32.2 C
Hyderabad
March 28, 2024 21: 49 PM
Slider సంపాదకీయం

కన్నా, కరోనా, లాక్ డౌన్: ఛీ ఛీ ఇదేం బీజేపీ?

kanna and others

ఆంధ్రప్రదేశ్ బిజెపిలో ఏం జరుగుతున్నది? ఆ పార్టీలో ఏం జరుగుతున్నదో ఆ పార్టీ వారిని అడగడం కన్నా వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డిని అడిగితే వివరంగా చెబుతారు. ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిని ఎప్పుడు మారుస్తారు? కొత్తగా ఎవరిని నియమిస్తారు? ఉన్న అధ్యక్షుడిని మార్చాలంటే ఏం చేయాలి?

కొత్తగా వచ్చే అధ్యక్షుడికి ఏం క్వాలిఫికేషన్లు ఉండాలి…. లాంటి అన్ని విషయాలపైనా విజయసాయి రెడ్డికి పూర్తి అవగాహన ఉంది. బిజెపి లో అంతర్గతంగా జరుగుతున్న అన్ని విషయాలనూ కొందరు పెద్దమనుషులు కచ్చితమైన ఆధారాలతో సహా విజయసాయి రెడ్డికి అందచేస్తున్నట్లు ఆ పార్టీపై నిజమైన అభిమానం ఉన్న వారు అనుమానిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి అమ్ముడు పోయాడని విజయసాయి రెడ్డి రెండు రోజులుగా దారుణమైన ఆరోపణలు చేస్తున్నవిషయం తెలిసిందే. దీనికి పార్టీ ఏ విధంగా స్పందించాలి?

జాతీయ స్థాయి నుంచి రాష్ట్రంలోని చిన్న కార్యకర్త వరకూ విజయ సాయి రెడ్డిపై విరుచుకుపడాలి. అయితే బిజెపిలో చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు చాలా చిన్న మనసుతో ఆలోచిస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ పదవీ కాలం ముగిసి పోయింది. ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది.

తెలంగాణ లో బిజెపి అధ్యక్షుడిని మార్చిన రోజే కన్నాను కూడా మర్చాల్సి ఉంది కానీ తుది నిర్ణయం తీసుకునే లోపు మధ్య ప్రదేశ్ బిజెపి కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావడంతో బిజెపి అగ్ర నాయకులు ఆ అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ను పక్కన పెట్టారు.

ఆంధ్రప్రదేశ్ తో బాటు ఛత్తీస్ గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, మణిపూర్ లకు బిజెపి కొత్త అధ్యక్షులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ మేరకు కసరత్తు అంతా పూర్తి అయింది కానీ ప్రకటన మిగిలి ఉంది. ఆ తర్వాత వెనువెంటనే కరోనా మహమ్మారి వచ్చేసింది.

దాంతో కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే ప్రక్రియ ఆగిపోయింది. కరోనా అంశం పూర్తి కాగానే ఆంధ్రప్రదేశ్ తో బాటు మిగిలిన ఐదు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు వచ్చేస్తారు. ఇవన్నీ విజయసాయి రెడ్డికి ఎప్పుడో తెలుసు.

బిజెపి ఆంధ్రప్రదేశ్ కొత్త అధ్యక్షుడుగా ఎవరు వస్తారో కూడా విజయ సాయి రెడ్డికి సమాచారం ఉంది. దాంతో విజయసాయి రెడ్డి కన్నా లక్ష్మీనారాయణపై దారుణమైన ఆరోపణలు చేశారు. ఎటూ మార్చాలనుకుంటున్న వ్యక్తికి పార్టీ బాసటగా నిలవదని విజయసాయి రెడ్డి వేసుకున్న అంచనాలు కరెక్టయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ బిజెపి పెద్ద నాయకులు ఎవరూ కూడా కన్నా కు మద్దతుగా నిలవలేదు. కనీసం మాట మాత్రంగానైనా ఖండించలేదు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉన్న ఎమ్మెల్సీలు మాధవ్, సోము వీర్రాజు లాంటి నాయకులు పెదవి కూడా కదపలేదు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలలో అనునిత్యం తలదూర్చే జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఎక్కడ ఉన్నారో ఏమైపోయారో తెలియదు.

జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఏం చేస్తున్నారో తెలియదు. ఈ పెద్ద తలకాయలు ఏవీ మాట్లాడలేదు. పురందేశ్వరి, సుజనా చౌదరి లాంటి వాళ్లు తమ పరిధి వరకూ చూసుకున్నారు తప్ప కన్నాకు అండగా రాలేదు. ఈ నాయకులు అందరూ కన్నా విషయంలో కరోనా లాక్ డౌన్ ను పూర్తిగా పాటిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో జనసేనతో కలిసి అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న కమలనాథులు ఇలాంటి శల్య సారధ్యంతో దాన్ని సాధించగలరా?  

Related posts

పేకాట శిబిరాలపై దాడి చేసిన గుడివాడ ఎస్ ఐ ఆత్మహత్య

Satyam NEWS

దిశ యాప్ డౌన్ లోడ్ పై విజయనగరం ఎస్పీ యాక్షన్ ప్లాన్…!

Satyam NEWS

కొల్లాపూర్ ప్రాంతంలో బోల్తాపడిన పెళ్లి వాహనం

Satyam NEWS

Leave a Comment