అమెరికాలో పుట్టి పెరిగినా మాతృభాష, దేవభాష మీద మమకారంతో చిన్నతనంలోనే కఠోర దీక్షతో సంస్కృతాంధ్ర పండితునిగా ఎదిగి అష్టావధానిగా ప్రఖ్యాతి గడించిన సరస్వతీ పుత్రుడు గన్నవరం లలిత్ ఆదిత్య. ఇటీవల కొద్ది రోజుల పర్యటన కోసం హైదరాబాద్ విచ్చేసిన లలిత్ ఈ సంవత్సరం జనవరి 16న రవీంద్రభారతిలో ఉద్దండులయిన పండితులు శతావధానులు, అష్టావధానులు, వేలాదిమంది సాహితీప్రియుల సమక్షంలో అద్వితీయంగా సంస్కృతాంధ్ర ద్విగుణిత అష్టావధానం చేసి సాహితీలోకాన్ని అబ్బురపరిచి సర్వత్రా ప్రశంసలు చూరగొన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ బాలుడు కొన్నేళ్లుగా అమెరికాలో సంస్కృతాంధ్ర అష్టావధానాలు అద్భుతంగా చేస్తున్నారు. అమెరికాలో ఏరో స్పేస్ ఇంజనీరింగ్ మొదటిసంవత్సరం పూర్తి చేసుకుని మూడునెలల సెలవుల కాలంలో భారతదేశానికి వచ్చి శృంగేరీ లోని రాష్ట్రీయ సంస్కృతవిద్యా పీఠంలోని ఓ ఆచార్యుని వద్ద వ్యాకరణం నేర్చుకున్నారు. శృంగేరీ జగద్గురువులు ఈ నవయువ విద్వన్మణి, అవధాని ఉభయభాషా పండిత్యానికి సంబురపడి ఆశీరానుగ్రహాన్ని కురిపించారు. కొద్దిరోజుల క్రితం పూణేలో జరిగిన లలిత్ అష్టావధానానికి వేలాదిమంది కిక్కిరిసిన సాహితీప్రియులనుంచి విశేష స్పందన వచ్చింది..ఈరోజే భాగ్యనగరానికి వచ్చిన లలిత్ ఆదిత్య 19న తిరిగి అమెరికా వెళ్తున్నారు. ఈ సందర్బంగా భాగ్యనగరంలో ఈ యువ అవధాన శిరోమణి “అష్టావధానం” ఆదివారం 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు నల్లకుంటలోని శృంగేరీ శంకరమఠం లో దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తామాసపత్రిక ఏర్పాటు చేసింది. అమెరికా తెలుగు తేజం 18 ఏళ్ల లలిత్ ఆదిత్య అష్టావధానాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ఈ అద్భుత సాహితీ ప్రక్రియను ఆస్వాదించటానికి సాహితీప్రియులందరూ అధికసంఖ్యలో పాల్గొనవలసిందిగా దర్శనమ్ సంపాదకుడు మరుమాముల వెంకటరమణ శర్మ (9441015469, 7013093123) ఒక ప్రకటనలో కోరారు.