గతి తప్పిన జీవితాల్లో
మనసు వీణపై శృతి చేయలేని మధుర రాగాలు..
అతుకు పడని తెగిన తీగల అపశ్రుతులు
మనిషి మనిషికి మధ్య పెరిగిన
అంతస్తులు అహాల పూడ్చలేని అగాధాలు..
అర్థాలు మారిన లక్ష్మణ రేఖలు
కులమతాల కుత్సితాలతో
గీసుకున్న వృత్తాలు!
మానవత్వం మరిచి కట్టుకున్న
అదృశ్య కుడ్యాలు!
ఆత్మ విశ్వాసానికి అలుముకున్న
తెరిపి పడని నిశీధి నీడలు…
ఇల్లు అద్దైనా నోటికాడి ముద్దయినా
కులమతాల కార్చిచ్చులో సమిధవుతూ
అస్పృశ్యతను అందలమెక్కిస్తున్న రోజులు..
పలికేవి పలికించేవి
విశ్వ జీవన రాగాలు కావిప్పుడు
వికృత సంస్కార హీన పటాటోపాలు..
మానవీయత మంచితనాన్ని నిలువునా పాతరేస్తున్న దుశ్చర్యలు!
మంచి చెడులు రెండే కులాలు
మనిషే నా ఆదర్శం అన్న ఆనాటి మహా కవుల ఆత్మలు
ఘోషిస్తున్నాయి..
విశ్వ మానవ వీణ మీద
సమైక్య జీవన రాగాలు పలికేది ఇంకెన్నాళ్ళకని…
వురిమళ్ల సునంద, ఖమ్మం