కేంద్ర ప్రభుత్వం అందించే ముద్రా రుణాల పేరుతో నకిలీ యాప్ లను సృష్టించి లక్షల రూపాయలు కొల్లగొట్టిన ముఠాను వనపర్తి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ముఠా నుంచి 26 మొబైల్ ఫోన్ లు, 22 సిమ్ కార్డులు,5 మోటార్ సైకిల్ లు, నగదు రూ 85,000/- మొత్తం పది లక్షల రూపాయల విలువగల వస్తువులు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ విలేకరులకు తెలిపారు.
వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన కొత్త కుమ్మరి రాజు ముద్ర విశ్వకర్మ లోన్ కు జనవరి నెలలో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నాడు. కొన్ని రోజుల తరువాత, తేదీ 11.07.2024 నాడు సైబర్ నేరగాళ్లు ఒక వాట్సాప్ నెంబర్ నుండి అతని వాట్సాప్ నెంబర్ కు పీఎం విశ్వకర్మ లోన్ శాంక్షన్ కావటానికి డబ్బులు పంపించాలని మెసేజ్ పంపగా, అతను వారి గూగుల్ పే మరియు ఫోన్ పే నెంబర్లకు రెండు విడతలలో మొత్తం రూ 12,250/- పంపాడు. మళ్ళీ టాక్స్ కట్టాలని 9,000/- అడగగా అనుమానం వచ్చిన వెంటనే కొత్తకోట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
కొత్తకోట పోలీసు వారు ఐటీ యాక్ట్ కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి జంగమయ్యపల్లి గ్రామానికి చెందిన (పెద్దమందడి) కురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. సూత్రదారి నర్సింగ్ నాయక్ ను వనపర్తిలో అదుపులోకి తీసుకున్నారు. వనపర్తిలో ఒక కిరాయి రూములో రాతలవత్ రమేశ్, ఇస్లావాత్ రాములు అలియాస్ బాబు, కొత్తపల్లి ఉమేశ్, బోయ వీరేష్, ఇద్దరు మైనర్లను ఉంచి ముద్రా లోన్ అప్ ల ద్వారా కస్టమర్ల వివరాలు సేకరించారు. కేసు విచారణను తెలంగాణ సైబర్ సెక్యూరిటి బ్యూరో ఇంచార్జి, అడిషనల్ డిజిపి షికా ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ అధ్వర్యంలో జిల్లా సైబర్ సెక్యూరిటి ఇంచార్జి డీఎస్పీ రత్నం, కొత్తకోట సీఐ రాంబాబు, కొత్తకోట ఎస్ఐ మంజునాథ్ రెడ్డి జిల్లా పోలీసు సిబ్బంది ఉమ్మడిగా దర్యాప్తు చేసి సైబర్ నేరస్తులను గుర్తించి వారిలో8 మందిని ఆరెస్ట్ చేశారు.
8 మందిలో ఇద్దరు బాలురు ఉన్నారు. వీరందరూ రెండు తెలుగు రాష్ట్రాలలో 250 మందిని మోసగించి, దాదాపు ఇరవై లక్షలు కాజేశారని ఎస్పీ చెప్పారు. 26 మొబైల్ ఫోన్స్ విలువ దాదాపు రూ 5,00,000/-), 22 వివిద కంపనీల సిమ్ కార్డ్స్ , టు వీలర్స్ – 5 (జవా- 1, స్కూటీ -3, హోండా షైన్-1, మొత్తం విలువ రూ 4,15,000/-) నగదు రూ 85,000/- స్వాధీనపరుచుకున్నారు. మొత్తం విలువ దాదాపు రూ 10,00,000/-(10 లక్షలు).
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్