తిరుమల శ్రీవారి శేషాచలం కొండల నుంచి వర్షాకాలంలో జాలువారే వర్షపు నీటిని “బాలాజీ రిజర్వాయర్” లేక “శ్రీ కపిలేశ్వర రిజర్వాయర్” లను నిర్మించి వృధాగా సిమెంట్ కాంక్రీట్ కాలువల ద్వారా భూమిలో ఇంకకుండా స్వర్ణముఖిలో కలిసిపోతున్న వర్షపు నీటిని నిల్వ ఉంచితే తిరుపతిలో భూగర్భ జలాలు పెరుగుతాయి. తిరుపతిలోని టీటీడీ వసతి సముదాయాలకు కపిలతీర్థం, మాల్వాడిగుండం వర్షపు నీటిని “క్లోరినేషన్ తో రీసైకిలింగ్” చేసి వినియోగించుకునే అవకాశం ఉందని బిజెపి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
తెలుగుగంగ నీటి కోసం టీటీడీ వారు నగరపాలక సంస్థకు కడుతున్న శ్రీవారి సొమ్ము ఆదా అవుతుందన్నారు. తిరుపతి ఇరిగేషన్ శాఖలో “బాలాజీ రిజర్వాయర్” ప్రతిపాదనలు (ఎస్టిమేషన్) సిద్ధంగా ఉన్నాయని టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ చొరవ చూపితే తప్పక కార్యరూపం దాలుస్తుందన్నారు. టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావుకి, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి తిరుపతి నగర ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు.