రెండు వారాల క్రిందట హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్ లో కార్యాలయంలోనే తహసిల్దార్ విజయ రెడ్డి పై సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పు అంటించి హత్య చేసిన సంఘటన అందరికి తెలిసిందే. ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. రెవెన్యూ అధికారులు ఈ హత్య ను ఖండిస్తూ విధులను బహిష్కరించారు. ఆ సంఘటన తర్వాత కొందరు బాధితులు పెట్రోల్ బాటిల్ తీసుకుని తహసిల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న సంఘటనలు సోషల్ మీడియాలో పోస్టు అవుతున్నాయి. ఇలాంటి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెవెన్యూ సిబ్బంది అవినీతిపై కూడా విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ కార్యాలయాలకు భద్రత కల్పించాలని నిర్ణయించి పోలీస్ అధికారులను అప్రమత్తం చేసింది. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గురువారం కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి తహసిల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. తాహసిల్దార్ వీరభద్రప్పతో సమావేశమయ్యారు. కార్యాలయంలో జరుగుతున్న సంఘటనల గురించి తెలుసుకున్నారు. కార్యాలయానికి వచ్చి పోయే ప్రజలు నుండి ఎలాంటి సమస్యలు వాటిల్లినా తక్షణమే పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. అదేవిధంగా ప్రజల సమస్యపై రెవెన్యూ సిబ్బంది ఒకే విధంగా సమాధానం ఇవ్వాలన్నారు. అనుమాన వ్యక్తులు రెవెన్యూ సిబ్బంది దృష్టిలో ఉంటే సమాచారం ఇవ్వాలని సిఐ బి వెంకట్ రెడ్డి కోరారు. అదే విధంగా కొల్లాపూర్ సర్కిల్ పరిధిలోని అన్ని తహశీల్దార్ కార్యాలయలలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
previous post