28.6 C
Hyderabad
September 20, 2020 12: 44 PM
Slider సంపాదకీయం

కాపాడుతున్నది కరోనాను కరోనా రోగులను కాదు

#KaturiHospitals

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

కరోనా వ్యాధిని అరికట్టడం కోసం, కరోనా సోకిన వారిని కాపాడటం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నది- అనే స్థిరమైన అభిప్రాయం ఉన్నవారు దయచేసి ఈ వార్త చదవద్దు. ఎందుకంటే వాళ్లు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వస్తుంది.

కరోనా సోకకుండా చూడటం ఒక బాధ్యత అయితే కరోనా సోకిన వారిని సంరక్షించడం మరొక పెద్ద బాధ్యత. కరోనా రోగిని వివక్షతతో చూడవద్దని సెల్ ఫోన్ లో రింగ్ టోన్ పెడుతున్నారు కానీ కరోనా రోగులు దయనీయంగా ఏడుస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు. కరోనా రోగులను వివక్షతతో చూస్తున్నది సమాజం కాదు. ప్రభుత్వాలే.

రామారావు (పేరు మార్చాము) ఒక సీనియర్ జర్నలిస్టు. అమరావతిలోని సచివాలయానికి సంబంధించిన వార్తలు రాస్తుంటాడు. ప్రతి రోజూ మంత్రుల ప్రెస్ కాన్ఫరెన్సులు, వారు పంపే ప్రెస్ నోట్లు, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే ప్రధాన వార్తలు ఇలా అన్నీ వార్తలుగా మార్చి తమ పాఠకులకు అందచేసే గురుతర బాధ్యతను రామారావు నిర్వర్తిస్తుంటాడు.

ఒక రోజు అకస్మాత్తుగా టెంపరేచర్ వచ్చింది.

అతని కే కాదు అతని భార్యకు, కుమార్తెకు కూడా టెంపరేచర్ పెరగడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పరీక్ష రిపోర్టు వచ్చేలోపునే అందరికి జ్వరం తగ్గిపోయింది. మరెలాంటి రుగ్మతలు కూడా లేవు. ముగ్గురిలో భార్య, కుమార్తెకు నెగెటివ్  వచ్చింది. 

భార్య కుమార్తె ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకున్నారు. రామారావుకు బిపి, షుగర్ ఉండటం వల్ల క్వారంటైన్ సెంటర్ కు వెళితే సంరక్షణ బాగుంటుందని అనుకున్నాడు. గుంటూరు- చిలకలూరిపేట రోడ్డులోని కాటూరి మెడికల్ కాలేజీలో ఉన్న క్వారంటైన్ సెంటర్ కు వెళ్లి అక్కడ చేరాడు.

బెడ్ కంపు కొట్టింది. భరించాడు. శుభ్రం చేయించమని పదే పదే కోరగా 2 రోజులకు స్పందించారు. డాక్టర్లు ఎవరూ రావడం లేదు వారికి పని వత్తిడి అనుకున్నాడు. తాను చేరి 4 రోజులయినా జ్వరం చూడలేదని, బీపీ, షుగర్ రోజు చూడాల్సిందిగా కోరాడు.

అవసరమైతేనే చూస్తామనే సమాధానం వచ్చింది.

కేవలం ‘సీ’ విటమిన్ తాబ్లేట్లు రోజుకు2, ‘బీ’ కాంప్లెక్స్ టాబ్లేట్ తప్ప మరేమీ ఇవ్వడం లేదు. మిగిలినవన్నీ తానే తెచ్చుకోవాల్సి వచ్చింది. సర్దుకున్నాడు. ఉదయం నూనె తో కూడిన గారెలు 2, ఉప్మా, స్పాంజ్ దోసెలు, మధ్యాహ్నము, రాత్రి, కూర, పప్పు, సాంబారు, గుడ్డు, రైస్ తో భోజనం ఇచ్చారు.

 ఇదేమిటి అని అడిగాడు. అది అంతే అన్నారు. కరోనా వచ్చిన వారు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి కదా అని అడిగాడు. ఇక్కడ ఇచ్చేది ఇదే అన్నాడు. రాత్రికి భోజనం కూడా అలానే ఉంది. షుగర్ పేషంట్లకు రొట్టెలు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించాడు. ఇదేమన్నా నీ ఇల్లా ఇచ్చింది తినమన్నారు.

ఉదయం సాయంత్రం పానకం లాంటి  టీ ఇచ్చారు.

షుగర్ వ్యాధి ఉన్నందున చక్కెర లేని టీ కావాలంటే  ఇచ్చింది తాగమన్నారు. మందులు లేవు, భోజనం సరిగా లేదు, మాట్లాడే మనిషి లేడు, ఉన్న ఫోన్ కు సిగ్నల్స్ రావు, బయటకు వెళ్లి మాట్లాడాలంటే గేటుకు తాళాలు, బయట నుంచి తెప్పించుకుందామంటే నిర్జన ప్రదేశం……. ఎలా బతకాలి?

 కరోనాను ఎలా జయించాలి? ఆసుపత్రిలో ఆశించిన మేర వైద్యం అందడం లేదని, హోమ్ క్వారన్టైన్ లో ఉంటానని, ఇంటికి వెళతాను పంపించేయమని బతిమిలాడాడు. DMHO నుంచి లెటర్ తెచ్చుకోమన్నారు. తన మిత్రుల ద్వారా ఆసుపత్రి వర్గాలకు  లెటర్ పంపారు.

అయితే ఆసుపత్రి వర్గాలు తమకు ఎలాంటి లెటర్ రాలేదని చెప్పారు.

లెటర్ గురించి విచారించగా DMHO లెటర్ వచ్చిందని, కలెక్టర్ పంప వద్దన్నారని చెప్పారు. తనకున్న పరిచయం తో కలెక్టర్ కు ఫోన్ చేయగా తనకు తెలియదనే సమాధానం వచ్చింది. 

ఆసుపత్రిలో జరుగుతున్న విషయాలు కలెక్టర్ కు చెప్పినందుకు క్వారంటైన్ పెంచుతామని బెదిరించారు. బయటకు ఎలా వెళ్తావో చూస్తాం అనే విధంగా హెచ్చరించారు. ఈ వ్యాధికి ప్రధానంగా కావాల్సింది ఆత్మస్థైర్యం. వ్యాధి పీడితుల్లో ఆత్మ స్తయిర్యాన్ని నింపాల్సిన అధికారులే ఎక్స్ రే లో ఇంకా రోగ లక్షణాలు ఉన్నాయని చెబితే నిన్ను ఆ దేవుడు కూడా ఈ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేయరనే బెదిరింపు ధోరణి లో వ్యవహరించడంతో అప్పటి నుంచి క్షణమొక యుగంలా గడిచింది.

రాత్రి వేళల్లో నిద్ర పట్టడం లేదు.

తనకు జరిగిన విషయాలను,  జిల్లా కలెక్టర్ కు మెసేజ్ రూపంలో పంపాడు. కలెక్టర్ బాగా స్పందించారు. తక్షణమే అక్కడి అధికారులకు ఆదేశాలు వచ్చాయి. రామారావును జాగ్రత్తగా చూసుకోవాలని. అయితే…. ఆ క్షణం నుంచి ప్రత్యక్ష నరకం చూపించారు.

ఆసుపత్రిలో జరుగుతున్న నిర్వాకాన్ని కళ్ళప్పజెప్పి చూడడం తప్ప రామారావుది ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. చివరకు 11 రోజులు పూర్తి అయిన తర్వాతే డిశ్చార్చి చేశారు. కరోనా భయం పోయింది. ప్రభుత్వ ఆసుపత్రి భయం పట్టుకున్నది. రాత్రివేళల్లో కూడా ఉలిక్కిపడి లేస్తున్నాడు.

ఇంటివద్ద ఉండి కావాల్సిన ఆహారం తీసుకుంటూ మందులు వేసుకుంటూ ఇప్పుడు క్షేమంగా ఉన్నాడు. ఒక జర్నలిస్టు అనుభవమే ఇలా ఉంటే ఇక మామూలు వారి పరిస్థితి ఏమిటి? రోజుకు ఒకరు మరణిస్తున్న ఆసుపత్రిలో శవాలతో జాగారం. సిబ్బంది ఉండరు. ఆహారం సరిగా లేదు.

అంతంత మాత్రంగా పారిశుద్ధ్యం, డాక్టర్లు రారు.

కారణాలు ఏవైనా సమస్యలు ఇవి. ఈ ఆసుపత్రిలో బాధితులు ఆశించినంతమేర వైద్యం అందక తాము ఇళ్ళకు వెళ్లిపోతాము… మమ్మల్ని ఈ నిర్బంధం నుంచి విడిపించండి మహా ప్రభో అంటూ మైకులో మొరపెట్టుకున్నా లాభం లేని పరిస్థితి.

సరైన వైద్యం అందలేదని రోగులు పారిపోతే పోలీసుల సహాయం తో పట్టుకువచ్చి ఆసుపత్రిలో పడేసిన ఘటనలు అనేకం. ఇలాంటి కరోనా సెంటర్లతో మనం కరోనాపై పోరాటం చేస్తున్నాం. కరోనా రోగులకు ఇచ్చే ఆహారానికి రాష్ట్ర ప్రభుత్వం రోజుకు 800 నుంచి 900 రూపాయల వరకూ ఇస్తున్నది.

రెండు పూటలా కోడిగుడ్డు, పాలు, డ్రైఫ్రూట్స్ ఇవ్వాలి. అన్నం కడుపునిండా పెట్టాలి. రోజుకు రెండు నుంచి నాలుగు లీటర్ల మినరల్ వాటర్ బాటిళ్లు ఇవ్వాలి. మందులు అవసరమైనన్ని ఇవ్వాలి. అయితే ఇవన్నీ ప్రయివేటు వ్యక్తులకు కాంట్రాక్టు ఇస్తున్నారు.

సహజంగానే స్థానిక ఎమ్మెల్యే మనుషులకే ఈ కాంట్రాక్టులు దక్కుతున్నాయి. కేవలం 50 రూపాయలు మాత్రమే రోగి ఆహారానికి ఖర్చు చేస్తున్నారు. దోపిడి…. అన్నింటిలోనూ దోపిడీనే…. ఈ వార్త చదివి ఆ జర్నలిస్టు ఎవరు అనే విచారణ మొదలు పెట్టకండి. క్వారంటైన్ సెంటర్లో సౌకర్యాలు పెంచండి. దోపిడి చేసే కాంట్రాక్టర్లను తీసేయండి. కరోనాను కాదు కాపాడాల్సింది. కరోనా రోగులను……

Related posts

శాల్యూట్: సేవకు సై అంటున్న సైబరాబాద్ పోలీసులు

Satyam NEWS

బ్రుటల్ : 24 ఏళ్ల దళిత యువకుడికి నిప్పెట్టారు

Satyam NEWS

కరీనా వారియర్ ప్రశంస పొందిన కువైట్ కడప వాసి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!