23.7 C
Hyderabad
February 29, 2024 01: 09 AM
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

తెరపైకి వస్తున్న కాపు కొలీజియం?

vangaveeti ranga YO PROFILE 2

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కరివేపాకులా మిగిలిపోతున్న కాపు సామాజిక వర్గం తదుపరి కార్యాచరణపై దృష్టి సారిస్తున్నది. ఇప్పటికే పలుదఫాలుగా విశాఖపట్నం, విజయవాడ కేంద్రాలుగా కాపు నాయకులు సమావేశం అయ్యారు. కాపు సామాజిక వర్గాన్ని పట్టిపీడిస్తున్న బహునాయకత్వం నుంచి బయటపడితే తప్ప తమ సమస్యలకు పరిష్కారం లభించదని వారు గట్టిగా భావిస్తున్నారు. బహు నాయకత్వం వల్ల ఒకరు కాపులను బిసిల్లో చేర్చాలని డిమాండ్ చేస్తుంటే మరొకరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు.

బిసి కులాల సరసన తమను చేర్చడం ఏమిటని కాపు సామాజిక వర్గంలోని ఒక బలమైన నాయకత్వం భావిస్తున్నది. కాపుల్లోని పేదల్ని ఆదుకోవడానికి బిసిల్లో చేర్చడం మినహా వేరే గత్యంతరం లేదని మరొక వర్గం అనుకుంటున్నది. ఈ వైరుద్ధ్యం నేపథ్యంలో కాపు సామాజిక వర్గం రెండుగా విడిపోయి ఒకరు తెలుగుదేశం పార్టీతో మరొకరు వైసిపితో అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల కాపులకు మేలు జరగకపోగా కీడు జరుగుతున్నది. ఈ విషయం ఇప్పటికే రుజువు అయినా కూడా కాపు నాయకులు మీనమేషాలు లెక్కిస్తుండటంతో ఇంకా కాపు సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ లో బలపడటం లేదు.

జనాభా పరంగా అత్యధిక సంఖ్యలో ఉన్నా కూడా రాజకీయంగా కొన్ని ఎం ఎల్ ఏ పదవులకు, ఒకటో రెండో మంత్రి పదవులకు పరిమితం కావడం తప్ప వేరే ఏమీ జరగని పరిస్థితి నెలకొని ఉంది. మంత్రులు ఎంఎల్ఏలు అయిన వారు వ్యక్తిగతంగా లాభపడుతున్నారు తప్ప కాపు జాతికి ఏమాత్రం ప్రయోజనం చేకూరడం లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాపులు రాజకీయంగా బలపడాల్సిన అవసరం కనిపిస్తున్నదని ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు అనుకుంటున్నారు.

జన సేన పార్టీ కాపుల పక్షాన నిలిచినట్లు ఎక్కడా కనిపించక పోవడంపై కూడా కాపు సామాజిక వర్గంలోపెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఈ దశలోనే ఇప్పటి వరకూ మౌనంగా ఉన్ననాయకులును ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని కాపు నాయకులు భావిస్తున్నారు. జనసేన పార్టీని కూడా ప్రభావితం చేసే నాయకత్వం కాపుల్లో పెరగాలని వారు భావిస్తున్నారు. అందుకోసమే జనసేన పార్టీ లేదా మరే ఇతర పార్టీని అయినా సరే తమకు అనుకూలంగా మలచుకోవడానికి ఏం చేయాలనే అంశంపై వారు దృష్టి పెట్టారు.

కాపు కులస్తుల కోసం అంకిత భావంతో పని చేసే పెద్దలను, పదవులు ఆశించకుండా కేవలం కాపు జాతి కోసం పని చేసే వారిని ఎంపిక చేసి ఒక థింక్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని ప్రాధమికంగా ఒక నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. బిజెపికి ఆర్ఎస్ఎస్ ఉన్నట్లు ఈ అత్యున్నత కొలీజియం లేదా పోలిట్ బ్యూరో వ్యవహరించాలని కాపు కులస్తులు కోరుకుంటున్నారు. జనసేన పార్టీ కనుక కాపుల కోసం పూర్తి స్థాయిలో పని చేయాలని అంగీకరిస్తే ఆ పార్టీకి ఈ కొలీజియం లేదా పోలిట్ బ్యూరో సలహాలు ఇవ్వడం ద్వారా రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఇప్పటి వరకూ కమ్మ కులస్తుల డామినేషన్ ఉన్న తెలుగుదేశం పార్టీ, రెడ్డి కులస్తుల కబ్జాలో ఉన్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీల అండలో బతుకుతున్న కాపు నేతల్ని బయటకు తీసుకువచ్చి జన సేన ను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం పై కూడా కాపు సంఘాలలో విస్తృతంగా చర్చజరుగుతున్నది. ముందుగా జన సేనను పూర్తిగా కాపులకు అనుకూలంగా  మలచుకోవడం, తర్వాత కాపు నాయకులను ఆ దరికి చేర్చడం వెనువెంటనే రాజకీయంగా కమ్మ, రెడ్డి కులస్తుల మాదిరిగా బలోపేతం అయి రాజ్యాధికారం కైవసం చేసుకోవడం కోసం కాపు నేతలు ఆలోచనలలో మునిగి ఉన్నారు.  

కాపు, బలిజ, వంటరి, తెలగ కులాల వారు వేరువేరుగా కాకుండా సంఘటితంగా పోరాడాల్సిన అవసరాన్నిగుర్తు ఉంచుకుని ఈ కార్యాచరణ రూపొందించుకోవాలని కాపు నేతలు భావిస్తున్నారు. కాపు కులస్తులను బిసిల్లో చేర్చాలనే డిమాండ్ తో ముందుకు రావడం ఒక చారిత్రక తప్పిదంగా వారు భావిస్తున్నారు. తమను బిసిల్లో చేర్చాలనే డిమాండ్ తో ఇతర బిసి కులాలకు వారికి క్షేత్ర స్థాయిలో వైరం ఏర్పడింది.

ఇలా కాకుండా జనాభా సంఖ్యలో అత్యధికంగా ఉన్నందున రాజ్యాధికారమే కైవసం చేసుకునే దిశగా పావులు కదపాలని ఒక స్థిరమైన నిర్ణయానికి కాపు సామాజిక వర్గం వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇదే జరిగితే దాదాపు 40 నియోజకవర్గాలలో ఫలితాలలో తేడాలు ఉంటాయి. కమ్మ రెడ్డి కుల నేతల వల నుంచి కాపులు బయటపడటానికి ఇది ఆస్కారం కలిగిస్తుందని కాపు సంఘాలు తమ సమావేశాలలో చర్చిస్తున్నాయి.

Related posts

కత్తులతో భజరంగ్ దళ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..

Sub Editor

హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ఎడిషన్‌ జక్‌ జ్యువెల్స్‌ ఎక్స్‌పో

Satyam NEWS

తెలంగాణ లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ 119 సీట్లను గెలుస్తుంది

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!