ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై కారు కూతలు కూస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎండి పోయి కనిపించే గోదావరి మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు 150 కి.మీ దూరం గోదావరి నది సజీవంగా కనిపిస్తోంది ఇంతకన్నా ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. పిచ్చి ముదిరిపోయి కొంతమంది కరెంట్ బిల్లుపై నానా కూతలు కూస్తున్నారని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా మేడిగడ్డ, సుందిళ్ల జలాశయాలతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టులను సీఎం పరిశీలించారు. ఆ తర్వాత ధర్మపురి చేరుకుని శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో పంప్‌హౌస్ ఒక్కో ప్రాజెక్టుతో సమానమని చెప్పారు. తెలంగాణ భవిష్యత్ కోసం నిర్మించిన తిరుగులేని కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపుగా పూర్తయిందని ఆయన వెల్లడించారు. 25 ఏళ్లైనా పూర్తి కానటువంటి ప్రాజెక్టు నాలుగేళ్ళలో పూర్తి చేసిన ఇంజినీర్లకు అభినందనలు అని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మనం అనుకున్నదానికంటే ఎక్కువగా లాభం చేకూరనుంది. కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నికరంగా లభించేవి 400 టీఎంసీలు. 40 లక్షల ఎకరాలకు ఈ నీరు నెలకు 60 టీఎంసీ చొప్పున 6 నెలల పాటు ఎత్తిపోస్తాం. మిగతా సమయంలో 40 టీఎంసీలు ఎత్తిపోస్తాం. పరిశ్రమలు, ఇతర అవసరాల కోసం, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఎల్లంపల్లి నుంచి తీసుకుంటాం. ప్రతి రోజు ఎల్లంపల్లి నుంచి 3 టీఎంసీలు, మిడ్ మానేరు నుంచి 2 టీఎంసీలు తీసుకుంటాం. ఎస్సారెస్పీలో ఇప్పుడు 9.6 టీఎంసీలు మాత్రమే నీరుంది. ఎస్సారెస్పీలో నీరు లేనప్పుడు ఎల్లంపల్లి నుంచి వరదకాలువ ద్వారా పంపింగ్ చేస్తాం. నిజాంసాగర్, సింగూరుకు కూడా అవసరమైన నీరు అందేలా చూస్తాం అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణకు గోదావరి నీరే గతి అనే విషయం అందరికి తెలుసునని, ఇప్పుడు 50-60 టీఎంసీల నీరు మేడి గడ్డ దగ్గర వృథా అవుతుంటే ఎస్సారెస్పీ దగ్గర గోదావరిలో నీరే లేదు అందుకే అక్కడ ప్రాజెక్టు కట్టాం అని ఆయన అన్నారు. వివిధ దశల్లో ఎత్తిపోస్తూ 350 మీటర్ల ఎత్తున ఉన్న మిడ్ మానేరుకు నీటిని తీసుకెళ్తాం. ఇక్కడి వరకు మొత్తం ప్రాజెక్టులో 60 శాతం సాఫల్యం వచ్చినట్లు. 400 టీఎంసీల కోసం కరెంట్ బిల్లు ఏడాదికి రూ.4992 కోట్లు ఖర్చవుతుంది. ఇది కూడా ప్రతిఏటా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ విషయాలు తెలియకుండా మాట్లాడటం సబబు కాదని ఆయన అన్నారు.
previous post
next post