర్డినెన్సును న్యాయస్థానంలో సవాల్ చేస్తే ఎలాంటి తీర్పు వస్తుందో ఆ మాత్రం అంచనా వేయలేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఆయనతో మాట్లాడుకుని ఆ తర్వాత ఆర్డినెన్సు ఇచ్చి ఉంటుంది. లేకపోతే అంత త్వరగా ఆయన వచ్చి పదవి స్వీకారం చేసే అవకాశం లేదు. అలా ఆర్డినెన్సు తీసుకువస్తామని చెప్పినప్పుడు ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి జాగ్రత్తలు చెప్పారో లేదో తెలియదు.

ఇప్పుడు ఫోకస్ అంతా రమేష్ కుమార్ పై ఉంది కాబట్టి చర్చ ఇటు వైపు నుంచే జరుగుతున్నది కానీ అసలు ఈ మొత్తం ఎపిసోడ్ లో అభాసు పాలు అయిన వ్యక్తి రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ అని చెప్పవచ్చు. హైకోర్టు జడ్జిగా పని చేసిన వ్యక్తికి జరగాల్సి అవమానం కాదు ఇది.

ఆయన హుటాహుటిన అంబులెన్సులో ప్రయాణం చేసి అమరావతి రావడం, వెనువెంటనే ప్రమాణ స్వీకారం చేయడం జరిగిపోయింది. ఆ తర్వాత ఆయన మళ్లీ చెన్నై వెళ్లిపోయారు. మధ్యలో ఒక సారి వచ్చి ఎన్నికల వాయిదా నోటీసును లాంఛనంగా ఇచ్చి మళ్లీ చెన్నై వెళ్లిపోయారు. అంతే.

ఆయన ఆ పదవిని అనుభవించింది కూడా లేదు. అసలు ఆర్డినెన్సు తీసుకువచ్చి ఉన్న వ్యక్తిని తీసేసి తనను పెడతానంటే ఆయన ఎలా అంగీకరించారనేది ప్రధాన ప్రశ్న. దీనికి బహుశ సమాధానం రాకపోవచ్చు కానీ ఈ ప్రశ్న మాత్రం మేధావుల మెదళ్లను తొలిచివేస్తూనే ఉంటుంది. న్యాయమూర్తిగా పనిచేసి విశేషమైన తీర్పులు ఇచ్చిన వ్యక్తిగా అఖండమైన ఖ్యాతి పొందిన జస్టిస్ కనగరాజ్ కు మాత్రం ఈ పరిణామాలు తీరని అవమాన భారాన్నే మిగిల్చాయి.

Related posts

శ్రీవాణి ట్రస్ట్ నిధులపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు

Bhavani

రెండు రాష్ట్రాల మధ్య బస్సు పంచాయితీ ఎవరి కోసం?

Satyam NEWS

ప్రభుత్వ వైద్య శాలను సందర్చించిన రోటరీ సభ్యులు

Satyam NEWS

Leave a Comment