ఐపీఎల్ 2021 సీజన్ రెండో దశ ప్రారంభమైన రోజే.. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కొహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా బెంగళూరు ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. ఇప్పటికే భారత టీ20 జట్టు కెప్టెన్‌గా వైదొలుగుతానని ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేసిన విరాట్ కొహ్లీ.. ఇప్పుడు మరో కీలక ప్రకటన చేశారు.
ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకోనున్నట్లు కోహ్లీ ప్రకటించారు. ఈ సీజన్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత బెంగళూరు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతానని వెల్లడించారు. ఐతే అదే జట్టులో ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. కొహ్లీ తీసుకున్న తాజా నిర్ణయం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
ఆర్సీబీ కెప్టెన్‌గా ఇదే నా చివరి ఐపీఎల్ సీజన్. ఐతే నా చివరి ఐపీఎల్ గేమ్ వరకు నేను ఆర్సీబీ ఆటగాడిగానే కొనసాగుతాను. ఇన్నాళ్లు నాపై విశ్వాసం ఉంచి, మద్దతుగా నిలిచిన ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ నా కృతజ్ఞతలు. అని విరాట్ కొహ్లీ ట్వీట్ చేశారు. ఆ వీడియోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
విరాట్ కొహ్లీ బెంగళూరు జట్టులో 2008 ఐపీఎల్ తొలి సీజన్ నుంచి అదే జట్టులో ఉన్నాడు. 2011లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. 9 ఏళ్లుగా కెప్టెన్‌గా ఉన్నా.. ఆర్సీబీ జట్టుకు ఒక్కసారి కూడా టైటిల్ కూడా అందించలేకపోయాడు. 2016లో కొహ్లీ కెప్టెన్సీలోనే ఫైనల్ వరకు వెళ్లింది ఆర్సీబీ టీమ్. కానీ ఫైనల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయి.. టైటిల్‌ను చేజార్చుకుంది.
ఆ సీజన్‌లో కెప్టెన్ విరాట్ కొహ్లీ బ్యాట్‌తో అదరగొట్టాడు. ఏకంగా నాలుగు సెంచరీలు చేసి 973 రన్స్ చేశాడు. ఒక సీజన్‌లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా ఇప్పటికీ ఆ రికార్డు కొహ్లీ పేరు మీదే ఉంది. ఇంకెవరూ ఒక సీజన్‌లో అన్ని పరుగులు చేయలేదు. ఇక ఈ సీజన్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఆర్సీబీ టీమ్ మంచి ఫామ్‌లో ఉంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన కొహ్లీ సేన ఐదు మ్యాచ్‌లు గెలిచి.. రెండింటిలో ఓడిపోయింది. 10 పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఈ సాల కప్ నమదే (ఈసారి కప్పు మనదే) నినాదంలో ప్రతి ఏటా బరిలోకి దిగి ఆర్సీబీ జట్టు.. ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే మాత్రం విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి ఘనమైన వీడ్కోలు పలికినట్లే. ఈ సీజన్ తర్వాత కెప్టెన్సీకి కొహ్లీకి గుడ్ బై చెప్పడంతో.. వచ్చే ఏడాది నుంచి ఆర్సీబీ జట్టుకు ఎవరు కెప్టెన్‌గా ఉంటారన్నది హాట్ టాపిక్‌గా మారింది.