కర్ణాటక శాసనసభ మాజీ స్పీకర్ రమేష్ కుమార్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా లభించనుందా? అవుననే సమాధానాలు ఎక్కువగా వినపడుతున్నాయి. స్పీకర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన కేపీసీసీ కార్యాలయానికి వెళ్లి కాంగ్రెస్ సభ్యత్వాన్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. తర్వాత పలు మార్లు బీజేపీని ఇరుకుపెట్టేలా రమేష్ కుమార్ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో… ఆయన అయితేనే బీజేపీ కి మాటకి మాట ఎదురు చెప్పగలరని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి మాజీ సీఎం సిద్ధరామయ్య ఒంటెద్దు పోకడలే కారణమని పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే అధిష్ఠానం పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. సిద్ధరామయ్య సకాలంలో జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్ది ఉంటే ఏకంగా 13మంది ఎమ్మెల్యేలు అసమ్మతిబాట పట్టి ఉండేవారు కాదని, ప్రభుత్వం కుప్పకూలే వాతావరణం నెలకొనేది కాదని ఈ ఎమ్మెల్యేలు వివరించినట్టు కథనం. ప్రతిపక్షనేతగా సిద్ధరామయ్యను నియమిస్తే మరింతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ఈ వర్గాలు పేర్కొంటున్నట్టు తెలిసింది. మొత్తానికి సిద్ధరామయ్యకు ప్రతిపక్షనేత పదవి దక్కకుండా చూసేందుకు కాంగ్రెస్‌లోని ఓ వర్గం ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితులన్నింటినీ బట్టి చూస్తే… ప్రతిపక్ష నేత పదవి హోదా రమేష్ కుమార్ కే దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే సిద్ధరామయ్యకు అత్యంత ఆప్తుడైన రమేశ్‌కుమార్ ఈ పదవిని స్వీకరిస్తారా..? లేదా..? అనేది కుతూహలంగా మారింది. ఇదిలా ఉండగా ప్రతిపక్షనేత పదవి కోసం మరో పక్క పార్టీ సీనియర్ నేతలు డీకె.శివకుమార్, జి.పరమేశ్వర్, హెచ్.కె.పాటిల్‌లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
previous post