37.2 C
Hyderabad
March 29, 2024 18: 30 PM
Slider ముఖ్యంశాలు

కోవిడ్ కట్టడికి ఎంపీ మిథున్ రెడ్డి రూ.2 కోట్లు విరాళం

#KadapaMP

కడప జిల్లాలో  వేగవంతంగా వ్యాప్తి చెందుతున్న రెండవ దశ కోవిడ్ 19 వైరస్ ను అరికట్టేందుకు..  పటిష్టమైన నియంత్రణ  నివారణ చర్యలను యుద్ధప్రాతిపదికన అమలు చేస్తున్నామని కడప జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ పేర్కొన్నారు.

కడప జిల్లా రాజంపేట మున్సిపల్ కార్యాలయపు సమావేశమందిరంలో  శనివారం  రాజంపేట పార్లమెంటరీ నియోజక వర్గ పరిధిలోని రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాలకు సంబంధించి.. కోవిడ్-19 నివారణకు తీసుకోవలసిన చర్యలపై  సమీక్షా సమావేశం జరిగింది.

జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి.. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీనివాసులు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి,ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి,   అకేపాటి అమర్ నాథ్ రెడ్డి, ఎస్పీ కేకేఎన్ అన్బు రాజన్, జేసిలు ఎం.గౌతమి (రెవెన్యూ), సీఎం సాయికాంత్ వర్మ (అభివృద్ధి) పి.ధర్మచంద్రారెడ్డి (సంక్షేమం), రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్, ట్రైనీ కలెక్టర్ కె.కార్తీక్, ఏపీఎండిసి ఎండి వెంకట రెడ్డి, డిఎంహెచ్ఓ డా.అనిల్ కుమార్, సంబందిత కోవిడ్ నోడల్ అధికారులు, వైద్యాధికారులు, తదితరులు హాజరయ్యారు.

ఈ సమీక్ష సమావేశంలో ముందుగా.. రాజంలేట, రైల్వే కోడూరు, రాయచోటి నియోజకవర్గాల్లో.. రెండవ దశ  కోవిడ్-19 కట్టడి, కరోనా వైరస్ నివారణ, నియంత్రణకు తీసుకున్న చర్యలపై జేసీ సాయికాంత్ వర్మ.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు.

జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ మాట్లాడుతూ జిల్లాలో  గతనెల ఏప్రిల్ 1 నుండి మే 7వ తేదీ నాటికి  చూస్తే పాజిటివిటీ రేటు 10.4 % ఉందని, 32 మంది మృతి చెందారని జిల్లా కలెక్టర్ హరికిరణ్ వివరించారు.

అలాగే.. రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాల పరిధిలో.. గత ఏప్రిల్ 1 నుండి మే 7వ తేదీ నాటికి  పాజిటివిటీ రేటు 8.7 % ఉందని, నలుగురు మాత్రమే మృతి చెందారని వివరించారు.

ప్రస్తుతం జిల్లాలో.. రాయచోటి, రాజంపేట పట్టణాలతోపాటు.. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేలు, జమ్మలమడుగు పట్టణాలలో ట్రూ నాట్ టెస్టింగ్ ల్యాబులను ఏర్పాటు చేసి..  త్వరితగతిన ఫలితాలను అందించి.. పాజిటీవ్ వ్యక్తులకు వైద్య సదుపాయం కల్పించడం జరుగుతోందన్నారు. రైల్వేకోడూరులో కూడా.. ట్రూ నాట్ ల్యాబ్  ను త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.

కరోనా సెంటర్లలో మౌలిక సదుపాయాలు

జిల్లాలో మొత్తం 6 కోవిడ్ కేర్ సెంటర్లలో కడప హజ్ భవన్ లో 350 బెడ్లు, రాయచోటి ప్రభుత్వ మైనార్టీ పొలిటెక్నీక్ కాలేజీ లో 150, పులివెందుల జేఎన్టీయూ 210, ప్రొద్దుటూరు వెటర్నరీ కాలేజ్ లో 630, శ్రీ చైతన్య స్కూల్, కడప లో 500, హార్టికల్చర్ కాలేజి- అంతరాజుపేటలో 100..  మొత్తం 1940 కి పైగా.. బెడ్లు అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాటు చేశామన్నారు.  ఈ సెంటర్లలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. ఎవరికీ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చేస్తున్నామన్నారు.

జిల్లాలో నాలుగు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ వైద్య సేవలు అందించడం జరుగుతోందన్నారు. కడపలో ఫీమ్స్- 450 బెడ్స్, జిజిహెచ్ – 430 ,  ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో  120 బెడ్స్, పులివెందుల ఏరియా ఆసుపత్రిలో 60 బెడ్స్ తో కలిపి మొత్తం 1060 బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.

అంతే కాకుండా జిల్లాలో మొత్తం ఎంపిక చేసిన 19 ప్రైవేటు ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ కార్డుదారులకు కోవిడ్ సేవల నిమిత్తం ఉపయోగించడం జరుగుతోందన్నారు. ఈ 19 ఆసుపత్రుల్లో 411 బెడ్లకు గాను 83 ఐసీయూ బెడ్లు ఉన్నాయన్నారు. నాన్ ఐసీయూ- ఆక్సిజన్ బెడ్లు 249,  నాన్ ఆక్సిజన్ బెడ్స్ 79 అందుబాటులో ఉన్నాయన్నారు.

రేమిడిసివియర్ డ్రగ్ కూడా.. అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచడం జగిందన్నారు. ప్రభుత్వం నుండి.. ఆసుపత్రుల్లో పేషంట్ సంఖ్యను చూసుకుని ప్రభుత్వం ద్వారా సప్లై చేయడం జరుగుతోందన్నారు. అలాగే.. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా.. డ్రగ్ అధికారి నుండి పేషంట్ల సంఖ్య ఆధారంగా… ప్రభుత్వమే కొనుగోలు చేసి సరఫరా చేస్తోందన్నారు.

104 కాల్ సెంటర్ సేవల విషయానికి వస్తే.. కోవిడ్ టెస్టింగ్ కంప్లైంట్స్, టెస్ట్ రిజల్ట్స్ కోసం, వాహనం కోసం, బెడ్స్ వివరాల కోసం, ఇతర ఆరోగ్య సంబందిత అన్ని సేవలను 104 కాల్ సెంటర్ ద్వారా.. స్వీకరించడం జరుగుతోందన్నారు. అంతేకాక జిల్లా స్థాయిలో హెల్ప్ల్ లైన్ ను ఇప్పటికే ఏర్పాటుచేసామన్నారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా ఏర్పాటుచేసామన్నారు.

ప్రస్తుతం  కోవిడ్ పాజిటీవ్  పేషంట్ల అవసరాన్ని బట్టి.. దాదాపు 29 కిలో లీటర్ల ఆక్సిజన్  అవసరం అవుతోందన్నారు. అయితే… ఉన్న పేషంట్లు అందరికి.. నిరంతరాయంగా ఆక్సిజన్ ఉపయోగించే అవసరం వస్తే.. 8.5 కిలో లీటర్లు అదనంగా ఆక్సిజన్ సరఫరా అవసరం అవుతుందన్నారు.

వ్యాక్సినేషన్ విషయంలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. అదే స్ఫూర్తితో.. జిల్లాలో కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ పై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. జిల్లాలో 45 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సినేషన్ టార్గెట్.. 13,307,889 మంది కాగా.. 3,861,373 మందికి మొదటి డోస్, 786,735 మందికి రెండవ డోసు వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు.

కోవిడ్ నిర్ధారణ కాగానే వైద్య సాయం అందాలి

రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ… కోవిడ్ నియంత్రణ పై జిల్లా యంత్రంగం  పటిష్ట చర్యలను తీసుకుందన్నారు. .గత ఏడాది కోవిడ్ కేర్ సెంటర్లను సమర్థవంతంగా నిర్వహించడం వల్ల చాలామంది ప్రాణాలను కాపాడటంలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని యంత్రాంగం సఫలీకృతులయ్యారన్నారు. గత ఏడాదిలాగే..  ఈ సారి కూడా జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్లను అధికంగా ఏర్పాటు చేసి.. వైరస్ తీవ్రతను తగ్గించాలని కోరారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను పెంచి.. ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్నారు. పార్లమెంటు పరిథి లోని మూడు నియోజకవర్గాల్లో.. త్వరితగతిన టెస్టులు నిర్వహించడం, కోవిడ్ నిర్ధారణ చేయడం వెంటనే.. వైద్యం అందేలా చూడాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్ల ద్వారా.. కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంతో పాటు.. వ్యాధి తీవ్రతను కూడా తగ్గించడం సులువు అవుతుందన్నారు. ప్రజల్లో భయాన్ని పోగొట్టి అవగాహన పెంచాలన్నారు. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో.. ఆక్సిజన్ బెడ్లతో కోవిడ్ వైద్య సదుపాయం కల్పించాలన్నారు.

ప్రభుత్వ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, చీఫ్ విప్ కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ..  ఆక్సిజన్ వాడకంపై జిల్లాలోని కోవిడ్ ఆస్పత్రులపై  అధిక వత్తిడి పెరుగుతోందని.. అక్కడ సరైన మేనేజ్మెంట్ చేసేలా తగిన పర్యవేక్షణ చేయాలని.. ఎంపీ మిథున్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాలోని పారిశ్రామిక వేత్తలు కొంత ముందడుగు వేసి.. ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటుకు ముందుకు రావాలని సభాముఖంగా తెలిపారు. ఉపాధి హామీ పనుల నిర్వహణ సమయంలో.. కోవిడ్ ప్రికాషన్స్ విధిగా పాటించేలా డ్వామా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఆక్సిజన్ బెడ్స్ ఆవశ్యకత జిల్లాలో ఎంతో ఉందన్నారు. సాధారణ ప్రజలతో పాటు.. జిల్లాలో ఉపాధ్యాయులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రాష్ట్ర కోవిడ్ హెల్ప్ లైన్ మాదిరిగా.. జిల్లా కేంద్రంలోని కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్ ను అధికంగా.. పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని కోవిడ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది సేవలు..  మరింత సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణాల్లో శానిటేషన్ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలి

రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ.. నియోజక వర్గ కేంద్రంలో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను కోరారు.  రాజంపేట పట్టణంలో ఆక్సిజన్ లైన్డ్ బెడ్లను ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలకు కోవిడ్ వైద్యం అందేలా చూడాలని కోరారు. స్థానిక వనరులు, పారిశ్రామిక, వ్యాపారవేతల సమన్వయంతో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. తన నియోజకవర్గ ప్రజల కోసం.. తనవంతు సాయంగా కోవిడ్ నియంత్రణ చర్యలు కోసం రూ.50 లక్షలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా ఇప్పటికె .. తన సొంత కళ్యాణమండపాన్ని ఆక్సిజన్ లైన్డ్ బెడ్లతో కూడిన  కోవిడ్ కేర్ సెంటర్ గా మార్పు చేయడం జరిగిందని, త్వరలో దీనిని ప్రారంభిస్తామన్నారు.  కోవిడ్ కట్టడికోసం జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యల కోసం.. రాజంపేట నియజక వర్గ ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారం ఎల్లవేళలా వుంటుందన్నారు.

అకేపాటి అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా.. క్వారంటాయిన్ సెంటర్లు, కోవిడ్ ఆపత్రులు, ట్రూ నాట్ టెస్టింగ్ ల్యాబ్ లు, మొదలైన ముందస్తు చర్యలతో మొదటి దశ కోవిడ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామన్నారు.  రెండవ దశ కోవిడ్  వ్యాప్తి విస్తృతంగా ఉన్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు… జిల్లాలో కలెక్టర్ సి.హరికిరణ్  నేతృత్వంలో నియంత్రణ చర్యలను సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ.. కూడా ప్రజల్లో మరింత ధైర్యాన్ని నింపుతోందన్నారు. అయితే ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తూ.. కోవిడ్ వైరస్ ను అరికట్టేందుకు.. ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సహకరించి ప్రతి ఒక్కరూ.. కోవిడ్ ఫైటర్స్ గా తమ వంతు బాధ్యతను స్వీకరించాలన్నారు.

సరిపడా ఆక్సిజన్ బెడ్స్ ను ఇక్కడే ఏర్పాటు

సమావేశంలో సమీక్షించిన అంశాలపై.. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రాజంపేట నియోజకవర్గం  కేంద్రంలో కోవిడ్ వైద్యం అందించేందుకు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గ ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా  సరిపడా ఆక్సిజన్ బెడ్స్ ను ఇక్కడే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  ఫాతిమా ఆసుపత్రిలో 450 బెడ్ల సామర్థ్యం ఉందని, అందులో   ఆక్సిజన్ ట్యాంకును ఏర్పాటు చేయడం పూర్తవుతోందన్నారు. ఈ ట్యాంకు నిర్వహణలోకి రావడం వలన.. ఖాళీ సిలిండర్లు సులువుగా అందుబాటులోకి రావడం జరుగుతుందని.. దీంతో ప్రైవేటు హాస్పిటళ్లకు ఆక్సిజన్ కొరత లేకుండా అందుతుందన్నారు. ప్రజల్లో కోవిడ్ నియంత్రణ కై విస్తృత అవగాహన పెంచేందుకు స్టిక్కర్లను ప్రింట్ చేయించి.. వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి అంటించి..పూర్తి స్థాయిలో అవగాహన పెంచుతామన్నారు. 

ప్రతి నియోజకవర్గం పరిధిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలలో బెడ్లకు పర్మినెంట్ గా ఆక్సిజన్ లైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో అన్ని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా ఉన్న ఖాళీ సిలిండర్లను అవసరమైన అందరికీ.. ఉపయోగించేలా తక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు.

కోవిడ్ నియంత్రణలో భాగంగా.. పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలను చేపడుతోందన్నారు. ముఖ్యంగా ప్రజలు స్వీయ జాగ్రత్తలు లాటించేలా పోలీసులు పర్యవేక్షిస్తున్నారన్నారు. రోడ్లపై తిరిగే వారు ఖచ్చితంగా ఫేస్ మాస్కులు ధరించడం,  భౌతిక దూరం పాటించడం లాంటి.. చర్యలను తీసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే.. వ్యాపారాల నిర్వహణకు అనుమతివ్వడం జరిగిందన్నారు. పాక్షిక కర్ఫ్యూ విధించి ఆంక్షలు కఠినంగా అమలు చేయడం జరుగుతోందన్నారు. జన సమూహాలు లేకుండా  పోలీసులుచర్యలు చేపడుతున్నారన్నారు.

కోవిడ్ కట్టడి కోసం ఎంపీ, ఎమ్మెల్యేల విరాళం

తన సొంత నిధుల నుండి ఎంపీ మిథున్ రెడ్డి .. తన పార్లమెంటరీ పరిధిలోని మూడు నియోజక వర్గాల ప్రజల కోసం..  సి ఎస్ ఆర్ నిధుల కింద రూ. 2 కోట్ల విరాళాన్ని ఇవ్వడం గర్వించదగ్గ విషయం అని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ప్రశంసించారు.  అవసరమైతే మరొక కోటి రూపాయల విరాళాన్ని  ఇస్తామని ఎంపీ మిథున్ రెడ్డి   చెప్పారన్నారు. అంతేకాకుండా.. ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తన సొంత నిధుల నుండి.. రూ. 50 లక్షలు జిల్లా కోవిడ్ కేర్ ఫండ్ కోసం విరాళం ఇచ్చినందులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. అలాగే.. ఎమ్మెల్యే తన కన్వెన్షన్ హాలులో.. 45 ఆక్సిజన్ బెడ్లతో  కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి.. కోవిడ్ నియంత్రణలో తన వంతు భాగస్వాములు కావడం గర్వించదగ్గ విషయం అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కోవిడ్ నోడల్ అధికారులు డ్వామా పిడి యదుభూషన్ రెడ్డి, డి ఎం & హెచ్ ఓ  డా.అనిల్ కుమార్, రిమ్స్ సూపర్ ఇన్ టెన్ డెంట్ డా. ప్రసాద్ రావు,  సెరికల్చర్ ఎడి రాజశేఖర్, డా. నాగరాజు, ఆరోగ్యశ్రీ జిల్లా కో.ఆర్డినేటర్ డా. రఘు, రాజంపేట మున్సిపల్ కమీషనర్ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

పోతిరెడ్డిపాడుపై ఏపి వివరణ కోరిన కృష్ణాబోర్డు

Satyam NEWS

కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం

Satyam NEWS

సమస్యను పెద్దది చేస్తున్న అధికార పార్టీ నాయకులు

Satyam NEWS

Leave a Comment