అన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు పన్నులు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తిప్పర్తి లో నేడు ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మోసాలపై రాష్ట్రమంతా పర్యటిస్తానని, ప్రజలకు వివరించి చెబుతానని ఆయన అన్నారు.
ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో లక్షల కోట్లు సంపాదించిన కెసిఆర్ తెలంగాణ లో తనకు ఎదురులేదన్నట్లు వ్యవహరిస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రైతులకు సంవత్సరానికి 25000 చొప్పున రుణమాఫీకి ఇస్తే అది వడ్డీలకే సరిపోదని ఆయన అన్నారు.
ఎన్నికలలో మాయ మాటలు చెప్పిన కేసీఆర్ ఎన్నికల తర్వాత మాటమార్చారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీ లకు ట్రాక్టర్ల పంపిణి సొమ్మొకడిది సోకొకడిది అన్న చందంగా ఉందని అధికార పార్టీ వారు ట్రాక్టర్లను పంచుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఎస్ఎల్బీసీ బ్రాహ్మణ వెల్లంల సాగునీటి ప్రాజెక్టులు తక్షణమే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నల్గొండ ను దత్తత తీసుకుంటానని చెప్పిన కేసీఆర్ నల్గొండ ప్రాంత ప్రజలకు మోసం చేశారని అన్నారు. పదవుల కోసం పార్టీలు మారిన వాళ్లు అక్కడ కాళ్ళు మొక్కుతున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.