ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పి ఏడాది కూడా కాకముందే ప్రతిష్టాత్మక కియా మోటార్స్ సంస్థ తరలివెళ్లిపోతున్నది. ప్రపంచ ప్రఖ్యాత కియా మోటార్స్ తన ఫ్యాక్టరీని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ ప్రొడక్షన్ కూడా ప్రారంభమైంది.
అయితే కియామోటార్స్ అక్కడ నుంచి తరలి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మారిన పాలసీల దృష్ట్యా ఇక్కడ ఫ్యాక్టరీ ఉండటం శ్రేయస్కరం కాదని కంపెనీ యాజమాన్యం భావిస్తున్నది. తమిళనాడు ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తమిళనాడుకు ఫ్యాక్టరీని తరలించాలని కియా మోటార్స్ భావిస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని నిబంధన పెట్టడం వల్ల తమకు వీలుకాకుండా పోతున్నదని, స్థానికులకు ఉద్యోగాలు ఇస్తే ఉత్పత్తిలో తేడా వస్తుందని కియా మోటార్స్ భావిస్తున్నట్లు తెలిసింది. తమిళనాడు ప్రభుత్వం అన్ని రకాల రాయితీలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినందున అక్కడకు తరలి వెళ్లాలని కియా మోటార్స్ నిర్ణయించినట్లు తెలిసింది.
అయితే తాను కియా మోటార్స్ ప్రతినిధితో మాట్లాడానని అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని చెప్పారని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. కొద్ది రోజులు వేచి చూస్తే గానీ అసలు విషయం బయటపడదు.