ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫర్నీచర్ కొట్టేసి ఇంట్లో పెట్టుకుని దొరికి పోయిన విషయం తెలుసు కదా. ఆయన చూపించిన లీలల్లో మరొక ముఖ్యమైనది కూడా ఉంది. కొత్త ప్రభుత్వానికి సమాచారం లేదో, కొత్త ప్రభుత్వంలో పని చేసే అధికారులు నిమగ్నమై పని చేస్తున్నారో లేదో తెలియదు కానీ కోడెల అక్రమాలు ఇంకా ఈ కొత్త ప్రభుత్వంలో కొనసాగుతూనే ఉన్నాయి. కోడెల శివప్రసాదరావు కుమారుడి పేరుతో గుంటూరు లోని చుట్టుగుంట వద్ద ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించాడు. అందులో ఎలాంటి సౌకర్యాలు ఉండవు కానీ అద్దె మాత్రం భారంగా ఉంటుంది. చుట్టుగుంట లోని కోడెల హీరో షోరూం వద్దే వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ, ఆరోగ్య శ్రీ కాల్ సెంటర్, డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ తదితర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు కోడెల ఎంతో ‘ముందు’ జాగ్రత్తతో తన కాంప్లెక్స్ ను అద్దెకు ఇచ్చాడు. ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు అద్దెకు ఇవ్వడం తప్పా అని మీరు అడగవచ్చు. అస్సలు తప్పు కాదు. ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులకు, స్కూళ్లకు తమ భవనాలు అద్దెకు ఇవ్వడం తప్పు కాదు. అయితే కోడెల చేసింది ఏమిటో తెలుసా? విజయవాడ లాంటి ప్రాంతంలో చదరపు గజం అద్దె 19 రూపాయలు ఉన్నప్పుడు అధికారులపై వత్తిడి తీసుకువచ్చి ఎలాంటి సౌకర్యాలు లేని తన కాంప్లెక్స్ లో చదరపు గజం అద్దె 40 రూపాయలు తీసుకున్నాడు. ఇంత భారీగా అద్దె ఇచ్చేందుకు అధికారులు విముఖత చూపగా ఎంతో వత్తిడి తెచ్చి ఆయన తన పని చేసుకున్నాడు. ఈ కార్యాలయాలన్నీ వైద్య ఆరోగ్య శాఖ కు చెందినవే. 2017లో వైద్య ఆరోగ్య శాఖ కు కామినేని శ్రీనివాస్ మంత్రిగా ఉండేవారు. ఆయన బిజెపికి చెందిన వ్యక్తి. ఆయన అప్పటిలోనే ఇది అన్యాయమని భావించి అడ్డం తిరిగారు. అయితే అంతకన్నా పై స్థాయి నుంచి వత్తిడి తీసుకువచ్చి కోడెల ఎక్కువ అద్దెకు తన భవనాలను ప్రభుత్వ శాఖలకు అద్దెకు ఇచ్చేలా ప్లాన్ వేసుకుని పని పూర్తి కానిచ్చేశారు. ఏపి ఫార్మసీ కౌన్సిల్ కార్యాలయం కూడా ఇక్కడే ఉంటుంది. కొత్త ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతున్నా అధికారులు ఈ సమాచారం ప్రభుత్వ పెద్దలకు చెప్పినట్లు లేరు. ఆ కార్యాలయాలు ఇంకా అక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ ఖజానాకు బొక్క పడుతూనే ఉంది.
previous post
next post