39.2 C
Hyderabad
April 25, 2024 17: 04 PM
Slider ఆధ్యాత్మికం ప్రత్యేకం

నేడు కొప్పరపు వేంకట సుబ్బరాయకవి జయంతి

kopparapu

అవధాన విద్యలో, ఆశుకవిత్వంలో అసమాన ప్రతిభతో అగ్రగణ్యులుగా  అఖండకీర్తితో వెలిగిన కవిద్వయం కొప్పరపు సోదరులు. ఈ కవి జంటలో అన్నింటా అగ్రజుడు వేంకట సుబ్బరాయకవి. కొండవీడు, పలనాడు గడ్డలో పుట్టిన ఈ కవియోధుడు సోదరుడు వేంకటరమణకవిని కలుపుకొని అనంత కవితా జైత్రయాత్ర చేశాడు. జగదాశ్చర్యకర రీతిలో, జగదానందకారకంగా ‘తెలుగు పద్యాన్ని’ ఊరూవాడా ఏనుగు అంబారీపై ఊరేగించాడు. పద్యప్రియులను ఉర్రూతలూగించాడు.

ఎనిమిదేళ్ల  వయస్సు నిండక ముందే ప్రారంభమైన ఈ కవితా రసోదరుని పద్య  ప్రవాహం  మూడు  దశాబ్దాలపైగా అప్రతిహతంగా సాగింది. పామరుఁడు నుండి మహాపండితుని వరకూ తలలూగించింది. ఆశుకవితా సామ్రాజ్యాన్ని శాసించింది. గుంటూరు జిల్లా నరసరావుపేటకు దగ్గరలో ఉన్న కొప్పరంలో ఈ మహాకవి ఉదయించాడు( 12 నవంబర్- 1885).నేడు 135వ జయంతి. తండ్రి వేంకటరాయలు వద్ద ప్రాధమిక విద్య, రామడుగు రామకృష్ణశాస్త్రి వద్ద సంస్కృత భాషా, శాస్త్రములు పఠించాడు.

సమీప గ్రామమైన ఏల్చూరులో మాతామహ వంశీకుడైన పోతరాజు రామకవి దగ్గర అవధాన కళానైపుణ్యాన్ని సముపార్జించాడు. నేటి కుర్తాళ పీఠాధిపతి సిద్ధేశ్వరానందభారతీ స్వామికి (పూర్వాశ్రమంలో డాక్టర్ ప్రసాదరాయ కులపతి) ముత్తాతగారే పోతరాజు రామకవి. వీరు అవధానం, తాళపత్రలేఖనం, సాముద్రికం శకునం, అగ్ని స్తంభనం, జలస్తంభనం, వాయుస్తంభనం,  సంగీతం, ఆగమం, లోహక్రియ, దారు క్రియ  మొదలైన 20 కళలలో నిష్ణాతులు. వీరి వద్ద వేంకట సుబ్బరాయకవి ఆశు కావ్య, అవధాన విద్యలో మెళుకువలు నేర్చుకొని, మొట్టమొదటగా ఆంజనేయస్వామిపై 27 పద్యాలతో “హనుమత్ కవచరూప నక్షత్ర మాల”  అల్లి, కవితాశ్రీకారం చుట్టాడు.

నరసరావుపేటలోని పాతూరు ఆంజనేయస్వామి దేవాలయంలో మొట్టమొదటి అష్టావధానం చేశాడు. 8 వ ఏటనే శతకములు అల్లడం ప్రారంభించిన ఈ మహాకవి 12ఏళ్ళు నిండక ముందే  అష్టావధానాలు, పదహారేళ్ళ ప్రాయంలోనే శతావధానాలు, ఇరవైఏళ్ళ వయస్సులోనే గడియకు (24 నిముషాలు)మూడు వందల పద్యాల వేగం తో ఆశువుగా కావ్యాలు చెప్పడం ఆరంభించి, అనంత యశస్సును ఆర్జించాడు. సుబ్బరాయకవి అయిదేళ్ల పిల్లవానిగా ఉన్నప్పుడు నాలుకపై దుర్గాదేవి బీజాక్షరాలు రాసిందనే ఐతిహ్యం ఆయా గ్రామవాసుల్లో, బంధువర్గంలో ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు.

ఉపాసన, యోగ మార్గాల్లో వీరి సాధన, జీవనం సాగింది. తొలిజాములోనే లేచి కర్రసాము, వ్యాయామం చేసి,  యోగాసనములు వేసేవారు. అనంతరం, సహస్ర గాయత్రి, సహస్ర పంచాక్షరీ  మంత్రములు జపించేవారు. దుర్గాదేవిని, ఆంజనేయస్వామిని నిరంతరం ఉపాసించేవారు. వీరి ఇంటి సింహద్వారం ప్రక్కన ఉన్న చలువరాతి వరండాలో కూర్చొని కవితా  వ్యాసంగం సాగించేవారు. దగ్గరిలో ఉన్న కోదండ రామాలయంలోనే ఎక్కువసేపు గడిపేవారు. సోదరులతో, ఇంటికి వచ్చిన పెద్దలతో,వచ్చిపోయే కవి పండితులతో పద్యములతోనే పలుకరించేవాడు, పద్యాలలోనే సంభాషించేవాడు… అందుకేనేమో వేటూరి ప్రభాకరశాస్త్రి గారు “పలికిన పలుకులన్నియును పద్యములయ్యెడు ఏమి చెప్పుదున్ ”  అన్నాడు వీరి గురించి. 

“అరిస్తే పద్యం – స్మరిస్తే పద్యం”  అని శ్రీ శ్రీ అన్న మాటలు కొప్పరపు కవులకు అక్షరాలా సరిపోతాయి.సుబ్బరాయకవి నిద్రపోతున్న సమయంలో, వారి శరీరం నుండి ఓంకార శబ్దం వినిపించేదని  నాటి పెద్దలు చెప్పేవారు.  యావత్తు తెలుగుప్రాంతాలతో పాటు  తమిళనాడు,మహారాష్ట్ర లోనూ వీరు  అవధానాలు, ఆశుకవితా విన్యాసాలు చేశారు.అవధాన ప్రదర్శన పలనాడులో   మొదలైనా?  వీరి తొట్టతొలి ఆశుకవిత్వ మహాసభ హైదరాబాద్ దగ్గరలో ఉన్న ‘ఆలవాల లష్కరు’ లోని ఆదిరాజు తిరుమలరావుగారి భవనంలో జరిగింది.

అక్కడ ముంగాలి బిరుదుతో ఘనసత్కారం పొందాడు.  రెండవ సభ కూడా తెలంగాణా ప్రాంతంలోనే జరగడం విశేషం. మణికొండ  భూపాలుడు తాటిరెడ్డి గోపాలరెడ్డి “బాలసరస్వతి”బిరుదుతో అత్యున్నతంగా సమ్మానించాడు. మూడవ సభ నెల్లూరులో జరిగింది. శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటు నిర్మాత, ఆంధ్ర సాహిత్య పరిషత్ స్థాపకుడు జయంతి రామయ్యపంతులు అధ్యక్షతలో సాగిన ఈ సభ పరమాద్భుతంగా సాగింది. పండిత, కవులందరూ కొప్పరపు సుబ్బరాయకవి ఆశుకవితా ప్రతిభకు నివ్వెర పోయారు.

ప్రశంసలతో ముంచెత్తారు. వీరంతా ఏకగ్రీవంగా “ఆశుకవి సింహ” అనే బిరుదు ప్రకటించి,  జయంతి రామయ్య పంతులు సమక్షంలో సమర్పించారు. మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి తండ్రి పట్టాభిరామిరెడ్డి బుచ్చిరెడ్డిపాలెంలో, మద్రాసులో వరుసగా అవధాన, ఆశుకవితా సభలు ఏర్పాటు చేశారు. మద్రాసులో మహామహుల సన్నిధిలో జరిగిన సభలు కొప్పరపు కవులకు మిన్నంటిన ఖ్యాతిని తీసుకువచ్చాయి. కావ్యకంఠ గణపతిముని, వావిలికొలను సుబ్బారావు, వేటూరి ప్రభాకరశాస్త్రి, చెన్నాప్రగడ భానుమూర్తి, తంజావూరు దేవపెరుమాళ్ళయ్య వంటి మహనీయులు కొప్పరపు కవులను వేనోట స్తుతించారు.  

విజ్ఞానచంద్రికామండలి స్థాపకుడు కొమర్రాజు లక్ష్మణరావు ప్రత్యేకంగా కొప్పరపువారి సభ ఏర్పాటుచేసి, “ఆశుకవి చక్రవర్తి” బిరుద బహుమానంతో బహుదా గౌరవించాడు.కొప్పరపు కవుల అసమాన కవితా ప్రతిభకు ముచ్చటచెంది, ఈ మహాకవి, పండితులు కురిపించిన పద్యములు అక్షరబద్ధమై ఇప్పటికీ  నిలిచిఉన్నాయి. విశదల,సంగంజాగర్లమూడి వంటి గ్రామాలు, పిఠాపురం, నూజివీడు,బొబ్బిలి,  చల్లపల్లి,వెంకటగిరి, వనపర్తి,  గద్వాల్ వంటి సంస్థానాలు, గుంటూరు, విజయవాడ, బందరు వంటి పట్టణాలు, హైదరాబాద్  మద్రాసు వంటి మహానగరాలు కొప్పరపు పద్యసరస్వతికి వేదికగా, ఆరతినిచ్చాయి.

ఒక పక్క అఖండమైన కీర్తి, ఐశ్వర్యాలు గడిస్తూ   -ఇంకొక పక్క తిరుపతి వేంకటకవులతో సాహితీ సమరములను ఎదుర్కొంటూ…   ఆశుకవితా సామ్రాజ్యంలో చక్రవర్తులుగా, అవధానకవి సింహాలుగా నిలిచారు. ఆశువు ఆగితే మా చెయ్యి నరకండి… అంటూ సవాలు విసిరి, పద్యాలు గుప్పించిన అంతటి పట్టుదల కలిగిన కవులు ఆధునికయుగం లో కొప్పరపు కవులు తప్ప ఇంకొకరు లేరు.పలనాటి పౌరుషాన్ని,కొండవీటి క్షాత్రాన్ని, ఆంధ్రుడి ఆత్మగౌరవాన్ని పద్యంలో చాటిచెప్పిన వీరకవులు వీరు. ఎవరు ఏమి చెప్పినా?  అది ‘తిరుపతి వేంకటీయమే’  అన్నట్లు,కొప్పరపు కవులు ఏమి చెప్పినా? ఏది పొందినా?  అది సోదరకవీయమే…. అనుజులను తుల్యులుగా చేసికొని సుకీర్తి సుకవితారాజ్యమేలిన సూరమౌళి సుబ్బరాయకవి.

కొన్ని వందల అవధాన, ఆశుకవిత్వ సభల్లో లక్షల కొద్దీ పద్యాలు చెప్పారు.తమ్మునితో కలిపి దైవసంకల్పం, కుశ -లవ (సాధ్వీ మాహాత్మ్యం), శ్రీకృష్ణకరుణా ప్రభావం వంటి కావ్యాలు, దీక్షితస్తోత్రం, నారాయణీ వంటి శతకములు రచించారు. సమకాలీన మహాకవి పండితులందరి ప్రశంసలకూ పాత్రులయ్యారు.గజారోహణ,గండపెండేర సత్కారములు,  బిరుదభూషణములు  అనేకంగా పొందారు.ఇంతటి ఘనుడు, ప్రతిభా ధనుడు,అవధానకళా ప్రపూర్ణుడు,పరిపూర్ణ కవితాజీవనుడు  అనారోగ్యంతో 42 ఏళ్లకే ఇంటికి పరిమితమై, 46 వ ఏటనే అసంపూర్ణంగా జీవితం ముగించి, అనంతకవితాలోకాల్లో ఐక్యమైపోయాడు..

“కవితపుట్టిల్లు సోదరకవుల ఇల్లు” అనే ఖ్యాతిని తెలుగుజాతికి అందించిన కొప్పరపు వేంకటసుబ్బరాయకవి తెలుగుప్రజల నాలుకలపై చిరంజీవిగా భాసిస్తాడు. త్వరలో కొప్పరపు సోదరకవుల    విగ్రహాలు వారి సీమ నరసరావుపేటలో ప్రతిష్ఠకు సిద్ధంగా ఉన్నాయి.

– మాశర్మ, జర్నలిస్ట్

Related posts

మరో మూడు రోజుల పాటు వానలే వానలు

Satyam NEWS

న్యాయ వాదుల సంక్షేమం కోసం హెల్త్ కార్డులు

Satyam NEWS

రెండు నెలల చిన్నారి అపహరణ

Satyam NEWS

Leave a Comment