తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు రెండు మూడు రోజుల్లో అన్ని ఉద్యోగ సంఘాలూ మద్దతు ఇవ్వబోతున్నాయని తెలంగాణ రాష్ట్ర సాధన లాంటి మరో ఉద్యమం ఆరంభం కాబోతున్నదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్లేని సుధాకర్ రావు అన్నారు. బుధవారం కొల్లాపూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి ఆయన విచ్చేసి పూర్తి మద్దతు పలికారు. ఆయనతో బాటు బీజేపీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సుబ్బా రెడ్డి తదితరులు ఉన్నారు. ముందుగా బీజేపీ పార్టీ కార్యాలయం నుండి నాయకులతో ర్యాలీగా బయలు దేరి వచ్చి నిరవధిక సమ్మెలో పాలుపంచుకున్నారు.
అనంతరం ఎల్లేని సుధాకర్ రావు మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిద్రపోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై కేంద్ర ప్రభుత్వం నిఘా వేసి ఉందని ఏ క్షణంలో నైనా జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మ బలిదానాల గురించి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఆరా తీస్తున్నారన్నారు. 27 మంది ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన మరువక ముందే ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఇది దారుణమైన ప్రభుత్వమని ఆయన అన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చే వరకు బిజెపి వారికి అండగా ఉంటుందని తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వబోతున్నారన్నారు. రాష్ట్రం అగ్నిగుండంలా మారబోతుందన్నారు. అంతకు ముందు జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి మాట్లాడారు. టిఆర్ఎస్ నాయకులు ఎన్నికల ముందు ప్రజల చుట్టూ తిరుగుతారు గెలిచినాక ప్రజల సమస్యలు మరచిపోతారన్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి ఇద్దరు తోడు దొంగలే అన్నారు. ఆర్టీసీ సమ్మె జరగబట్టి12 రోజులు అవుతుంది. ఎందుకు నాయకులు సమ్మెకు మద్దతివ్వడం లేదని ప్రశ్నించారు. అనంతరం చెవ్విలో పువ్వులతో అంబేద్కర్ చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ ముందు బైఠాయించారు. కెసిఆర్ డౌన్ డౌన్!వద్దురా కేసీఆర్ పాలన!అంటూ నినాదాలు చేశారు. సుమారు గంట సేపు నిరసన తెలిపారు. కార్యక్రమంలోకొల్లాపూర్ కొల్లాపూర్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ గౌడ్, ధనుంజయ గౌడ్, సందు రమేష్, సత్యనారాయణ గౌడు,జలాల్ శివుడు,సాయి ప్రకాష్ యాదవ్, రమేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.