కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ప్రకటించిన స్వచ్ఛత అవార్డులలో కే ఎల్ డీమ్డ్ విశ్వ విద్యాలయం ప్రథమ ర్యాంక్ ను దక్కించుకుందని యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ ఎల్ ఎస్ ఎస్ రెడ్డి తెలిపారు. నగరంలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అవార్డుకు సంబందించిన వివరాలను తెలియచేశారు.
న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహించిన ఉన్నత విద్యా సంస్థలు స్వచ్ఛ క్యాంపస్ ర్యాంకింగ్ – 2019 అవార్డుల కార్యక్రమంలో రెసిడెన్షియల్ యూనివర్సిటీల విభాగంలో కే ఎల్ డీమ్డ్ విశ్వ విద్యాలయం జాతీయ స్థాయిలో నెంబర్ – 1 ర్యాంక్ ను దక్కించుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పొక్రియాల్ చేతుల మీదుగా కే ఎల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కార్యదర్శి కోనేరు శివ కాంచన లత అందుకున్నారని చెప్పారు.
క్యాంపస్ ప్రాంగణంలో వ్యర్ధాల పునర్ వినియోగం, విద్యార్థుల వసతి గృహాలలోని వంటశాలలలో పాటిస్తున్న శుభ్రత, నీటి స్వచ్ఛత , విద్యా సంస్థలో పచ్చదనం పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు, పరిశుభ్రత కోసం ఉపయోగిస్తున్న అధునాతన పరికరాలు తదితర అంశాలు పరిగణలోకి తీసుకుని స్వచ్ఛత అవార్డు ప్రకటించినట్లు ఆయన వివరించారు.
యూనివర్సిటీ ప్రాంగణం లోని మురుగునీటి శుద్ధి చేసే కర్మాగారం, వ్యర్ధాల నుంచి ఎరువులు తయారు చేసే విధానం, సహజ ఇంధన వనరుల వినియోగం తదితర ఆధునిక ఏర్పాట్లపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఎల్ ఎస్ ఎస్ రెడ్డి చెప్పారు. విద్యార్థులకు పూర్తి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించటమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు చెప్పారు.
తమ విద్యా సంస్థ ప్రాంగణంలో అరుదైన వృక్షాలు , మొక్కల జాతులు ఎన్నో ఉన్నాయని అన్నారు. స్వచ్ఛత , పరిశుభ్రత కు సంబందించి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక అవార్డులను పొందినట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ నాణ్యతా ప్రమాణాల డీన్ డాక్టర్ కే.రామకృష్ణ , ప్రణాళిక అభివృద్ధి విభాగం డీన్ డాక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.