ఖో ఖో ప్రపంచ కప్ తొలి ఎడిషన్‌లో ఆతిథ్య భారత మహిళల జట్టు అఖండ విజయంతో శుభారంభం చేసింది. మంగళవారం రాత్రి ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన తమ ఆరంభ మ్యాచ్‌లో సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ భారత మహిళల ఖో ఖో జట్టు 175-18 తేడాతో దక్షిణ కొరియాపై అత్యంత ఘన విజయం సాధించింది. భారత మహిళలు ఇంత భారీ తేడాతో విజయం అందుకోవడం టోర్నమెంట్ ఆరంభంలోనే సంచలనం సృష్టించింది. నీలి రంగు జెర్సీలోని ఆతిథ్య మహిళలు అసాధారణమైన డ్రీమ్ రన్స్ , అద్భుతమైన డిఫెన్స్ వ్యూహాలతో ప్రత్యర్థులకు సవాల్ విసురుతూ తమ పరాక్రమాన్ని ప్రదర్శించారు.
చైత్ర బి, మీరు, కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే వరుస డ్రీమ్ రన్స్‌తో ఆతిథ్య జట్టు ఘన విజయానికి బాటలు వేశారు. మొదటి రెండు బ్యాచ్‌లు ఒక్కొ పాయింట్‌ను సాధించాయి. ఈ వ్యూహాత్మక ఓపెనింగ్ దక్షిణ కొరియా తమ మొదటి టర్న్ చివరిలో సాధించిన 10 టచ్ పాయింట్లను సమం చేసి ముందుకెళ్లడంలో ఆతిథ్య జట్టుకు సాయం చేసింది.
అదే ఊపును కొనసాగించిన భారత అమ్మాయిలు ఆ తర్వాత పూర్తిగా ఎదురుదాడికి దిగారు. నస్రీన్ షేక్, ప్రియాంక ఇంగ్లే ,రేష్మా రాథోడ్‌తో కూడిన త్రయం కేవలం తొంభై సెకన్లలో ప్రత్యర్థి జట్టు డిఫెండర్లపై మూడు ఆలౌట్ విజయాలను సాధించింది. దాంతో భారత్ స్కోరు 24కి పెరిగింది. ఆపై 18 సెకన్ల దక్షిణ కొరియాను నాలుగోసారి ఆలౌట్ చేసి తమ మొత్తం ఆధిక్యాన్ని 22 పాయింట్లకు పెంచారు.
రేష్మా రాథోడ్ ఆరు టచ్ పాయింట్లతో ఆకట్టుకుంది. మీను డైవ్స్ ద్వారా 12 పాయింట్లతో అద్భుతమైన ప్రదర్శన కనబరిచించి జట్టు స్కోరును గణనీయంగా పెంచింది. రెండో టర్న్ ముగిసే సమయానికి భారత్ 16 బ్యాచ్‌లను తొలగించడంతో స్కోరు 94-10కి పెరిగింది.
మూడో టర్న్‌లోనూ భారత్ అదే తీవ్రతను కొనసాగించింది. ఆతిథ్య అమ్మాయిలు డ్రీమ్ రన్ ద్వారా మూడు పాయింట్లు అందుకున్నారు. భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించడంతో మూడో టర్న్ రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణ కొరియా కేవలం ఎనిమిది పాయింట్లను మాత్రమే అందుకోగలిగింది. చివరి టర్న్ మ్యాచ్‌లో భారత్ తన నియంత్రణను ప్రదర్శించింది. తమ ప్రత్యర్థులకు ఏ చిన్న అవకాశాన్ని కూడా ఇవ్వకుండా ఆతిథ్య అమ్మాయిలు జోరు కొనసాగించింది. దాంతో ఈ మ్యాచ్‌లో భారత్ 175 పాయింట్ల భారీ స్కోరు సాధించగా.. దక్షిణ కొరియా కేవలం18 పాయింట్లతో సరిపెట్టింది. ఇంత భారీ విజయంతో భారత్ తమ గ్రూప్‌లోని ఇతర జట్లకు హెచ్చరిక జారీ చేసింది.
మ్యాచ్ అవార్డులు
ఉత్తమ ఎటాకర్ : నిర్మలా భాటి (భారత్)
ఉత్తమ డిఫెండర్ : ఎస్తేర్ కిమ్ (దక్షిణ కొరియా)
ఉత్తమ ప్లేయర్: నస్రీన్ షేక్ (భారత్)