39.2 C
Hyderabad
March 28, 2024 16: 45 PM
Slider శ్రీకాకుళం

కొవ్వాడ అణుపార్కును తక్షణమే ఉపసంహరించుకోవాలి

#Kovvada

వినాశకరమైన కొవ్వాడ అణుపార్కును రద్దు చేయాలని లేకుంటే ప్రజల మద్దతుతో పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు హెచ్చరించారు. గురువారం సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొవ్వాడ అణుపార్కు ఉత్తరాంధ్రకు మరణశాసనమని అన్నారు.

కొవ్వాడలో అణు విద్యుత్తు కేంద్రం ఏర్పాటుపై అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీతో ప్రస్తుతం సాంకేతిక వాణిజ్య చర్చలు జరుపుతున్నట్లు ప్రధాన మంత్రి కార్యా లయ మంత్రి జితేందర్ సింగ్ పేర్కొనడాన్ని ఖండించారు. వెస్టింగ్‌హౌస్ కంపెనీ అమెరికాలో దివాలా పిటిషన్ వేసిందని, దివాళా కంపెనీతో చర్చలు ఏమిటని ప్రశ్నించారు.

కొవ్వాడ భూకంపాల జోన్ లో ఉందని ఇక్కడ అణుపార్కు పెట్టడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. అణువిద్యుత్తు కేంద్రానికి చుట్టుపక్కల 30 కిలోమీటర్లు పరిధిలో జనసాంద్రత తక్కువ కలిగి ఉండాలని కానీ ఈ ప్రాంతం అధిక జనసాంద్రత కలదని శ్రీకాకుళం, విజయనగరం పట్టణాలు కూడా కొవ్వాడకు 30 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయని అన్నారు.

భూమి గాలి నీరు అన్నీ కలుషితం అవుతాయి

కొవ్వాడ అణుపార్కులో ప్రమాదం జరిగితే లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని ఇటు కాకినాడ నుండి ఒరిస్సా ఛత్రాపూర్ వరకు భూమి, నీరు, గాలి సమస్తం విషతుల్యం అవుతాయని అన్నారు. ప్రజలు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడతారని, పుట్టే పిల్లలు వికృత ఆకారాలతో పుడతారని తెలిపారు.

గుజరాత్ రాష్ట్రంలోని మితివిర్దిలో పెట్టాల్సిన అణుప్లాంట్ అక్కడ రైతులు,ప్రజలు వ్యతిరేకంగా చేసిన పోరాటాలు వలన కేంద్ర బిజెపి ప్రభుత్వం కొవ్వాడకు తరలించిందని విమర్శించారు. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాలు అణువిద్యుత్తు కేంద్రాలు ప్రమాదమని మూసివేస్తుంటే ఇక్కడ పెట్టడమేమిటని ప్రశ్నించారు.

అమెరికాలోని కరోలినా రాష్ట్రంలో అణువిద్యుత్తు కేంద్రం నిర్మాణానికి సుమారు 60 వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రమాదకరమని మధ్యలో పని నిలుపుదల చేసారని తెలిపారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ యురేనియం నిల్వలున్న ఆస్ట్రేలియాలో ఒక్క అణువిద్యుత్తు కేంద్రం కూడా లేదని తెలిపారు. 

దివాలా తీసిన వెస్టింగ్ హౌస్ కంపెనీతో కలిసి సుమారు ఆరు లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనంతో ఒకే చోట ఆరు అణు రియాక్టర్లు పెట్టడం దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల ప్రాణాలకు పెను ప్రమాదమని అన్నారు. అణువిద్యుత్తు అత్యంత ఖరీదైనదని ఇక్కడ లభించే విద్యుత్ రేటు యూనిట్  25 రూపాయలు అవుతుందని అన్నారు.

అణు విద్యుత్ కేంద్రం ఎందుకు?

నీరు, గాలి, సూర్య రశ్మితో చౌకగా యూనిట్ కరెంటు రూ. 2/- నుండి 3/- రూపాయలకే తయారు చేయవచ్చని అన్నారు. ఇటీవలి దాఖలైన సోలార్ బిడ్ల ప్రకారం సౌర విద్యుత్ యూనిట్ కు 3 రూపాయలకు మాత్రమే పడుతుందని భవిష్యత్తులో మరింత తగ్గుతుందని అన్నారు.

ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి అంత ఖర్చు అయ్యే అణువిద్యుత్తు కేంద్రం అవసరం లేదని అన్నారు. అమెరికా కార్పొరేట్ ప్రయోజనాలు కోసమే కేంద్ర బిజెపి ప్రభుత్వం కొవ్వాడలో అణుపార్కు పెడుతుందని విమర్శించారు. వినాశకర కొవ్వాడ అణుపార్కు వెంటనే రద్దు చేయాలని, అమెరికాతో భారత్ అణు ఒప్పదం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

 అణుపార్కుకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు పేరుతో స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల లాభాలకు దేశ ఆర్థిక వ్యవస్థను తాకట్టు పెడుతుందని విమర్శించారు. పార్లమెంటు హక్కులు కాలరాసి ఆప్రజాస్వామికంగా రైతాంగ, ప్రజా వ్యతిరేక బిల్లులను ఆమోదించుకుందని అన్నారు.

ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, కోశాధికారి అల్లు.సత్యనారాయణ నాయకులు ఎల్.మహేష్ పాల్గొన్నారు.

Related posts

నేడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం

Satyam NEWS

సేవ్ అమరావతి: చేతులు కలిపిన ప్రజా సంఘాలు

Satyam NEWS

USFI జాతీయ కన్వీనింగ్ కమిటీ కార్యవర్గ సభ్యునిగా పరశురాం

Satyam NEWS

Leave a Comment