యాదాద్రి ప్రాకారాలపై కేసీఆర్ బొమ్మలు ఎవరు చెక్కారు? ఎవరు చెక్కించారు? ఈ ప్రశ్నలు అర్ధం లేనివట. కేసీఆర్ ను దేవుడుగా భావించి ఆ శిల్పులే చెక్కారట. ఆహా ఎంత మంచి విషయం చెబుతున్నారు? యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులలో తొంగి చూసిన విచిత్రమైన విషయం ఇది. యాదాద్రి ఆలయ రాతి స్తంభాలపై ఏకంగా కేసీఆర్ చిత్రాలు చెక్కిన విషయం బయటకు రావడంతో ఒక్క సారిగా తెలంగాణ మొత్తం వేడెక్కింది. అంతే కాదు టీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తు కారు కూడా ఆలయ స్తంభాలపై చెక్కారు. అంతేనా తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నం, కేసీఆర్ కిట్, హరితహారం, రాష్ట్ర పక్షి, రాష్ట్ర జంతువు వంటి వాటిని కూడా యాదగిరి గుట్ట ఆలయ స్తంభాలపై చెక్కారు. ప్రభుత్వ ధనంతో నిర్మిస్తున్న ఆలయంపై కేసీఆర్ బొమ్మలు, కారుగుర్తు చెక్కడం ఏమిటి అనే అంశం వివాదం కావడంతో సంబంధిత అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. ఆ వివరణ ఏమిటంటే శిల్పులే స్వంతంగా చెక్కారట. కేసీఆర్ చెప్పలేదట. అంతే కాదు కేసీఆర్ ను రాజుగా భావించారట. పూర్వ కాలంలో రాజులు దేవాలయాలు పునరుద్ధరించినప్పుడు వారి బొమ్మలు పెట్టేవారని అందువల్ల ఇప్పుడు కేసీఆర్ ను రాజుగా భావించి ఆయన ప్రతిమను చెక్కారని చెబుతున్నారు. తిరుపతిలో కృష్ణదేవరాయలు ప్రతిమ ఉందట. అందుకు యాదాద్రిపై కేసీఆర్ బొమ్మ చెక్కారట. ఆలయన పునర్ నిర్మాణ బాధ్యతలు చూస్తున్న ఈ రిటైర్డ్ అధికారులు విస్తున్న వివరణ చూస్తుంటే మనం ప్రజాస్వామ్య యుగంలో ఉన్నామా లేక రాజుల కాలంలో ఉన్నామా అనే అనుమానం వస్తున్నది. కేసీఆర్ సొంత డబ్బుతో కట్టిస్తున్నట్లు ఈ గోలేంటని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ చెప్పి చేయించారా లేక శిల్పులే సొంతగా చెక్కారా లేక అధికారులు చెప్పి చెక్కించారా అనేది విషయం కాదు. ఈ చర్చ సమస్యను పక్కదోవ పట్టించడానికే ఉపయోగపడుతుంది. కచ్చితంగా కేసీఆర్ బొమ్మ చెక్కినవారిని చెక్కడానికి ప్రోత్సహించిన వారిని కఠినంగా శిక్షించాల్సి ఉంటుంది. లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజారస్వామ్యానికి అర్ధం ఉండదు. ఈలోపు కేసీఆర్ వర్గీయులు సోషల్ మీడియాలో పుంఖాను పుంఖాలుగా పోస్టులు పెడుతున్నారు. దేవాలయం గోడలపై కమలం గుర్తు కూడా ఉందట. కమలం గుర్తు వేరు పద్మం వేరు. ఆ విషయం కూడా ఆవేశంలో వారు తెలుసుకోలేకపోతున్నారు.
previous post