32.4 C
Hyderabad
March 8, 2021 18: 01 PM
Slider సంపాదకీయం

‘బండి’ భయంతో రెడ్డి ఓట్లకు గండి పెట్టుకున్న కేసీఆర్

#CMTelangana

ఒక వైపు ఉరుకుపరుగులమీదున్న బిజెపి… మరో వైపు షర్మిల కొత్త పార్టీ… ఇంకో వైపు పార్టీలో మితిమీరుతున్న వింత పోకడలు… వెరసి మేయర్ ఎన్నికలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తడబడ్డారు. తప్పటడుగు వేశారు. మేయర్ ఎంపికలో కేసీఆర్ అనుసరించిన వ్యూహం కొత్త ఓట్లను తెచ్చిపెట్టకపోగా ఉన్న ఓట్లను కోల్పోయేదిగా ఉన్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా బండి సంజయ్ పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన సామాజిక వర్గం అయిన మున్నూరు కాపులు బిజెపివైపు పయనిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ మున్నూరు కాపులను నిలబెట్టుకోలేని పరిస్థితిలోకి చేరిపోయింది. బిజెపి దూకుడుతో మున్నూరు కాపులతో బాటు పలు బిసి వర్గాలు కూడా బిజెపి వైపు ఆకర్షితులవుతున్నట్లు రిపోర్టులు ఉన్నాయి.

పకడ్బంది వ్యూహం లోపించిందా?

అదే సమయంలో రెడ్డి కులస్తుల ఓట్లు కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నుంచి చీలిపోతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన మేయర్ ఎన్నికలో కేసీఆర్ మరింత పకడ్బది వ్యూహం వేసి ఉండాల్సింది. అలా కాకుండా పాత తరం రాజకీయాన్నే ఆయన నమ్ముకోవడంతో టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకుకు పెను ప్రమాదం ముంచుకువచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

బండి సంజయ్ ను దీటుగా ఎదుర్కొనడానికి అదే సామాజిక వర్గానికి చెందిన గద్వాల్ విజయలక్ష్మిని ఆయన ఎంచుకున్నారు. అయితే తండ్రి చాటు బిడ్డగా ఉన్న గద్వాల్ విజయలక్ష్మి అంత ప్రభావం చూపే అవకాశం లేదు. అందువల్ల టీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశం ఏదీ కనిపించడం లేదు. అదే సమయంలో రెడ్డి సామాజిక వర్గాన్ని కేసీఆర్ మరింత దూరం చేసుకున్నారని అనిపిస్తున్నది.

రెడ్డి సామాజిక వర్గానికి తీవ్ర నిరాశ

చాలా కాలంగా రెడ్డి సామాజిక వర్గానికి హైదరాబాద్ మేయర్ పదవి దక్కుతూ ఉండేది. తెలుగుదేశం హయాంలో తీగల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ హయాంలో బండా కార్తీకరెడ్డి లు మేయర్ లుగా పని చేశారు. అలాంటిది ఈ సారి ఖైరతాబాద్ కార్పొరేటర్  విజయారెడ్డి కి అవకాశం దక్కుతుందని అందరూ అనుకున్నారు.

విజయారెడ్డికి మేయర్ పదవి ఇచ్చి ఉంటే షర్మిల పెట్టబోయే కొత్త పార్టీ కి వెళ్లేందుకు రెడ్డి సామాజిక వర్గం ఒక్క నిమిషం పాటు ఆలోచించి ఉండేది. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం టీఆర్ఎస్ కు పూర్తి వ్యతిరేకంగా మారిపోయింది. డిప్యూటీ మేయర్ పదవిని రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం అంటే అది అవమానంగానే వారు భావిస్తున్నారు.

విశ్వాసపాత్రుడికి కూడా పదవి దక్కలేదు

కనీసం ఒక ముస్లింను మేయర్ గా ఎంపిక చేసి ఉంటే కేసీఆర్ కొత్త రాజకీయానికి తెరలేపినట్లు అయి ఉండేది. ఇంత కాలం డిప్యూటీ మేయర్ గా పని చేసిన బాబా ఫసియుద్దీన్ కు ప్రమోషన్ ఇచ్చి ఉన్నట్లయితే ముస్లింలు టీఆర్ఎస్ వైపు పూర్తిగా మొగ్గు చూపి ఉండేవారు.

ఇవన్నీ కాదని పాత తరం రాజకీయ నాయకుడిలా కేసీఆర్ ఆలోచించడమే అందరిని ఆశ్చర్య పరిచింది. సీల్డ్ కవర్ సంస్కృతి అనేది కాంగ్రెస్ మార్కు రాజకీయం. అసమ్మతి తలెత్తకుండా, అధిష్టానం మాట నెగ్గించుకునేందుకు పెట్టిన కార్యక్రమం అది. అలాంటి సంస్కృతిని కేసీఆర్ లాంటి బలమైన నాయకుడు అనుసరించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఇది బలం కాదు బలహీనత అనిపిస్తున్నది.

తన మాటను ఎవరూ వ్యతిరేకించే అవకాశం లేదు అనుకున్న సమయంలో బహిరంగంగానే అభ్యర్ధిని ప్రకటించి ఉండేవారు. అలా కాకుండా సీల్డ్ కవర్ పంపడమే బలహీనతను సూచిస్తున్నది.

Related posts

ప్రభుత్వ ఆసుపత్రులపై అపోహలతో ప్రయివేటుకు వెళ్లవద్దు

Satyam NEWS

సోలిపేట మరణం తెలంగాణకు తీరని లోటు

Satyam NEWS

హరితహారంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీధర్

Satyam NEWS

Leave a Comment